
శరీరం అంతా ఒక రంగులో ఉంటే మోచేతులు, మోకాళ్లు మాత్రం కాస్త నలుపు రంగులో ఉంటాయి. నిజానికి మోచేతులు ఇలా నల్లబడటం ఒక సాధారణ సమస్య. ఇది చాలా మందికి ఉంటుంది. ఈ సమస్య రావడానికి చాలా కారణాలు ఉన్నారు. ముఖ్యంగా చర్మం పొడిబారడం, సూర్యరశ్మి, మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి ఎక్కువగా కావడం వంటి కారణాల వల్ల మోచేతులు నల్లగా అయిపోతాయి. ఈ సమస్య ఉందని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని ఇంటి చిట్కాలతో ఈ నలుపును సులువుగా పోగొట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
నిమ్మకాయ, బేకింగ్ సోడా
మోచేతులను తెల్లగా చేయడంలో నిమ్మకాయ, బేకింగ్ సోడా చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. నిమ్మకాయలో ఉండే విటమిన్ సిలో నేచురల్ బ్లీచింగ్ లక్షణాలు ఉంటాయి. ఇవి నలుపును పోగొట్టడంలో బాగా పనిచేస్తాయి. అలాగే బేకింగ్ సోడా ఎక్స్ఫోలియేటర్ గా పనిచేస్తుంది. ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది.
దీన్ని ఎలా ఉపయోగించాలి?
ముందుగా ఒక టీ స్పూన్ బేకింగ్ సోడాను తీసుకుని అందులో సగం నిమ్మరసం వేసి కలపండి. ఈ పేస్ట్ ను మోచేతులకు అప్లై చేయండి. తర్వాత 5 నుంచి 10 నిమిషాల పాటు నెమ్మదిగా మసాజ్ చేయండి. ఇది పూర్తిగా ఆరిన తర్వాత చల్ల నీళ్లతో కడిగేయండి. ఇలా మీరు వారానికి రెండు నుంచి మూడు సార్లు చేస్తే మోచేతులు తెల్లగా అవుతాయి.
కొబ్బరి నూనె, చక్కెర స్క్రబ్
మోచేతులను నార్మల్ కలర్ లో ఉంచడానికి కొబ్బరి నూనె కూడా బాగా ఉపయోగపడుతుంది. నిజానికి కొబ్బరి నూనె మన చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తే చక్కెర చనిపోయిన చర్మ కణాలను తొలగించి మోచేతులను తెల్లగా చేయడానికి సహాయపడుతుంది.
దీన్ని ఎలా ఉపయోగించాలి?
రెండు టీస్పూన్ల కొబ్బరి నూనెను తీసుకుని అందులో ఒక టీ స్పూన్ చక్కెరనుయ వేసి పేస్ట్ చేయండి. దీన్ని మోచేతులకు పట్టించి 5 నిమిషాల పాటు వృత్తాకార కదలికలో రుద్దండి. పది నిమిషాలు దీన్ని అలాగే వదిలేయండి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే సరిపోతుంది.
కలబంద, పసుపు
కలబంద, పసుపు రెండూ మన చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. కలబంద మన చర్మానికి మంచి పోషణను ఇస్తుంది. అలాగే పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, బ్లీచింగ్ లక్షణాలు మోచేతుల నలుపును పోగొడుతుంది.
దీన్ని ఎలా ఉపయోగించాలి?
రెండు టీ స్పూన్ల కలబంద గుజ్జులో అర టీస్పూన్ పసుపును వేసి బాగా కలపండి. దీన్ని మోచేతులకు రాసి 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఆ తర్వాత నార్మల్ వాటతో కడిగేసి మాయిశ్చరైజర్ ను పెట్టండి. ఇలా మీరు వారానికి మూడు సార్లు చేస్తే సరిపోతుంది.
తేనె, పాలు
తేనె పాలతో కూడా మోచేతుల నలుపును పోగొట్టొచ్చు. తేనె మన చర్మానికి తేమను అందిస్తే పాలలో ఉండే లాక్టిక్ ఆమ్లం చర్మానికి మంచి ఉపశమనం కలిగిస్తుంది.
దీన్ని ఎలా ఉపయోగించాలి?
ఒక టీ స్పూన్ తేనెలో ఒక టీ స్పూన్ పాలను పోసి కలపండి. దీన్ని మోచేతులకు పెట్టి 15 నిమిషాల వరకు అలాగే వదిలేయండి. ఆ తర్వాత చేతులతో మోచేతులను రుద్దుతూ కడిగేయండి. ఇలా మీరు రోజూ చేయొచ్చు. లేదా వారానికి 4 నుంచి 5 సార్లు చేయొచ్చు.
కీరదోసకాయ, రోజ్ వాటర్
కీరదోసకాయ, రోజ్ వాటర్ తో కూడా మోచేతుల నలుపును పోగొటొచ్చు. కీరదోసకాయ మన చర్మాన్ని చల్లగా ఉంచితే, రోజ్ వాటర్ మన చర్మానికి తాజాదనాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది.
దీన్ని ఎలా ఉపయోగించాలి?
ఇందుకోసం కీరదోసకాయ నుంచి రసాన్ని తీయండి. ఇందులో రోజ్ వాటర్ ను వేసి బాగా మిక్స్ చేయండి. దూదితో మోచేతులకు పెట్టండి. 20 నిమిషాల పాటు అలాగే వదిలేసి కడిగేయండి. దీన్ని మీరు రోజూ వాడితే గనుక చాలా తొందరగా మోచేతుల నలుపు పోతుంది.