
వంటకు రుచి పెంచడంలో ఉల్లిపాయ ముందు వరసలో ఉంటుంది. ప్రతి ఇంట్లోనూ ఏ కూరగాయలు కచ్చితంగా ఉంటాయి. మనం వాటిని ప్రతిరోజూ వంటకు ఉపయోగిస్తూ ఉంటాం. కేవలం... వంటకు మాత్రమే కాదు.. మన జుట్టు ఒత్తుగా పెంచుకోవడానికి కూడా ఈ ఉల్లిపాయలు చాలా బాగా సహాయపడతాయి. అయితే.. మార్కెట్లో మనకు ఉల్లిపాయతో తయారు చేసిన హెయిర్ ఆయిల్, హెయిర్ షాంపూ లు చాలానే దొరుకుతాయి. కానీ మనం రోజూ పడేసే ఉల్లి తొక్కలతో కూడా జుట్టు ఒత్తుగా పెంచుకోవచ్చు అని మీకు తెలుసా? అదెలాగో ఇప్పుడు చూద్దాం...
చాలా మంది జుట్టు రాలుతోంది అనగానే.. వెంటనే కెమికల్స్ తో నిండిన ఖరీదైన హెయిర్ సీరమ్, కండిషనర్లను వాడుతూ ఉంటారు. కానీ, వాటి వల్ల జుట్టు రాలడం మరింత పెరుగుతుంది. వీటికి బదులు.. ఈ ఉల్లిపాయ తొక్కలను వాడి.. జుట్టు రాలే సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టొచ్చు.
ఉల్లిపాయ లోపలి భాగం కంటే దాని వెలుపలి పొట్టులోనే అత్యధిక పోషకాలు ఎక్కువగా ఉంటాయని సైన్స్ చెబుతోంది. ఇందులో జుట్టుకు అవసరమయ్యే ముఖ్యమైన పోషకాలు చాలా ఉన్నాయి.
క్వెర్సెటిన్ : ఇది ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది మాడుపై రక్తప్రసరణను వేగవంతం చేసి, బలహీనపడిన వెంట్రుకల కుదుళ్లను మళ్లీ యాక్టివేట్ చేస్తుంది.
సల్ఫర్ : వెంట్రుకలు బలంగా పెరగడానికి 'కెరాటిన్' అనే ప్రోటీన్ చాలా ముఖ్యం. పొట్టులో ఉండే సహజ సల్ఫర్ కెరాటిన్ ఉత్పత్తిని పెంచి జుట్టు తెగిపోకుండా చూస్తుంది.
విటమిన్లు, ఫ్లేవనాయిడ్లు: ఇందులో ఉండే విటమిన్ ఎ, సి, ఇ ఫ్లేవనాయిడ్లు కుదుళ్లకు ఇన్ఫెక్షన్లు సోకకుండా రక్షణ కవచంలా పనిచేస్తాయి.
1. జుట్టు రాలడం తక్షణమే తగ్గుతుంది: ఉల్లి పొట్టులోని సల్ఫర్, క్వెర్సెటిన్ కాంబినేషన్ మాడులోని కుదుళ్లకు బలాన్ని ఇస్తుంది. దీనివల్ల కొద్దిరోజుల్లోనే జుట్టు రాలడం గణనీయంగా తగ్గుతుంది.
2. చుండ్రు, దురదకు చెక్: ఇందులో ఉండే యాంటీ-మైక్రోబియల్ గుణాలు మాడుపై ఫంగల్ ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి. పొడిబారిన మాడుపై వచ్చే దురద, చుండ్రు సమస్యలు త్వరగా నయమవుతాయి.
3. నాచురల్ షైన్ & మృదుత్వం: ఈ నీరు ఒక నాచురల్ కండిషనర్‌లా పనిచేస్తుంది. నిర్జీవంగా మారిన జుట్టును మృదువుగా, కాంతివంతంగా మారుస్తుంది.
4. అకాల మెరుపు నివారణ: పొట్టులోని పోషకాలు కుదుళ్లలో మెలనిన్ ఉత్పత్తిని కాపాడుతాయి. ఫలితంగా చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడకుండా నివారిస్తుంది.
3-4 పెద్ద ఎర్రటి ఉల్లిపాయల బయటి పొట్టును తీసుకోండి. పైన ఉన్న దుమ్ము పోయేలా నీటితో ఒకసారి శుభ్రం చేయండి. తర్వాత ఒక పాత్రలో 2 నుండి 3 గ్లాసుల నీటిని తీసుకుని, అందులో ఈ పొట్టును వేసి 15-20 నిమిషాల పాటు సన్నని మంటపై మరగబెట్టండి. నీరు ముదురు గోధుమ లేదా వైన్ ఎరుపు రంగులోకి మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. మంచి సువాసన, ఎక్కువ పోషకాల కోసం మరిగేటప్పుడు కొన్ని రోజ్ మేరీ ఆకులు లేదా మెంతులు కూడా వేసుకోవచ్చు. నీటిని పూర్తిగా చల్లార్చి, వడకట్టి స్ప్రే బాటిల్‌లో పోసుకోండి. ఈ నీటిని ఫ్రిజ్‌లో 7 నుండి 10 రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు.
ఎలా ఉపయోగించాలి? మైల్డ్ షాంపూతో తలస్నానం చేసిన తర్వాత, ఈ ఉల్లి పొట్టు నీటిని మాడు నుండి జుట్టు చివరి వరకు బాగా పట్టించాలి. 5-10 నిమిషాలు మృదువుగా మసాజ్ చేసి, ఆ తర్వాత మామూలు చల్లటి నీటితో కడిగేయాలి. కడిగిన తర్వాత మళ్లీ షాంపూ చేయకూడదు. తలస్నానానికి గంట ముందు లేదా రాత్రి పడుకునే ముందు మాడుపై స్ప్రే చేసుకుని వేళ్లతో మసాజ్ చేయవచ్చు.
ఉల్లి రసంతో పోలిస్తే ఈ నీటికి ఘాటైన వాసన ఉండదు. అయినప్పటికీ సున్నితమైన చర్మం ఉన్నవారు మొదటిసారి వాడేటప్పుడు ఒకసారి 'ప్యాచ్ టెస్ట్' చేసుకోవడం మంచిది.