ఎండాకాలం అనగానే.. ఉక్కపోత, చెమట, చిరాకు పుట్టించే వేడి.. గుర్తుకువస్తాయి. అయితే ఎండాకాలం తెచ్చే ఓ అద్భుతమైన విషయం ఏంటంటే... ఈ కాలంలోనే అనేక రకాల పండ్లు, కూరగాయలు దొరుకుతాయి.
ఇవి వేడిని తట్టుకోవడానికి చాలా బాగా పనిచేస్తాయి. అంతే కాదు తక్కువ క్యాలరీలతో, ఎక్కువ పోషకాలు ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎండవేడిని వడగాలులను, దిగకారే చెమటల్ని తట్టుకోవాలంటే.. తప్పనిసరిగా ఈ పండ్లు, కూరగాయల్ని మీ డైట్ తో చేర్చండి.
వేడిని తట్టుకోవడానికి తాగే చల్లటి పానీయాలు, స్మూతీలతో తెలియకుండానే ఒంట్లోకి చేరిపోయే షుగర్ కంటే ఇవి చాలా మంచివి. ముఖ్యంగా డైటింగ్ చేసేవారికి ఇవి చక్కటి ప్రత్యామ్నాయంగా పనిచేస్తాయి.
మామిడి పండ్లు : పోషకాలు సమృద్ధిగా ఉండి వేసవిలో ఎక్కువగా దొరికే పండు మామిడి. దీన్ని చిన్న పిల్లలనుంచి పెద్దవారి వరకు అందరూ ఎంతో ఇష్టపడతారు. మామిడిపండును రసంగా, స్మూతీగా లేదాంటే అలాగే కోసుకుని తినేయచ్చు. కాకపోతే ఇందలో అధిక క్యాలరీలు ఉంటాయి కాబట్టి... రోజుకు మీరు తీసుకునే క్యాలరీ కౌంట్ ను బట్టి పండును తినడం మంచిది.
కింగ్ ఆఫ్ ది ఫ్రూట్స్ గా పిలిచే మామిడిపండులో విటమిన్ ఎ, సిలతో పాటు సోడియం, ఫైబర్, 20 కి పైగా ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఊబకాయం, గుండె జబ్బులను నివారించడంలో బాగా పనిచేస్తాయి. మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి..
మామిడిపండు 88 శాతం నీటితో తయారవుతుంది. కాబట్టి వేసవిలో శరీరంలోని ఫ్లూయిడ్ లెవల్ తగ్గకుండా ఇది చూసుకుంటుంది. అందుకే ఎలాంటి అపోహలూ పెట్టుకోకుండా.. రోజూ సరైన మోతాదులో మామిడి పండు తినడం చాలా మంచిది.
పుచ్చపండు : పైన పచ్చగా.. లోన ఎర్రగా ఉండే తియ్యటి, రుచికరమైన పండు ఇది. వేడిని తగ్గించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. పుచ్చపండులో 92% నీరు ఉంటుంది.
శరీరాన్ని హైడ్రేట్ కాకుండా చేయగలిగిన అద్భుతమైన పండు ఇది. దీంట్లో ఫైబర్, విటమిన్ సి, విటమిన్ ఎ, మెగ్నీషియం, పొటాషియం, యాంటీఆక్సిడెంట్ లైకోపీన్ లు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల క్యాన్సర్, స్ట్రోక్ వచ్చే ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడుతుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది.
నారింజ : సిట్రస్ జాతికి చెందిన పండు. పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది వేసవిలో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి చాలా అవసరమైన పోషకం. అధిక వేడి వల్ల వచ్చే చెమటతో శరీరం పొటాషియంను కోల్పోతుంది. దీనివల్ల కండరాల తిమ్మిరికి దారితీస్తుంది.
ఈ సిట్రస్ జాతి పండు తినడం వల్ల ఈ ముఖ్యమైన పోషకం తిరిగి శరీరానికి అందుతుంది. దీంతో మిమ్మల్ని హైడ్రేట్ అయి, డ్రెయిన్ అయిపోకుండా కాపాడుతుంది. ఆరెంజ్ లో 88 శాతం నీరు ఉంటుంది. దీంతో పాటు విటమిన్ సి, ఎ, కాల్షియం, ఫైబర్ కూడా పుష్కలంగా ఉన్నాయి.
ఖీరా దోసకాయ : ఆకుపచ్చటి రంగులో ఉండే ఈ దోసకాయను చూడగానే వేసవి పారిపోతుంది. ఇది సహజ శీతలీకరణ లక్షణాలు కలిగి ఉంటుంది. కాబట్టి డీ హైడ్రేషన్ నుంచి మిమ్మల్ని కాపాడి, శరీరం వేడెక్కకుండా చూస్తుంది.
విటమిన్ కె, పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉన్న దోసకాయలో 95 శాతం నీరు ఉంటుంది. అంతేకాదు దీంట్లో క్యాలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇది మీ శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. మీ చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచుతుంది.
టమాటాలు : టమాటాను పండుగా తినొచ్చు, కూరగా వాడొచ్చు. ఇది రెండు రకాలుగానూ ఉపయోగపడుతుంది. వీటిని మీ రోజువారీ ఆహారంలో చేర్చడం వల్ల మీకు కొన్ని ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి.
ఈ ఎర్రటి పండ్లలో విటమిన్ ఎ, బి 2, సి, ఫోలేట్, క్రోమియం, ఫైబర్, పొటాషియం, ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. కూర లేదా సలాడ్‌లో టమాటాను కలవడం వల్ల క్యాన్సర్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, గుండె జబ్బుల నుండి మిమ్మల్ని మీరు నివారించుకోవచ్చు. టొమాటోలు 95 శాతం నీటితో తయారవుతాయి.