
ఇంట్లో వంటింటిని మాత్రం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఈ గది శుభ్రంగా లేకపోతే వంటింట్లో ఉన్న సరుకులు అన్నీ పాడైపోతాయి. అయితే కొన్ని కొన్ని సార్లు వంటిళ్లు ఎంత శుభ్రంగా ఉన్న వేడి, తేమ వల్ల సరుకులకు పురుగులు పడుతుంటాయి. ముఖ్యంగా పిండికి తెల్ల పురుగులు, నల్ల పురుగులు, ఇతర కీటకాలు బాగా పడుతుంటాయి. దీనివల్ల పిండి పాడైపోవడమే కాకుండా.. దీన్ని తిన్న మనం రోగాల బారిన పడకా తప్పదు.
అయితే చాలా మందికి పిండికి పట్టిన తెల్ల పురుగులను ఎలా తీసేయాలో తెలియదు. అందుకే పిండిని డస్ట్ బిన్ లో వేసేస్తుంటారు. కానీ కొన్ని సులువైన చిట్కాలతో పిండిలో ఉన్న తెల్ల పురుగులను తీసేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పిండికి తెల్ల పురుగులు ఎందుకు పడతాయి?
పిండికి తెల్ల పురుగులు పట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా పిండి తేమగా ఉన్నా, పిండిని వేడి ఎక్కువగా ఉన్న ప్రదేశంలో పెట్టినా పురుగులు ఏర్పడతాయి. అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంటే కూడా పురుగులు ఖచ్చితంగా ఉంటాయి. మీకు తెలుసా? పిండిని గాలి వెల్లని డబ్బాలో ఉంచకపోతే కీటకాలు ఏర్పడటానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. అలాగే ఇంట్లో ఇప్పటికే ఉన్న కీటకాలు ఇతర ఆహారాల నుంచి పిండిలోకి కూడా వెళతాయి. ఈ విధంగా పిండికి పురుగులు పడతాయి.
పిండిలో తెల్ల పురుగులను తొలగించే చిట్కాలు
ఎండలో ఉంచాలి
పిండిలో తెల్ల పురుగులు ఏర్పడితే.. ఆ పిండిని శుభ్రమైన కాటన్ గుడ్డపై పోసి ఎండలో ఉంచండి. ఎండకు కీటకాలు చనిపోతాయి. అలాగే పిండిలో ఉన్న తేమ కూడా పోతుంది. పిండిని ఎండలో ఉంచిన తర్వాత జల్లిపట్టి నీడలో చల్లార్చండి. ఆ తర్వాత గాలి వెళ్లని డబ్బాలో పోయండి.
లవంగాలు
లవంగాలను పిండిలో వేస్తే పిండికి పురుగులు పట్టే అవకాశం తగ్గుతుంది. పిండిని కీటకాల నుంచి రక్షించడానికి ఇదొక సహజ మార్గం. లవంగాల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలుంటాయి. ఇవి కీటకాలను పిండికి దూరంగా ఉంచుతాయి. అలాగే కీటకాలు ఏర్పడే అవకాశాన్ని కూడా తగ్గిస్తాయి. ఇందుకోసం పిండి డబ్బాలో 5-6 లవంగాలను ఉంచండి. లవంగాల ఘాటైన వాసన తెల్ల పురుగులు, కీటకాలు రాకుండా చేస్తుంది. అలాగే పిండి కూడా ఫ్రెష్ గా, సురక్షితంగా ఉంచుతుంది.
ఫ్రిజ్లో ఉంచండి
పిండిని ఫ్రిజ్ లో కూడా నిల్వ చేయొచ్చు. పిండిలో ఒకటి రెండు పురుగులు కనిపించినా.. దాన్ని డస్ట్ బిన్ లో వేయడానికి బదులుగా ఫ్రిజ్ లో పెట్టండి. ఇందుకోసం పిండిని శుభ్రమైన, గాలి వెల్లని కవర్ లేదా డబ్బాలో పోసి కొన్ని గంటల పాటు ఫ్రీజర్ లో పెట్టండి. చల్లని ఉష్ణోగ్రతల వద్ద కీటకాలు చనిపోతాయి. అలాగే కీటకాలు పెరగవు. అయితే పిండిని ఫ్రీజ్ నుంచి తీసిన తర్వాత పిండిని గది ఉష్ణోగ్రత వద్ద కొద్ది సేపు ఉంచండి. ఆ తర్వాత జల్లెడ పట్టండి. ఇలా చేస్తే కీటకాలు లేకుండా పోతాయి. పిండిని జల్లెడ పట్టిన తర్వాత గాలి వెల్లని డబ్బాలో నిల్వ చేయండి.
వాక్యూమ్ ప్యాకింగ్
వాక్యూమ్ ప్యాకింగ్ కూడా పిండికి పురుగులు పట్టకుండా చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం మీరు చేయాల్సిందేమీ లేదు. కేవలం పిండి నుంచి గాలిని తీసేసి పూర్తిగా క్లోజ్ చేయాలి. దీనివల్ల పిండిలో కీటకాలు ఏర్పడవు. ఈ పద్దతిలో పురుగులు వృద్ధి చెందడానికి అవసరమైన ఆక్సిజన్ పిండి లోపలికి వెళ్లదు. ఆక్సిజన్ లేకపోతే పురుగుల పెరుగుదల ఆగిపోతుంది. ఈ పద్దతిలో పిండి చాలా రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటుంది. ముఖ్యంగా పిండిని ఎక్కువ మొత్తంలో కొని నిల్వ చేయాలనుకునేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
దాల్చినచెక్క
దాల్చినచెక్కతో కూడా పిండికి పురుగులు పట్టకుండా చేయొచ్చు. దాల్చిన చెక్కలో సహజ యాంటీ బాక్టీరియల్, యాంటీ క్రిమి లక్షణాలు పుష్కలంగా ఉంటాియ. ఇది పిండిలో పురుగులు ఏర్పడకుండా చేయడంలో బాగా సహాయపడుతుంది. దాల్చిన చెక్క సువాసన, లక్షణాలు పిండికి పురుగులను దూరంగా ఉంచుతాయి. ఇందుకోసం పిండి డబ్బాలో 1-2 దాల్చినచెక్క కర్రలను ఉంచండి. దీనివల్ల పిండికి పురుగులు దూరంగా ఉండటమే కాకుండా.. పిండి మంచి వాసన కూడా వస్తుంది.