భారతదేశంలో జంతువులను పూజించడం ప్రత్యేకమైన ఆచారం. గొప్ప విషయం ఏమిటంటే ఇప్పటికీ ఈ ఆచారం పల్లెల్లో కొనసాగుతోంది. సిటీస్ లో అయితే పండగలు, ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో చెట్లకి, జంతువులకి పూజలు చేస్తారు. జంతువులు దేవతలతో అనుబంధం కలిగి ఉన్నాయని చాలా మంది విశ్వాసం. ఇండియాలో ప్రకృతినే దేవుడిగా భావిస్తారు. ఈ జంతువులు కూడా ప్రకృతిలో భాగమని నమ్ముతారు. అలాంటి కొన్ని ముఖ్యమైన జంతువుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఆవు(Cow)
ఆవును హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. గోమాత, కామధేను అనే పేర్లతో ఆవును పూజిస్తారు. ఆవు శ్రీ కృష్ణుడికి ఇష్టమైన జంతువని భక్తులు నమ్ముతారు. అంతేకాకుండా ఆవు పాలు, పేడ, మూత్రం అన్ని పవిత్రంగా భావిస్తారు. గోవును కాపాడటం, దానికి ఆహారం పెట్టటం భక్తులు ప్రేమగా చేస్తారు. గోవును హింసించకూడదని కొందరు ప్రత్యేకంగా గోసంరక్షణ శాలలు నిర్వహిస్తుంటారు. చాలా ప్రాంతాల్లో ఆవులకు సీమంతాలు కూడా చేస్తారు. ముఖ్యంగా గోకుల అష్టమి రోజు ఆవులను పూజిస్తారు.
నాగుపాము(Snake)
విషపూరితమైన పాములను సైతం భక్తిభావంతో పూజించడం భారతీయుల ప్రత్యేకత. నాగు పామును సాక్షాత్తు పరమశివుడు ఆభరణంగా ధరించాడని, అందువల్ల పాములు కూడా దేవుడితో సమానమని భక్తులు భావిస్తారు. నాగపంచమి, నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్టి లాంటి పండగల్లో పాములు, పుట్టలను ప్రత్యేకంగా పూజిస్తారు. నాగదేవతను పూజించడం ద్వారా సర్పదోషం పోతుందని, శివుడి అనుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం.
ఎద్దు(Bull)
ఎద్దును వృషభేశ్వరుడు, నందీశ్వరుడు అంటూ భక్తులు పూజిస్తారు. ఎద్దు శివుడి వాహనం కూడా కావడంతో భక్తులు అత్యంత భక్తిభావంతో కొలుస్తారు. శివాలయాల్లో కచ్చితంగా నంది విగ్రహం ఉంటుంది. నందిని పూజించడం ద్వారా శివుడి కృప లభిస్తుందని భక్తలు విశ్వాసం. శివాలయాలకు వెళ్ళినప్పుడు, మొదటగా నంది విగ్రహానికి నమస్కారం పెట్టడం ఒక ఆచారం. ఈ వృషభం ధర్మానికి, సత్యానికి ప్రతీక అని హిందూ పురాణాల్లో ఉంది.
కోతి(Monkey)
కోతిని హనుమంతుడి ప్రతి రూపంగా భక్తులు నమ్ముతారు. ఆయన రామాయణంలో కీలక పాత్ర పోషించారు. హనుమంతుడు అత్యంత భక్తి పరుడు. హనుమంతుడిని పూజించడం ద్వారా భక్తి, బలము, ధైర్యం, తెలివి పొందవచ్చు అని భక్తుల నమ్మకం. హనుమాన్ ఆలయాల వద్ద కోతులను అత్యంత గౌరవంగా చూస్తారు.
పులి(Tiger)
పులి దుర్గా అమ్మవారి వాహనం. ఆమె పులిని స్వారీ చేస్తుంది. అంటే ప్రజలు కూడా మనలో ఉండే క్రూరమైన లక్షణాలను అణచి వేయాలని సూచిక. అదేవిధంగా అయ్యప్ప స్వామికి కూడా పులే వాహనం. అలాంటి పులిని దీక్షలు చేసే వారు భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. పులికి పూజ చేయడం ద్వారా మనలో ఉండే రాక్షణ గుణాలు తగ్గుతాయని భక్తుల నమ్మకం.
