గుడిలో ప్రసాదంగా పెట్టే పులిహోర అంటే ఎంతో మందికి ఇష్టం. దాని రుచి, సువాసన ఎంతో బావుంటుంది. టెంపుల్ స్టైల్లో పులిహోర ఇంట్లో రుచిగా రావాలంటే ఎలా వండాలో రెసిపీ ఇక్కడ ఇచ్చాము.
గుడిలో పెట్టే పులిహోర ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఆ పులిహోర సువాసన, పులుపు-కారం కలిసిన ఆ రుచి చాలా బావుంటుంది. ఇంట్లో ఎన్నిసార్లు ట్రై చేసినా ఆ స్పెషల్ టేస్ట్ రావడం లేదని చాలామంది ఫీల్ అవుతుంటారు. సరైన కొలతలతో వండింతే అచ్చం గుడిలో లాంటి పులిహోరను ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఆ రుచి వెనక ఉన్న సీక్రెట్ టిప్స్, రెసిపీ ఇక్కడ ఇచ్చాము.
23
టెంపుల్ స్టైల్ పులిహోర రెసిపీకి కావాల్సిన పదార్థాలు
బియ్యం - 2 కప్పులు
నీళ్లు - తగినన్ని
నువ్వుల నూనె - 1 టీస్పూన్
చింతపండు - పెద్ద నిమ్మకాయ సైజు
నువ్వుల నూనె - 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు
ఆవాలు - 1 టీస్పూన్
మినప్పప్పు - 1 టీస్పూన్
పచ్చిశెనగపప్పు - 1 1/2 టీస్పూన్
పల్లీలు - 2 టేబుల్ స్పూన్లు
ఎండుమిర్చి - 4 నుంచి 5
పచ్చిమిర్చి - 1 లేదా 2
కరివేపాకు - 1 రెమ్మ
ఇంగువ - 1/4 టీస్పూన్
పసుపు - 1/4 టీస్పూన్
ఉప్పు - తగినంత
పులిహోర పొడి కోసం:
ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు
ఎండుమిర్చి - 5 నుంచి 6
పచ్చిశెనగపప్పు - 1 టేబుల్ స్పూన్
మినప్పప్పు - 1 టీస్పూన్
మెంతులు - 1/2 టీస్పూన్
నువ్వులు - 1 టీస్పూన్
మిరియాలు - 1/2 టీస్పూన్
జీలకర్ర - 1/2 టీస్పూన్
33
రెసిపీ ఇలా
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు పోసి పొడిపొడిగా వండుకోండి. అన్నం మెత్తబడకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఉడికిన అన్నాన్ని ఒక పెద్ద పళ్లెంలో ఆరబోసి, కొద్దిగా నువ్వుల నూనె కలపండి.
ఆ తర్వాత చింతపండును వేడి నీళ్లలో నానబెట్టి, గుజ్జు తీసి వడకట్టుకోండి. ఈ చింతపండు రసాన్ని స్టవ్ మీద పెట్టి కాసేపు మరిగించండి.
అందులో పసుపు, ఉప్పు వేసి పచ్చివాసన పోయేదాకా ఉడికించండి. ఇది కొద్దిగా చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేయండి.
మినప్పప్పు, మెంతులు, నువ్వులు, మిరియాలు, జీలకర్రను విడివిడిగా లేదా ఒకదాని తర్వాత ఒకటి మీడియం మంట మీద దోరగా వేయించుకోండి.
ఇవి బాగా చల్లారాక మిక్సీలో వేసి కాస్త బరకగా పొడి చేసుకోండి. గుడి పులిహోరకు ఆ అద్భుతమైన సువాసనను ఇచ్చే అసలైన సీక్రెట్ పొడి ఇదే!
కడాయిలో నువ్వుల నూనె వేడి చేసి ఆవాలు వేయండి. అవి చిటపటలాడాక మినప్పప్పు, పచ్చిశెనగపప్పు, పల్లీలు వేసి దోరగా వేయించండి.
ఆ తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ కలపండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న చింతపండు గుజ్జును ఇందులో పోసి బాగా మరిగించండి.
నూనె పైకి తేలి, మిశ్రమం చిక్కబడేదాకా మీడియం మంట మీద ఉడికించండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పులిహోర పొడిని వేసి బాగా కలపండి.
మరో 3-5 నిమిషాలు ఉడికించి దించేయండి. చల్లారిన అన్నం మీద ఈ పులికాచల్ వేసి, అన్నం విరిగిపోకుండా నెమ్మదిగా కలపండి.
కలిపిన వెంటనే తినేయకుండా, కనీసం అరగంట నుంచి గంట పాటు పక్కన పెడితే.. పులుపు అన్నానికి బాగా పట్టి రుచి అదిరిపోతుంది.