కలబంద మన ఆరోగ్యానికే కాదు చర్మం, జుట్టుకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే చాలా మంది జుట్టును అందంగా, ఒత్తుగా మార్చడానికి, ఊడిపోకుండా కాపాడటానికి కలబంద జెల్ ను నెత్తికి తరచుగా పెడుతూ ఉంటారు. నిజానికి నెత్తిమీద దుమ్ము పేరుకుపోవడం, శరీరంలో పోషకాలు లోపించడం వల్ల వెంట్రుకలు రెండుగా చీలిపోవడంతో పాటుగా రాలిపోతూ ఉంటాయి. అలాగే వెంట్రుకలు జీవం లేనట్టుగా కూడా కనిపిస్తాయి. అలాంటప్పుడు అలోవెరా జెల్ ను జుట్టుకు అప్లై చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. కలబంద జెల్ జుట్టును దృఢంగా మారుస్తుంది. కానీ కలబంద జెల్ ను మోతాదుకు మించి ఉపయోగించడం అస్సలు మంచిది కాదు. అసలు కలబంద జెల్ ను ఎక్కువగా నెత్తికి అప్లై చేయడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
దురద సమస్య
కలబంద జెల్ ను నెత్తికి అప్లై చేయడం వల్ల నెత్తిమీదున్న చుండ్రు పోతుంది. దురద కూడా తగ్గుతుంది. అయితే దీన్ని మోతాదుకు మించి నెత్తికి పెడితే కూడా తలపై దురద, బర్నింగ్ వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
నెత్తిమీద క్రస్ట్
కొన్ని కొన్ని సార్లు కలబంద జెల్ ను నెత్తిమీద అప్లై చేయడం వల్ల నెత్తిమీద క్రస్ట్ లు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. కానీ వీటిపై మనం దృష్టి పెట్టం. దీనివల్ల ఇవి బాగా పెరుగుతాయి. ఇది మీ నెత్తి దెబ్బతినడానికి కారణమవుతుంది.
జలుబు
కలబందను మరీ ఎక్కువగా వాడితే కూడా కొన్ని కొన్ని సార్లు జలుబు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. నిజానికి కలబందలో చలువ చేసే గుణముంటుంది. అందుకే దీన్ని ఎక్కువగా వాడితే జలుబు వస్తుంది.
జిడ్డుగల జుట్టు
కలబంద జెల్ మన జుట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిని వాడటం వల్ల జుట్టు అందంగా కనిపిస్తుంది. మృదువుగా మారుతుంది. కానీ కొన్నిసార్లు దీనిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల మీ జుట్టు జిడ్డుగా మారుతుంది. జిడ్డుగల జుట్టు ఉన్నవారు కలబంద జెల్ వాడకపోవడమే బెటర్.
బొబ్బలు
మంచి చేస్తుందని చాలా మంది దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కానీ ఇది నెత్తి బొబ్బలను కలిగిస్తుంది. ఇవి చాలా నొప్పి పెడతాయి. అందుకే వారానికి 1-2 సార్ల కంటే ఎక్కువ సార్లు అలోవెరా జెల్ ను ఉపయోగించకుండా ఉండాలి.