సంక్రాంతి పండుగకు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆంధ్ర ప్రాంతంలో సంక్రాంతి పండుగను పెద్దగా పండుగగా జరుపుకుంటారు. ఏడాదంతా ఎక్కడున్నా సంక్రాంతికి కచ్చితంగా సొంతూరుకు వెళ్తుంటారు. ముగ్గులు, పిండి వంటి, హరిదాస కీర్తనలు, కొత్త అల్లుళ్ల రాక ఇలా.. ఇళ్లన్నీ సంతోషానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటాయి.
ఇటీవల పెరుగుతోన్న ట్రెండ్..
ఇక ఆంధ్రాలో సంక్రాంతి అనగానే గుర్తొచ్చే మరో అంశం కోడి పందాలు భీమవరంతో పాటు గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందాలను వీక్షించేందుకు, పాల్గొనేందుకు దేశంలో ఎక్కడెక్కడో ఉన్న తెలుగు వారంతా రాష్ట్రానికి వచ్చేస్తుంటారు. విదేశాల్లో ఉన్న తెలుగు వారు సైతం కోడి పందెల్లో పాల్గొనేందుకు వస్తారంటేనే వీటికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
తెలంగాణ ప్రాంతం నుంచి ఇటీవల పెద్ద ఎత్తున ఏపీలో సంక్రాంతి వేడుకలకు వెళ్తున్నారు. యువతతో పాటు కుటుంబాలు సైతం భీమవరంతో పాటు కొన్ని ప్రదేశాలకు వెళ్తున్నారు. ఈ వివరాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్నారు.
కనుము ప్రాముఖ్యత ఏంటి.?
సంక్రాంతి పండుగలో మూడో రోజైన కనుమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఈ పండుగను రైతుల పండుగగా చెబుతుంటారు. ఏడాదంతా తమ కష్టాల్లో భాగమైన పశువులను పూజించుకునే గొప్ప వేడుకను రైతులు ఎంతో సంబరంగా జరుపుకుంటారు. ఇదిలా ఉంటే కనుమ పండుగ రోజు ప్రయాణాలు చేయకూడదని పెద్దలు చెబుతుంటారు.
ఇప్పటికీ ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఒక నానుడి ప్రకారం.. కనుమ రోజు కాకులు కూడా ఎక్కడికీ కదలవని చెబుతుంటారు. పండక్కి ఇంటికి వచ్చిన వారు కనుమ రోజు తిరుగు ప్రయాణం చేయరాదనే ఆచారాన్ని పాటిస్తున్నారు.
అసలు లాజిక్ ఏంటంటే..
కనుమ పండుగ రోజు పశువులను పూజిస్తుంటారు. పశువులకు ఇంతటి గౌరవం ఇచ్చే గొప్ప సంస్కృతి ప్రపంచంలో చాలా తక్కువ ప్రదేశాల్లో ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. కనుమ రోజు రైతులు పశువులకు శుభ్రంగా స్నానం చేయించి.. పసుపు కుంకుమలతో పశువులను అలంకరిస్తారు. అనంతరం పశువులకు హారతి ఇచ్చి పూజిస్తారు. ఇక కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు అనడానికి ఒక లాజిక్ ఉంది.
పూర్వం ప్రజలు ప్రయాణాలకు ఎక్కువగా ఎడ్ల బండ్లను ఉపయోగించే వారు. ఎంత దూరమైనా ఎడ్ల బండ్లపైనే వెళ్లే వారు. అయితే పశువుల పండుగగా భావించే కనుమ రోజు వాటికి విశ్రాంతి కల్పించాలనే నియమాన్ని తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదనే ఓ నిబంధనను తీసుకొచ్చారని చెబుతుంటారు.
అయితే ఇప్పుడు ఎడ్ల బండ్లు లేవు వాటి స్థానంలో కార్లు వచ్చాయి. కానీ ఆచారాన్ని మాత్రం ఇంకా పాటిస్తూనే ఉన్నారు. ఇంకో ఒక్క రోజు ప్రశాంతంగా కుటుంబ సభ్యులతో గడిపి తెల్లారి మళ్లీ జీవన ప్రయాణం మొదలు పెట్టాలని పెద్దలు చెబుతుంటారు. ఇదండి కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదని చెప్పడంలో ఉన్న లాజిక్.