మన చుట్టూ ఉండే కొందరి ముఖంలో నవ్వు కంటే దిగులే ఎక్కువగా కనిపిస్తుంటుంది. వాళ్లను చూసినప్పుడు “ఏమైంది వీళ్లకు”? “ఎందుకు ఇలా ఉంటారు”? అని అనిపిస్తుంది. కానీ ఆ ఏడుపు మొహం వెనుక నిజంగా ఏముంది? వీరి గురించి సైకాలజీ ఏం చెప్తోందో ఇక్కడ చూద్దాం.
కొందరు వ్యక్తులు ఎప్పుడూ ఏడుపు మొహం పెట్టుకొని, ముఖంలో ఒక రకమైన దిగులు లేదా భారాన్ని మోస్తూ కనిపిస్తుంటారు. వీళ్లను చూసినప్పుడు చుట్టు పక్కలవాళ్లకు “ఇంత నెగటివ్‌గా ఎందుకు ఉంటారు వీళ్లు?” అనే డౌట్ వస్తుంది. కానీ సైకాలజీ ప్రకారం ఇది అలవాటు లేదా నటన మాత్రమే కాదు. దీని వెనుక లోతైన మానసిక కారణాలు ఉంటాయి. వ్యక్తి మనసులో నడిచే భావోద్వేగాలే ముఖ భావాలుగా బయటపడతాయి.
27
చిన్ననాటి అనుభవాలు
ఇలాంటి మనస్తత్వం రూపుదిద్దుకోవడంలో చిన్ననాటి అనుభవాలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రేమ, భద్రత, అర్థం చేసుకునే వాతావరణం లేని కుటుంబాల్లో పెరిగిన పిల్లలు తమ భావాలను బయటకు చెప్పుకోవడం నేర్చుకోరు. తరచూ తిట్లు, విమర్శలు, నిర్లక్ష్యం ఎదురైనప్పుడు వారు తమ బాధను లోపలే దాచుకోవడం అలవాటు చేసుకుంటారు. ఈ లోపలి బాధ కాలక్రమేణా ఒక శాశ్వతమైన దిగులుగా మారి ఏడుపు మొహంలా కనిపిస్తుంది.
37
భవిష్యత్తుపై భయం
అంతేకాదు ఇలాంటి వ్యక్తులు సాధారణంగా భవిష్యత్తుపై భయంతో ఉంటారు. ఏదో ఒక తప్పు జరుగుతుందన్న భావన వీళ్ల మనసులో ఎప్పుడూ ఉంటుంది. మంచి జరిగే అవకాశాలకన్నా చెడు జరిగే అవకాశాలే వీరు ముందుగా ఊహించుకుంటారు. చిన్న సమస్య కూడా వీళ్లకు పెద్ద భారంగా అనిపిస్తుంది. దాంతో ముఖంలో అలసట, దిగులు స్పష్టంగా కనిపిస్తాయి.
గతంలో మనసుకు తగిలిన గాయాలు కూడా ఈ స్వభావానికి కారణం కావచ్చు. అపజయాలు, అవమానాలు, నమ్మినవాళ్ల నుంచి వచ్చిన నిరాశలు వ్యక్తి ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తాయి. “నేను ఎవ్వరికి అవసరం లేదు”, “నన్నెవ్వరూ నిజంగా అర్థం చేసుకోరు” అనే ఆలోచనలు వీరిలో బలంగా ఉంటాయి.
కొంతమంది వ్యక్తులు సహజంగానే చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. ఇతరుల మాటలు, చూపులు, ప్రవర్తనలు వీళ్లను లోతుగా ప్రభావితం చేస్తాయి. సాధారణంగా ఇతరులు పట్టించుకోని విషయాలు కూడా వీళ్లకు బాధను కలిగిస్తాయి. భావోద్వేగాలకు ఎక్కువగా స్పందించే స్వభావం ఉన్నవాళ్లు తమ బాధను దాచుకోలేరు. అది ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది.
57
బాధను బయటకు చెప్పలేనివారు
అందరిముందు “ ఏడవకూడదు” అనే భావన బలంగా ఉండటం వల్ల కూడా చాలా మంది తమ బాధను బయటకు వ్యక్తపరచరు. బాధను బయటకు చెప్పడం బలహీనతగా భావించి.. లోపలే మగ్గిపోతారు. ఈ మౌన పోరాటం క్రమంగా మనసును అలసిపోయేలా చేస్తుంది. ఆ అలసటే ముఖంలో దిగులుగా, నిరాశగా కనిపిస్తుంది.
67
కొందరు వ్యక్తులు కావాలనే..
సైకాలజీ నిపుణుల ప్రకారం కొందరు వ్యక్తులు కావాలనే బాధగా కనిపించడానికి ప్రయత్నిస్తారు. అలా కనిపిస్తే ఇతరులు వారిపై ఎక్కువగా ఆశలు పెట్టుకోరు, ప్రశ్నలు అడగరు, బాధ్యతలు అప్పగించరు. ఇది తెలియకుండానే వ్యక్తి తనను తాను కాపాడుకునే విధానం. కానీ దీని వల్ల క్రమంగా ఒంటరితనం పెరిగి.. బంధాలు దూరమవుతాయి.
77
మనసుకు నచ్చిన పనులు చేయడం..
ఈ మనస్తత్వం నుంచి బయటపడాలంటే ముందుగా వారి భావాలను అంగీకరించడం చాలా అవసరం. నమ్మకమైన వ్యక్తితో మాట్లాడటం, బాధను చెప్పుకోవడం వల్ల మనసుకు తేలికనిస్తుంది. అవసరమైతే సైకాలజీ నిపుణుల సహాయం తీసుకోవడం ఉత్తమం. చిన్న చిన్న సానుకూల అలవాట్లు కూడా మనసుపై మంచి ప్రభావం చూపుతాయి. సరైన నిద్ర, శారీరక చురుకుదనం, మనసుకు నచ్చిన పనులు చేయడం వంటివి భావోద్వేగ సమతుల్యతను మెరుగుపరుస్తాయి.