Gold Purity: ఖరీదైన వస్తువులు కొనేటప్పుడు కొంచెం ఏమరుపాటుగా ఉన్నా నష్టపోయే ప్రమాదం ఉంది. మెరిసే ప్రతిదీ వజ్రం కాదు, బంగారం కాదు. ఎర్రగా కనిపించేదంతా కుంకుమపువ్వు కాదు. మరి బంగారం, వజ్రాలు, ముత్యాలు, కుంకుమపువ్వు క్వాలిటీని సులభంగా ఎలా గుర్తించాలి?
మెరిసే వజ్రాలు, అందమైన ముత్యాలు, ఖరీదైన బంగారు ఆభరణాలు, నాణ్యమైన కుంకుమపువ్వు లాంటి విషయాల్లో త్వరగా క్వాలిటీని అంచనా వేయలేం. ధర ఎక్కువున్నంత మాత్రాన అది క్వాలిటీ అని చెప్పలేం. మోసపోయే ప్రమాదం ఉంది. అందుకే, వీటిని కొనే ముందే ప్యూరిటీ చెక్ చేయడం చాలా ముఖ్యం. ఇలా చేస్తే మోసపోకుండా పెట్టిన పైసలకు తగ్గ వస్తువు కొనుక్కోవచ్చు.
25
బంగారు ఆభరణాల నాణ్యతను ఎలా కనిపెట్టాలి?
బంగారు ఆభరణాలు కొనేటప్పుడు స్వచ్ఛతను తెలిపే మార్కులను గమనించడం ముఖ్యం. 18K లేదా 750 లాంటి గుర్తులు నగలో 75 శాతం బంగారం ఉందని చెబుతాయి. అలాగే GP, GF, HGE లాంటి గుర్తులు గోల్డ్ ప్లేటెడ్ లేదా గోల్డ్ ఫిల్డ్ అని అర్థం. ఇవి పూర్తిగా బంగారు నగలు కావని తెలుసుకోవాలి.
అయితే, కేవలం మార్కులు ఉన్నాయని గుడ్డిగా నమ్మలేం. నకిలీ మార్కులు కూడా వేసే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ ధర పెట్టి నగలు కొనేటప్పుడు నమ్మకమైన షాపులోనే కొనాలి. అవసరమైతే సరైన టెస్టింగ్ చేయించుకోవడం మంచిది.
35
అసలైన ముత్యాలను ఎలా గుర్తుపట్టాలి?
సహజంగా తయారైనవి మాత్రమే అసలైన ముత్యాలు అనుకోవద్దు. సహజమైన ముత్యాలతో పాటు, మనుషుల సాయంతో పెంచే కల్చర్డ్ ముత్యాలు కూడా అసలైనవే. వీటిపై ఉండే పలుచని పొర నాక్రే, వాటికి ప్రత్యేకమైన మెరుపును, ఉపరితలంలో చిన్న చిన్న మార్పులను ఇస్తుంది.
కానీ, నకిలీ ముత్యాలకు పైన వేసిన పూత ఊడిపోతున్నట్లు కనిపించొచ్చు. అయితే, కేవలం చూసి మాత్రమే ముత్యాల స్వచ్ఛతను నిర్ధారించలేం. అలాగే, ముత్యాలను పళ్లతో గీకి చూసే అలవాటు మానుకోవాలి. దీనివల్ల ముత్యాల ఉపరితలం దెబ్బతినే ప్రమాదం ఉంది.
వజ్రాలు కొనేటప్పుడు వాటి నాణ్యతను తెలిపే సర్టిఫికెట్ లేదా గ్రేడింగ్ రిపోర్ట్ ఉందో లేదో ముందుగా చూసుకోవాలి. ఆ సర్టిఫికెట్ ఏ ల్యాబ్ ఇచ్చింది, వాళ్ల అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఆ వివరాలు కరెక్టేనా అని క్రాస్ చెక్ చేసుకోవాలి.
అంతేకాదు, సర్టిఫికెట్‌లో ఉన్న వివరాలు, మనం కొంటున్న వజ్రం ఒకటేనా అని ఓ మంచి జ్యువెలరీ నిపుణుడితో చెక్ చేయించుకోవడం బెటర్. ముఖ్యంగా, వజ్రంలానే కనిపించే మొయిసనైట్ లాంటి రాళ్లను వేరు చేసి గుర్తుపట్టాలి.
ఇంకో విషయం ఏంటంటే, ల్యాబ్‌లో తయారుచేసే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కూడా అసలైన వజ్రాలే. వీటికి కూడా సహజ వజ్రాల్లాగే రసాయన, భౌతిక లక్షణాలు ఉంటాయి. కాబట్టి, సహజ వజ్రమా లేక ల్యాబ్‌లో తయారు చేసిందా అని స్పష్టంగా తెలుసుకుని కొనడం ముఖ్యం.
55
అసలైన కుంకుమపువ్వును కనిపెట్టే సింపుల్ ట్రిక్!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో ఒకటైన కుంకుమపువ్వులో కూడా నకిలీవి అమ్మే ఛాన్స్ ఉంది. అందుకే కుంకుమపువ్వు కొనేటప్పుడు నాణ్యతపై మరింత శ్రద్ధ పెట్టాలి.
సాధారణంగా అసలైన కుంకుమపువ్వును గోరువెచ్చని నీళ్లలో వేస్తే, దాని రంగు నెమ్మదిగా నీటిలో కలుస్తుంది. అదే కృత్రిమ రంగులు కలిపిన నకిలీ కుంకుమపువ్వు అయితే చాలా త్వరగా, ముదురు ఎరుపు రంగు బయటకు వచ్చేస్తుంది. అయితే, ఈ ఒక్క టెస్ట్ తోనే కుంకుమపువ్వు స్వచ్ఛతను పూర్తిగా చెప్పలేం. దాని నాణ్యత, స్వచ్ఛత తెలుసుకోవడానికి నమ్మకమైన వ్యాపారుల దగ్గర కొనడం, సరైన క్వాలిటీ సర్టిఫికెట్లను చెక్ చేయడం తప్పనిసరి.