స్మార్ట్‌వాచ్‌లు వాడే వారికి షాకింగ్ న్యూస్‌.. క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం.

First Published | Dec 23, 2024, 2:49 PM IST

ఒకప్పుడు వాచ్‌ అంటే కేవలం సమయం తెలుసుకోవడానికి ఉపయోగపడే వస్తువు. కానీ ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్‌తో చేయలేని పని అంటూ లేదు. ఫోన్‌ కాల్స్‌ మొదలు, సోషల్‌ మీడియా అప్‌డేట్స్‌ వరకూ అన్ని పనులు వాచ్‌తోనే జరిగిపోతున్నాయి. అయితే స్టైల్‌తో పాటు ఎన్నో ఫీచర్లను అందిస్తున్న ఈ వాచ్‌లతో ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.. 
 

ప్రస్తుతం స్మార్ట్‌ వాచ్‌లను ఉపయోగిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. స్టైల్‌గా కనిపించే స్మార్ట్‌ వాచ్‌ ప్రాణాంతక వ్యాధికి దారి తీసే అవకాశం ఉందని తెలుసా? తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ఇలాంటి షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. స్మార్ట్‌వాచ్‌లు, బ్యాండ్‌ల తయారీలో ఉపయోగించే పాలీఫ్లోరో అల్కైల్‌, పర్‌ప్లోరోహెక్సనోయిక్‌ యాసిడ్స్‌ శరీరంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని పరిశోధనల్లో వెల్లడైంది. 
 

సాధారణంగా ఈ పాలీఫ్లోరో అల్కైల్‌ అనే రసాయనం నాన్‌ స్టిక్‌ వంట సామాగ్రితో పాటు సౌందర్య సాధనలు, దుస్తుల తయారీలో ఉపయోగిస్తుంటారు. ఇవి శరీరంలో అంత సులువుగా కలిసిపోవు. ఈ రసాయనాల కారణంగా సంతానోత్పత్తి సమస్యలు మొదలు క్యాన్సర్‌ వంటి సమస్యలకు దారి తీసే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. ఇక ఈ రసాయనాలు చర్మ క్యాన్సర్‌కు దారి తీసే ప్రమాదం ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అలాగే ప్రోస్టేట్‌, కిడ్నీలు, వృషణాల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదాన్ని పెంచే అవకాశాలు ఉంటాయని గతంలో నిర్వహించిన అధ్యయనంలో తేలింది. 
 


ఇక చేతికి ధరించే ఈ స్మార్ట్ వాచ్‌ల నుంచి రసాయనం సులభంగా చర్మంలోకి ఇంకిపోతుందని, తద్వార పలు చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎన్విరాన్‌మెంట్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ లెటర్స్‌లో ఈ వివరాలను ప్రచురించారు. 22 రకాల స్మార్ట్‌ వాచ్‌ బ్రాండ్‌లను విశ్లేషించిన తర్వాత ఈ నిర్ధారణకు వచ్చారు. మరీ ముఖ్యంగా రోజులో ఎక్కువ సేపు స్మార్ట్ వాచ్‌లను ధరించే వారిలో ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటున్నట్లు గుర్తించారు. 
 

ఇదిలా ఉంటే ఎక్కువ ధర కలిగిన స్మార్ట్‌ వాచ్‌ల్లోనే ఈ ప్రమాదకర రసాయనాల స్థాయి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీనికి విరుద్ధంగా తక్కువ ధర ఉన్న వాచ్‌ల్లో రసాయనాలు తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. 30 డాలర్ల కంటే ఎక్కువ ధర ఉన్న స్మార్ట్‌ వాచ్‌లో ఫ్లోరిన్‌ అధికంగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. అందుకే స్మార్ట్‌ వాచ్‌లను కొనుగోలు చేసే ముందు వాటి తయారీకి ఉపయోగించే వస్తువుల గురించి క్షుణ్నంగా గమనించాలని నిపుణులు చెబుతున్నారు. 
 

స్మార్ట్‌ వాచ్‌లకు ఉపయోగించే బెల్టులు ఎక్కువ కాలం మనికతో రంగును కోల్పోకుండా ఉండేందుకు ఈ రసాయనాలు ఉపయోగిస్తున్నారు. నోట్రే డామ్‌ పరిశోధకులు సుమారు 68 శాతం స్మార్ట్‌ వాచ్‌లలో ఈ రసాయనాలు ఉపయోగించినట్లు గుర్తించారు. కొన్ని కంపెనీలు కనీసం ఈ విషయాన్ని వెల్లడించలేవు కూడా. ఇక పరిశోధనలో తేలిన వివరాల ప్రకారం అమెరికాలో 21 శాతం, బ్రిటన్‌లో 35 శాతం మంది రోజుకు సగటున 11 గంటల పాటు స్మార్ట్‌ వాచ్‌లను ధరిస్తున్నట్లు తేలింది. ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీతో పాటు ఇతర సంస్థలు చెబుతోన్న దాని ప్రకారం ఫ్లోరోఎలాస్టోమర్‌లను కలిగి ఉన్న బ్యాండ్‌ల వినియోగాన్ని మానుకోవాలని సూచిస్తున్నారు. 
 

Latest Videos

click me!