ప్రతిరోజూ ఒకేలానే ఉండదు. ఒక రోజు సంతోషంగా అనిపించినా.. మరో రోజు బాధగా ఉంటుంది. సంతోషంగా ఉన్నప్పుడు మనం ఎలాంటి పని అయినా చేసేస్తాం. కానీ బాధగా అనిపించిన రోజు మాత్రం ఎలాంటి పని చేయాలని అనిపించదు. కానీ.. మన మనసు బాలేదని.. ఆఫీసు పని చేయకపోతే కంపెనీలు, పై అధికారులు ఒప్పుకుంటారా? చచ్చినట్లు చేయాల్సిందే.
అయితే.. ఓ కంపెనీ మాత్రం తమ కంపెనీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. అదేంటో తెలుసా? మనసు బాగోలేని సమయంలో ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదని.. కావలంటే అన్ హ్యాపీ లీవ్స్ తీసుకోండి అని ఆఫర్ ఇస్తోంది.
ఇటీవలి చైనా సూపర్‌మార్కెట్ వీక్ 2024 సందర్భంగా, హెనాన్ ప్రావిన్స్‌లో ఉన్న ఒక ప్రధాన రిటైల్ చైన్ అయిన పాంగ్ డాంగ్ లై, పని-జీవిత సమతుల్యత సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో ఒక అసాధారణ ప్రకటనతో సంచలనం సృష్టించింది.
సంస్థ వ్యవస్థాపకుడు , ఛైర్మన్ యు డాంగ్లాయ్, దేశంలో ప్రబలంగా ఉన్న సుదీర్ఘమైన పని గంటల సంస్కృతిని ఎదుర్కోవడానికి ఉద్యోగులకు పది రోజుల అదనపు సెలవులు అంటూ ప్రకటించారు. 'ఓన్లీ వర్క్, నో ప్లే' విధానం వల్ల ఉద్యోగులు ఇ్బ్బంది పడుతున్నారని ఆయన భావించారు. అందుకే.. అన్ హ్యాపీ లీవ్స్ పేరిట పది రోజులు సెలవలు ప్రకటించారు. ఇది ఆరోగ్యకరమైన పని సంస్కృతిని పెంపొందించే దిశగా వృద్ధిని సూచిస్తుంది.
ఉద్యోగులు మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే పని బాగా సాగుతుంది, ఉత్పాదకంగా ఉంటుంది. బోర్ కొట్టి పని చేస్తే నాణ్యత దెబ్బతింటుందనే ఉద్దేశ్యంతో ఇలా హ్యాపీ లీవ్స్ ఇవ్వడం వెనుక ఉద్దేశం అని దొంగలాయి అన్నారు. ఉద్యోగులు ఎవరైనా మనసు బాగోకపోతే ఏకంగా పదిరోజులు సెలవలు తీసుకోవచ్చు. ఈ సెలవలు తీసుకోవడానికి పై అధికారులు అభ్యంతరం చెప్పడానికి కూడా వీలు లేదనది ఆయన చెప్పడం విశేషం. నిజంగా ఇలా అన్ని కంపెనీలు ఆలోచిస్తే.. ఉద్యోగులకు ఎంత సంతోషంగా , రిలీఫ్ గా ఉంటుందో కదా.