ఇవి వేసినా కూడా బియ్యం, పప్పుల్లో పురుగులు పట్టవు...
ఎండు మిర్చి
బియ్యం డబ్బాలో అక్కడక్కడా కొన్ని ఎండు మిర్చిలను వేసి ఉంచండి. మిర్చిలోని ఘాటు వల్ల పురుగులు బియ్యం వైపు రావు. పప్పు ధాన్యాలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది.
బిర్యానీ ఆకు
బిర్యానీ ఆకులకు ఉండే ప్రత్యేకమైన వాసన పురుగులకు అస్సలు పడదు. బియ్యం లేదా పప్పుల డబ్బాలో పైభాగంలో 3-4 బిర్యానీ ఆకులు వేస్తే సరిపోతుంది. ఇది పురుగులను నివారించడమే కాకుండా ధాన్యానికి మంచి వాసనను కూడా ఇస్తుంది.
వేపాకులు
ఇది మన తాతమ్మల కాలం నాటి చిట్కా. బాగా ఎండిన వేపాకులను ఒక పల్చటి గుడ్డలో కట్టి బియ్యం బస్తాలో లేదా డబ్బాలో వేయండి. వేపలో ఉండే చేదు గుణం వల్ల ఎలాంటి పురుగులైనా, పుచ్చులైనా దరిచేరవు.
ఆవనూనె
ముఖ్యంగా కందిపప్పు, పెసరపప్పు లాంటి వాటికి పురుగు పట్టకుండా ఉండాలంటే.. ఒక కేజీ పప్పుకు ఒక టీస్పూన్ ఆవనూనెను వేసి బాగా కలిపి ఎండలో కాసేపు ఉంచి, ఆపై డబ్బాలో నిల్వ చేయండి. నూనె జిగురు వల్ల పురుగులు గుడ్లు పెట్టలేవు.
ఉప్పు (Salt)
బియ్యం నిల్వ చేసేటప్పుడు కొద్దిగా కల్లు ఉప్పును (Rock Salt) కలిపి ఉంచితే పురుగులు పట్టవు. ఉప్పు తేమను గ్రహించి బియ్యాన్ని పొడిగా ఉంచుతుంది, తద్వారా పురుగులు పెరగవు.