రైలు ప్రయాణం అంటేనే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది కదా.. వెనక్కు పరుగెడుతున్న చెట్లు, కొండలు, వాగులు, వంతెనలను చూస్తుంటే ఎంత హాయిగా ఉంటుందో జర్నీ చేసిన వారికి బాగా అర్థమవుతుంది. ట్రైన్ లో ప్రయాణమంటేనే చాలా హాయిగా ఉంటుంది. ముఖ్యంగా విండో పక్కన సీటులో కూర్చొని ప్రయాణిస్తుంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. పిల్లలు సరే.. పెద్దలు కూడా విండో పక్కన సీటు దొరికితే చాలా హ్యాపీగా ఫీలవుతారు.
జనరల్ బోగీల్లోనే ఇలా ఉంటే ఇక రిజర్వేషన్ బోగీల్లో సైడ్ లోయర్ బెర్త్ కు చాలా డిమాండ్ ఉంటుంది. రిజర్వేషన్ బోగీల్లో ఈ ఒక్కసీటు మాత్రమే సౌకర్యవంతంగా ఉంటుంది. మూడు బెర్తులు ఉన్న చోట లోయర్ బెర్త్ లో ఇబ్బందులు ఉంటాయి. మిడిల్ బెర్త్ రిజర్వేషన్ చేసుకున్న వారు నిద్రపోతామంటే కచ్చితంగా లోయర్ బెర్త్ వారు కూర్చోడానికి ఉండదు. కాని సైడ్ లోయర్ బెర్త్ రిజర్వ్ చేసుకున్న వారికి ఇలాంటి ఇబ్బంది ఉండదు.
రైలు ప్రయాణంలో సైడ్ లోయర్ బెర్త్‌తో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది సులభంగా అందుబాటులో ఉంటుంది. సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. సైడ్ బెర్త్‌లో కూర్చోవడానికి, పడుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇక్కడ కూర్చుని బయటి ప్రదేశాలను చాలా బాగా చూడవచ్చు. విశాలవంతమైన కిటికీల వల్ల బయట పరిసరాలన్నీ చాలా దగ్గరగా కనిపిస్తాయి.
ఈ సీట్లు ఏసీ, నాన్ ఏసీ బోగీలలో లభిస్తాయి. ఇతర బెర్త్‌ల మాదిరిగా కాకుండా సైడ్ లోయర్ బెర్త్ కూర్చోవడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. పెద్దలు, పిల్లలు, వృద్ధులు అందరికీ సౌకర్యంగా ఉంటుంది. ఒకవేళ మీకు సైడ్ లోయర్ బెర్త్ కావాలనుకుంటే Redbus, IRCTC వంటి రైలు టికెట్ బుకింగ్ వెబ్‌సైట్‌లలో చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. బెర్త్ ప్రిఫరెన్స్ ఆప్షన్ లో సైడ్ లోయర్ బెర్త్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఖాళీ ఉందో లేదో తెలుస్తుంది. సైడ్ లోయర్ బెర్త్‌ను సులభంగా మడత పెట్టవచ్చు. దీని వల్ల ఎప్పుడు కావాలన్నా కూర్చొచ్చు. పడుకొనే విధంగానూ ఈజీగా మార్చుకోవచ్చు.
సైడ్ లోయర్ బెర్త్ వల్ల ఎన్ని ఉపయోగాలు, సౌకర్యాలు ఉన్నాయో దానికి తగ్గట్టుగానే ఇబ్బందులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా దొంగల భయం. కిటికీ పక్కనే ఉండటం వల్ల ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్లాట్ ఫాం పై ఉండే దొంగలు వారి చేతులకు పని చెబుతారు. ట్రైన్ కదిలే టైమ్ లో సెల్ ఫోన్లు, మెడలో ఉండే చైన్లు లాక్కెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది.
ఇంకో విషయం ఏంటంటే లోయర్ బెర్త్ కావడం వల్ల కొంచెం ఖాళీ ఉన్నా రిజర్వేషన్ లేని వారు వచ్చి కూర్చొంటారు. కాసేపు కూర్చొంటామని చెప్పి నెమ్మదిగా సీట్ ఆక్రమించేస్తారు. వారిని లేచి నిలబడలేక, కాళ్లు చాపి పడుకోలేక ఇబ్బందులు తప్పవు.
అసలు ప్రధాన సమస్య ఏమిటంటే.. రైలులో సైడ్ లోయర్ బెర్త్‌లో చాలా మంది సరిగ్గా నిద్రపోలేరు. ముఖ్యంగా రాంగ్ డైరెక్షన్ లో పడుకుంటే శరీరం నిద్రపోవడానికి సహకరించదు. కళ్లు మూసుకున్నా నిద్ర మాత్రం పట్టదు. ట్రైన్ లో ప్రయాణించేటప్పుడు మీరు ఏ డైరెక్షన్ లో పడుకుంటున్నారన్నది చాలా ముఖ్యం. ఇతర బెర్తుల్లో సంగతి ఎలా ఉన్నా సైడ్ లోయర్, అప్పర్ బెర్త్ ల్లో పడుకొనే వారు తప్పకుండా తమ కాళ్లు ఇంజిన్ వైపు ఉండేలా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే సరైన నిద్ర పడుతుంది. ఇకపై సైడ్ బెర్త్ లో ప్రయాణం చేసేవారు ఈ విషయాలు పాటిస్తే ప్రయాణం సౌకర్యంగా, హాయిగా ఉంటుంది.