
టమాటాలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుస్కలంగా ఉంటాయి. ఈ టమాటాలను ఒక్క వంటలకే కాదు.. జుట్టుకు కూడా ఉపయోగించొచ్చు. టమాటా రసాన్ని ఉపయోగించడం వల్ల జుట్టు పొడుగ్గా పెరుగుతుంది. అలాగే జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. నెత్తికి అవసరమైన పోషణను కూడా అందిస్తుంది. టమాటా రసాన్ని ఉపయోగించడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా అవుతాయి. అంతేకాదు కొత్త జుట్టు కూడా మొలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. మంచి సమతుల్య ఆహారంతో పాటుగా రెగ్యులర్ గా టమాటా రసాన్ని ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుంది. అలాగే మీ జుట్టు మందంగా కూడా అవుతుంది. ఇందుకోసం టమాటా రసాన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
టమాటా జుట్టు పెరగడానికి ఎలా ఉపయోగపడుతుంది.
టమాటాల్లో మన జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో పుష్కలంగా ఉండే విటమిన్ సి జుట్టు పెరుగుదలకు అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే టమాటాల్లో ఉండే లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ జుట్టు కుదుళ్లకు నష్టం కలిగించే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది.
టమాటాల్లో మెండుగా ఉండే విటమిన్ ఎ చర్మ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అలాగే నెత్తితి హైడ్రేట్ గా ఉంచి జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. అలాగే దీనిలో ఉండే బయోటిన్, జింక్ జుట్టును బలంగా చేస్తుంది. అలాగే జుట్టు సన్నబడటాన్ని తగ్గిస్తుంది. అలాగే నెత్తిమీద పిహెచ్ ను సమతుల్యంగా ఉంచుతుంది. చుండ్రును తగ్గించి జుట్టు తిరిగి పెరగడానికి సహాయపడుతుంది.
బట్టతల మీద వెంట్రుకలు రావడానికి టమాటా జ్యూస్ ను ఎలా ఉపయోగించాలి?
1. టమాటా రసం, స్కాల్ప్ మసాజ్
1 లేదా 2 ఫ్రెష్ టమాటాలను తీసుకుని గుజ్జు చేయండి. దీన్నుంచి రసాన్ని తీయండి. ఈ రసాన్ని నేరుగా మీ నెత్తికి అప్లై చేయండి. నెత్తి మీద రక్త ప్రసరణ పెరగడానికి కాసేపు వృత్తాకారంలో సున్నితంగా మసాజ్ చేయండి. 30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లు, తేలికపాటి షాంపూతో తలస్నానం చేయండి. దీన్ని వారానికి రెండుసార్లు ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.
2) టమాటా, కలబంద హెయిర్ మాస్క్
రెండు టీ స్పూన్ల టమాటా జ్యూస్ లో ఒక టీస్పూన్ కలబంద జెల్ ను వేసి కలపండి. ఈ హెయిర్ మాస్క్ ను తలకు, జుట్టుకు బాగా అప్లై చేయండి. 45 నిమిషాల తర్వాత శుభ్రంగా నెత్తిని కడగండి. కలబంద జెల్ మీ నెత్తిని మృదువుగా చేస్తుంది. అలాగే మంటను తగ్గిస్తుంది. జుట్టు తిరిగి పెరగడానికి సహాయపడుతుంది.
3) టమాటా జ్యూస్, కొబ్బరి నూనె
రెండు టీ స్పూన్ల టమాటా జ్యూస్ లో ఒక టీ స్పూన్ కొబ్బరి నూనెను వేసి బాగా కలపండి. అయితే కొబ్బరి నూనెను కొంచెం వేడి చేసి టమాటా రసంలో కలపాలి. ఈ మిశ్రమాన్ని నెత్తిమీద, బట్టతల మీద , ఎక్కడైతే వెంట్రుకలు పల్చగా ఉంటాయో అక్కడ రాసి కాసేపు మసాజ్ చేయండి. అయితే డీప్ ఫీడ్ కోసం రాత్రంతా దీన్ని అలాగే వదిలేయండి. మరుసటి రోజు ఉదయాన్నే నెత్తిని వాష్ చేయండి. ఇలా వారానికి రెండుసార్లు ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.
4) టామాటా జ్యూస్, ఉల్లిపాయ రసం
ఒక టీ స్పూన్ టమాటా జ్యూస్ లో ఒక టేబుల్ స్పూన్ ఉల్లిపాయ రసాన్ని వేసి బాగా కలపండి. దీన్ని తలకు బాగా రాయండి. 30 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి. ఈ హెయిర్ మాస్క్ నెత్తిమీద రక్తప్రసరణను పెంచుతుంది. అలాగే జుట్టు కుదుళ్లకు మంచి పోషణను అందిస్తుంది. కొత్త జుట్టు పెరగడానికి సహాయపడుతుంది.
అయితే నెత్తిమీద టమాటా రసాన్ని రాసే ముందు ఖచ్చితంగా ప్యాచ్ టెస్ట్ చేయాలి. ఎందుకంటే కొంతమందికి చికాకు పెడుతుంది. అలాగే టమాటా రసాన్ని ఎక్కువగా కూడా ఉపయోగించకూడదు. ఎందుకంటే దీనివల్ల మీ నెత్తిపొడిబారే అవకాశం ఉంది.ఇకపోతే మీ జుట్టు అంత తొందరగా తిరిగి పెరగదు. దీనికి కొంత రసమయం పడుతుంది. కానీ టమాటా జ్యూస్ ను రెగ్యులర్ గా ఉపయోగిస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. 2 నుంచి 3 నెలల్లో బట్టతల పాచెస్ లో క్రమంగా జుట్టు తిరిగి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.