బుడి బుడి అడుగులు వేసే పిల్లల నుంచి స్కూలుకు వెళ్లే పిల్లల వరకు ప్రతి ఒక్కరూ.. ఏబీసీడీలు రాయడానికైనా, బొమ్మలను గీయడానికైనా గోడలనే ఉపయోగిస్తుంటారు. అందుకే చిన్న పిల్లలున్న ఇంటి గోడలు కలర్ కలర్ పెన్నులు, పెన్సిల్, స్కెచ్ మరకలతో నిండి పోయి ఉంటాయి. అలాగే కొన్ని కొన్ని సార్లు బురద మరకలు, కాళ్లకున్న దుమ్ము మరకలు కూడా గోడలపై అచ్చులు పడుతుంటాయి. వీటివల్ల గోడలు మురికిగా మారుతాయి.
కానీ పెన్ను, పెన్సిల్, పెయింటింగ్ గీతలు గోడలకు అస్సలు పోవు. ఆడవాళ్లు వీటిని పోగొట్టడానికి ఎంతో కష్టపడతారు. దీనివల్ల వాల్ పెయింట్ పోవడమే కానీ.. పిల్లలు పెట్టిన గీతలు మాత్రం అస్సలు పోవు.
ఇది అందరికీ తెలిసిందే. కానీ కొన్ని పద్దతుల్లో మాత్రం గోడలకున్న పెన్ను, పెన్సిల్, పెయింటింగ్ తో పాటుగా ఇతర మరకలను కూడా చాలా సులువుగా పోగొట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
వెనిగర్
చాలా సార్లు పిల్లలు ఆడుకునేటప్పుడు, ఏదేనా రాసేటప్పుడు గోడలపై పెన్ను, పెన్సిల్ గీతలను పెడుతుంటారు. అలాగే రంగులను కూడా పూస్తుంటారు. కానీ ఇది తెల్లని గోడల అందాన్ని పాడు చేస్తుంది. అయితే మీరు వెనిగర్ ను ఉపయోగించి ఈ మరకలను, గీతలను చాలా ఈజీగా పోగొట్టొచ్చు. వెనిగర్ ఒక నేచురల్ క్లెన్సర్ గా పనిచేస్తుంది. కాబట్టి ఇది మరకలను పోగొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
ఇందుకోసం నీళ్లలో కొంచెం వెనిగర్ ను కలిపి దీన్ని స్ప్రే బాటిల్ లో పోయండి. దీన్ని గోడలకు ఎక్కడెక్కడైతే మరకలు ఉన్నాయో అక్కడ స్ప్రే చేయండి. కొన్ని నిమిషాలు అలాగే ఉంచి మెత్తని గుడ్డ లేదా స్క్రబ్ తో సున్నితంగా రుద్దితే గోడకు ఒక్క మరక లేకుండా పోతుంది.
బేకింగ్ సోడా
గోడకు అంటిన మరకలను పోగొట్టడానికి మీరు బేకింగ్ సోడాను కూడా ఉపయోగించొచ్చు. నిజానికి బేకింగ్ సోడా గోడకు అంటిన మరకలను చాలా ఈజీగా పోగోట్టడానికి సహాయపడుతుంది. ఇందుకోసం బేకింగ్ సోడాను కొద్దిగా నీళ్లలో కలిపి పేస్ట్ లా చేయండి.
ఈ పేస్ట్ ను గోడలకు ఉన్న మరకలపై, గీతలపై అప్లై చేసి కొన్ని నిమిషాలు అలాగే వదిలేయండి. ఆ తర్వాత ఒక తడి గుడ్డతో సున్నితంగా రుద్దండి. గోడలకు పిల్లలు పూసిన పెయింట్ ను, పెన్ను, పెన్సిల్ మరకలను పోగొట్టడానికి ఈ పేస్ట్ ను డిష్ వాష్ డిటర్జెంట్ తో కలపండి.
microfiber
మైక్రోఫైబర్ క్లాత్
మీరు గోడలకు అంటిన మరకలను తొలగించడానికి మీరు మైక్రోఫైబర్ క్లాత్ ను కూడా ఉపయోగించొచ్చు. వీటితో పాటుగా గోడలపై ఉన్న పెయింట్ మరకలను తొలగించేందుకు స్పెషల్ గా తయారుచేసిన ఎన్నో రకాల క్లీనర్లు మార్కెట్లో దొరుకుతాయి.
గోడలపై ఎప్పుడో పడిన మరకలను వీటితో పోగొట్టలేం. గోడలపై పడిన ఫ్రెష్ మరకలను అయితే వీటితో చాలా సులువుగా పోగొట్టొచ్చు.