ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవడం వల్ల ఊబకాయం, మధుమేహం, రక్తప్రసరణ తగ్గడం వంటి సమస్యలొస్తాయని మాటను మీరు వినే ఉంటారు. కూర్చోవడంతో పాటుగా కదలకుండా ఒకే చోట ఎక్కువ సేపు నిలబడటం వల్ల కూడా ఆరోగ్యం దెబ్బతింటుందన్న సంగతి మీకు తెలుసా? చాలాసార్లు మనం ఏదో ఒక పని కోసం గంటల తరబడి లైన్లలో నిలబడుతుంటాం. లేదా మహిళలు వంటగదిలో ఎక్కువ సేపు నిలబడే వంట చేస్తారు. కానీ దీనివల్ల మీకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఎక్కువ సేపు నిలబడితే ఎలాంటి సమస్యలు వస్తాయంటే?
సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. ఎక్కువసేపు నిలబడటం వల్ల గుండె ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. నిజానికి నిలబడటం వల్ల పాదాల వైపు రక్తప్రసరణ ఎక్కువగా జరుగుతుంది. దీని వల్ల గుండెకు తగినంత రక్త ప్రసరణ జరగదు. దీనికితోడు కిందకు వచ్చిన రక్తాన్ని మళ్లీ పంప్ చేయడానికి గుండె చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇది గుండెపై భారాన్ని పెంచుతుంది.
ఎక్కువసేపు నిలబడటం వల్ల పాదాలలో వాపు కూడా వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకటే ఎక్కువ సేపు నిలబడటం వల్ల కాలు కింది భాగంలో రక్తం గడ్డకట్టడం జరుగుతుంది. దీని వల్ల పాదాలు వాపునకు గురవుతాయి. దీంతో నడవడానికి ఇబ్బంది కలుగుతుంది.
ఎక్కువ సేపు నిలబడటం వల్ల కాళ్లతో పాటుగా వెన్నునొప్పి, నడుము నొప్పి సమస్యలు మరింత పెరుగుతాయి. ఎక్కువ సేపు నిలబడటం భంగిమ క్షీణించడం వల్ల వెన్నునొప్పి, నడుము నొప్పి వస్తాయి.
ఎక్కువ సేపు నిలబడటం వల్ల కండరాలలో అలసట కూడా కలుగుతుంది. ఇది కండరాల నొప్పులకు కూడా కారణమవుతుంది. ఒక్కోసారి ఒళ్లంతా నొప్పిగా కూడా అనిపిస్తుంది. ఇది మీ మోకాలి కీళ్లను కూడా ప్రభావితం చేస్తుంది. ఇది మోకాళ్ల నొప్పులకు కారణమవుతుంది.
ఎక్కువ సేపు నిలబడటం వల్ల శరీరంలో రక్తప్రసరణ దెబ్బతింటుంది. దీని వల్ల సిరల్లో అడ్డంకులు ఏర్పడి పాదాల్లో నీలి రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇది కాలులో భరించలేని నొప్పిని కూడా కలిగిస్తుంది.