ఏనుగు(Elephant)
ఏనుగు వినాయకుడి స్వరూపం. ఏనుగు తలను శిరస్సుగా కలిగిన వాడు కనుక గజాననుడుగా వినాయకుడిని పిలుస్తారు. అందుకే కొన్ని ఆలయాల్లో ఏనుగులు పెంచుతూ భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. కష్టాలను తొలగించే దేవుడిగా విఘ్నేశ్వరుడిని కొలుస్తారు. ఆయన స్వరూపమైన ఏనుగును కూడా భక్తులు తమ కష్టాలు తొలగించమని కోరతారు. ఏనుగును పూజించడం వల్ల చదువు బాగా వస్తుందని నమ్ముతారు.
చేప(Fish)
హిందూ పురాణాల ప్రకారం మత్స్య అవతారంలో విష్ణువు భూమిని కాపాడాడు. అందువల్ల చేపను విష్ణువు అవతారంగా భావిస్తారు. మత్స్య అవతారంలో ఉన్న విష్ణువును పూజించడం వల్ల ప్రాణ రక్షణ కలుగుతుందని భక్తుల విశ్వాసం. చేపలను ఎక్కువగా నార్త్ ఇండియాలోని అస్సాం రాష్ర్టంలో ప్రత్యేకంగా పూజిస్తారు.
తాబేలు(Tortoise)
హిందూ పురాణాల ప్రకారం క్షీరసాగర మథనంలో తాబేలు కీలక పాత్ర పోషించింది. తాబేలు పర్వతాన్ని నీటిలో మునిగిపోకుండా తనపై నిలుపుకొంటుంది. అందువల్లనే మథనం ఆటంకాలు లేకుండా జరుగుతుంది. ఇలా మహా విష్ణువే తాబేలు రూపంలో వచ్చాడని ప్రజల విశ్వాసం. అందుకే తాబేలును దైవ స్వరూపంగా భావిస్తారు. కూర్మ రూపంలో విష్ణువుని పూజించడం ద్వారా స్థిరత్వం కలుగుతుందని భక్తుల విశ్వాసం.
నెమలి(Peacock)
నెమలి కుమార స్వామి వాహనం. నెమలి పింఛాన్ని కృష్ణుడు కూడా ధరించడం వల్ల ఈ జంతువును భక్తి భావంతోనే కొందరు భక్తులు కొలుస్తారు. ప్రతి సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయంలో నెమలి వాహనం ఉంటుంది. సుబహ్మణ్య షష్టి, నాగుల చవితి, నాగ పంచమి పండగల్లో కొందరు నెమలి విగ్రహాలకు కూడా పూజలు చేస్తారు. దేవాలయాల వద్ద నెమలులు తిరుగుతుండటం శుభానికి సంకేతమని భక్తుల విశ్వాసం.
కుక్క(dog)
హిందూ పురాణాల ప్రకారం కుక్క కాలభైరవుడిగా ప్రసిద్ధి చెందింది. అంటే శివుడు కాల భైరవుడి రూపంలో గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను రక్షిస్తూ ఉంటాడని నమ్మకం. అందుకే కుక్కను కూడా కొందరు భక్తులు భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ముఖ్యంగా కొన్ని దోషాలు ఉన్న వారు కాలభైరవాస్టకం, కాలభైరవ పూజ పేరిట కుక్కలను ప్రత్యేక సందర్భాల్లో పూజిస్తారు. నేపాల్, నార్త్ ఇండియాలో కుకుర్ తీహార్ పండగ సమయంలో కుక్కలను పూజిస్తారు.
ఎలుక(Mouse)
రాజస్థాన్ లోని కర్ణిమాత ఆలయంలో ఎలుకలను చాలా జాగ్రత్తగా చూస్తారు. ఇక్కడ అమ్మవారు ఎలుకల రూపంలో తిరుగుతుంటారని భక్తులు నమ్ముతారు. వాటికి ఇష్టమైన ఫుడ్ పెడతారు. ఇంకో విషయం ఏమిటంటే విఘ్నేశ్వరుడికి వాహనం ఎలుక. దీన్ని మూషికం అని పిలుస్తారు. ముఖ్యంగా గణపతి నవరాత్రి సమయంలో వినాయకుడి వాహనమైన ఎలుకకు కూడా ఆయనతోపాటే పూజ చేస్తారు.