Telugu Saying: 'కట్టే, కొట్టే, తెచ్చే' సామెత అసలు అర్థం ఏంటో తెలుసా?

Published : Jun 18, 2026, 03:01 PM IST

Telugu Saying: తెలుగు భాషలోని సామెతలు, జాతీయాలు నిత్య జీవితంలో భాగమైపోయాయి. ఒక విషయాన్ని సోది లేకుండా చెప్పాల్సి వచ్చినప్పుడు వాడే సామెత "కట్టే కొట్టే తెచ్చే". కేవలం 3 పదాలతో మహా కావ్యాన్నే కుదించి చెప్పే ఈ సామెత ఎక్కడి నుంచి వచ్చింది? దీని కథ ఏంటి? 

PREV
15
'కట్టే, కొట్టే, తెచ్చే' సామెత అర్థం తెలుసా?

ఈ సామెత వెనుక ఒక రసవత్తరమైన ఐతిహ్య కథ ప్రచారంలో ఉంది. పూర్వం ఒక రాజుగారికి సాహిత్యం అన్నా, కథలు అన్నా చాలా ఇష్టం. అయితే ఆయనకు సమయం తక్కువ, ఓపిక కూడా తక్కువే. ఒకరోజు ఆయన తన ఆస్థాన కవిని పిలిచి, మన హిందూ సంస్కృతికి మూలస్తంభమైన, అత్యంత సుదీర్ఘమైన "రామాయణ మహా కావ్యాన్ని" చాలా క్లుప్తంగా, కేవలం మూడు ముక్కల్లో చెప్పాలని షరతు విధిస్తాడు. 

అంత పెద్ద గ్రంథాన్ని, వేల శ్లోకాల కావ్యసారాన్ని మూడు పదాలలో చెప్పడం సామాన్యమైన విషయం కాదు. కానీ ఆ కవి తన అసాధారణ సమయస్ఫూర్తితో, చాకచక్యంతో కేవలం మూడు క్రియా పదాలను ఉపయోగించి మొత్తం రామాయణాన్ని రాజుగారి కళ్లకు కట్టాడు. ఆ పదాలే – కట్టే, కొట్టే, తెచ్చే. మూడు పదాల వెనుక దాగున్న రామాయణ పరమార్థం. ఈ మూడు చిన్న పదాలలో రామాయణంలోని ప్రధానమైన ఘట్టాలు, కాండలు ఇమిడి ఉన్నాయి.

25
కట్టే (వారధి నిర్మాణం):

శ్రీరాముడి భార్య అయిన సీతాదేవిని రావణాసురుడు అపహరించి లంకలో బంధిస్తాడు. ఆమెను రక్షించడానికి రాముడు తన వానర సైన్యంతో కలిసి లంకా నగరానికి చేరుకోవాలి. అందుకోసం సముద్రంపై వారధి(బ్రిడ్జి)ని కట్టాడు. ఇది రామాయణంలోని కిష్కింధ, సుందర కాండల ఘట్టాన్ని సూచిస్తుంది.

35
కొట్టే (రావణ సంహారం):

వారధి దాటి లంకలో అడుగుపెట్టిన తర్వాత, అధర్మానికి, అహంకారానికి ప్రతిరూపమైన "రావణాసురుడిని, అతని రాక్షస మూకలను శ్రీరాముడు యుద్ధంలో కొట్టాడు (సంహరించాడు). ఇది రామాయణంలో అత్యంత కీలకమైన యుద్ధ కాండను ప్రతిబింబిస్తుంది.

45
తెచ్చే (సీతాన్వేషణ ముగింపు):

రావణుడిని అంతమొందించి, లంకపై విజయం సాధించిన తర్వాత, అశోకవనంలో బందీగా ఉన్న "సీతాదేవిని రాముడు సగర్వంగా తిరిగి అయోధ్యకు తెచ్చాడు". దీంతో రామాయణ పరమార్థం పూర్తవుతుంది.

55
తెలుగు భాష గొప్పదనం

ఆనాడు కవి రాజుగారి కోసం వాడిన ఈ మాటలు, నేడు మన దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన కమ్యూనికేషన్ స్కిల్‌గా మారిపోయాయి. నేటి బిజీ లైఫ్‌లో ఎవరికీ ఉపన్యాసాలు వినే ఓపిక లేదు. ఆఫీసులు లేదా సమావేశాల్లో ఎవరైనా సాగదీసి మాట్లాడుతుంటే, సోది ఆపి.. కట్టే, కొట్టే, తెచ్చే అన్నట్లు అసలు విషయం చెప్పు అని వాడతాం.

తెలుగు భాషలో ఉన్న గొప్పదనం ఇదే. కొన్ని వందల పేజీల గ్రంథాన్ని కూడా కేవలం మూడు పదాలలో ఇమిడ్చి చెప్పగల అద్భుతమైన శక్తి మన సామెతలకు ఉంది. 'కట్టే, కొట్టే, తెచ్చే' అనే ఈ చిన్న సామెత కేవలం రామాయణ సారాంశం మాత్రమే కాదు.. నిగూఢమైన విషయాలను సైతం ఎంత సులభంగా, సూటిగా వ్యక్తపరచవచ్చో తెలిపే ఒక అద్భుత భాషా చమత్కారం. 

Read more Photos on
click me!

Recommended Stories