ఈ గ్రామానికి ఒక భయంకరమైన శాపం ఉందని.. అందుకే, దీపావళి జరుపుకోమని గ్రామస్థులు చెబుతున్నారు. ‘ ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం. పూర్వం ఈ గ్రామానికి చెందిన ఓ మహిళ తన భర్త చనిపోవడంతో సతి సహగమనం చేసింది. ఆ సమయంలో ఆమె ఈ గ్రామంలో ఎప్పటికీ దీపావళి పండగ జరుపుకోకూడదు అని శపించింది.ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఈ శాపం కారణంగా గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనలోనే బతుకుతున్నారు.’ అని గ్రామస్థులు చెబుతున్నారు.
పండగ చేసుకుంటే ఏం జరుగుతుంది..?
పొరపాటున ఎవరైనా ఈ గ్రామంలో దీపావళి జరుపుకోవడానికి ప్రయత్నిస్తే... ఊహించని సమస్యలు వస్తాయని గ్రామస్థులు నమ్ముతారు. చాలా సార్లు చాలా మంది ఈ గ్రామంలో పండగ చేసుకోవడానికి ప్రయత్నించారు. అలా ప్రయత్నించిన ప్రతిసారీ అక్కడ ఏదో ఒక ఘోర ప్రమాదం జరిగేదట. అగ్ని ప్రమాదాలు జరగడం, అకస్మాత్తుగా ఎవరి ఇంట్లో అయినా ధన నష్టం, ప్రాణం నష్టం జరగడం లేదా అకాల మరణం చెందడం వంటి విపత్తులు సంభవిస్తాయని గ్రామస్థులు తెలిపారు.
ఇక్కడ, దీపావళి పండగ జరుపుకోవడం అంటే.. కేవలం టపాసులు కాల్చకపోవడమే కాదు, కనీసం ఏ ఇంట్లోనూ దీపం కూడా వెలిగించరు. పండగ సందర్భంగా.. ఎలాంటి పిండి వంటలు కూడా చేసుకోరు. పొరపాటున వీటిలో ఏ ఒక్కటి చేసినా గ్రామంలో ప్రజల ప్రాణాలు పోయేవట. అందుకే.. అప్పటి నుంచి.. పండగ రోజు ఈ గ్రామం మొత్తం కటిక చీకటిలోనే గడిపేస్తుంది.
శాపాన్ని తొలగించే ప్రయత్నాలు ఫలించలేదా?
ఈ భయంకరమైన ఆచారాన్ని, శాపాన్ని తొలగించేందుకు స్థానికులు ఎన్నో రకాల పూజలు, పరిహారాలు, పూజారులతో క్రతువులు నిర్వహించినప్పటికీ శాపం ప్రభావం పోలేదని గ్రామస్తులు చెబుతున్నారు. పండుగ వస్తే చాలు ప్రమాదాలు జరుగుతాయనే భయంతో చాలామంది రోజంతా ఇళ్లలోనే ఉండిపోతారు.
‘ మనసులో దీపావళి జరుపుకోవాలని ఆశ ఉంటుంది. కానీ, మా ఊరి పరిస్థితి వల్ల ఏం చేయలేము. ఎలాంటి అలంకరణలు, కాంతులు ఉండవు. శతాబ్దం దాటినా ఈ శాపం మిమ్మల్ని వదలడం లేదు. ప్రపంచమంతా పండుగ వెలుగుల్లో మెరిసిపోతుంటే మా ఊరు మాత్రం చీకటిలో ఉండిపోతుంది. వేరే ఊళ్లలో ప్రజలు దీపావళిని ఎంత సంతోషంగా జరుపుకుంటారో చూడటానికి మేము పక్క ఊళ్లకు వెళ్లాల్సి వస్తోంది ’ అని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.