Chicken: చికెన్ ప్రియులకు జ్వరం వచ్చినా కూడా చికెన్ వంటకాలు తినాలనిపిస్తుంది. కానీ కొంతమంది జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినకూడదని అంటారు. ఇది ఎంత వరకు నిజం? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి? జ్వరం ఉన్నప్పుడు చికెన్ తింటే ఏమవుతుంది?
జ్వరం వచ్చినప్పుడు మాంసాహారం ముట్టుకోకూడదని చాలామంది భావిస్తుంటారు. కానీ వాస్తవానికి ఆ సమయంలో చికెన్ తినడం శరీరానికి సురక్షితమే కాకుండా ఎంతో మంచిది కూడా. మనం జ్వరం బారిన పడినప్పుడు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ఇన్ఫెక్షన్‌తో తీవ్రంగా పోరాడుతుంది. ఈ క్రమంలో శరీరం త్వరగా నీరసించిపోవడం, బలహీనపడటం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో శక్తిని పుంజుకోవడానికి పోషకాహారం శరీరానికి తప్పనిసరిగా అవసరం. చికెన్‌లో సమృద్ధిగా లభించే హై-క్వాలిటీ ప్రొటీన్లు దెబ్బతిన్న కణజాలాన్ని రిపేర్ చేయడానికి, రోగనిరోధక శక్తిని పెంచి శరీరం వేగంగా కోలుకోవడానికి తోడ్పడతాయి. అయితే చికెన్ మంచిదే కదా అని ఎలా పడితే అలా కాకుండా, రోగి శరీర తత్వానికి అనుగుణంగా తేలికగా జీర్ణమయ్యే పద్ధతుల్లోనే దాన్ని తినాలి?
23
చికెన్ ఎలా తినాలి?
జ్వరంతో బాధపడుతున్నప్పుడు చికెన్ తీసుకోవడానికి 'చికెన్ సూప్' అత్యుత్తమమైన పద్దతి. వేడివేడి చికెన్ సూప్ తాగడం వల్ల గొంతు బొంగురుపోవడం, గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా జ్వరం వల్ల ఒంట్లో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి ఈ సూప్‌లోని ద్రవాలు, ఎలక్ట్రోలైట్లు సహాయపడతాయి. సూప్‌తో పాటు తక్కువ నూనె, అతి తక్కువ మసాలాలు ఉపయోగించి తయారుచేసిన చికెన్ స్టూ, మెత్తగా ఉడికించిన చికెన్ ముక్కలు, ఉడికించిన కూరగాయలతో కలిపి చేసిన చికెన్ సలాడ్ లేదా తేలికపాటి గ్రిల్డ్ చికెన్ వంటివి సులభంగా జీర్ణమవుతాయి. ఇవి జీర్ణవ్యవస్థపై ఎలాంటి భారం మోపకుండా శరీరానికి అవసరమైన తక్షణ శక్తిని, పోషకాలను సమతుల్యంగా అందిస్తాయి.
33
ఇలాంటి వంటకాలు తినవద్దు
చికెన్ పోషకాలను అందించేదే అయినప్పటికీ దాన్ని వండే విధానం సరిగ్గా లేకపోతే అది శరీరానికి హాని చేస్తుంది. జ్వరం ఉన్న సమయంలో జీర్ణవ్యవస్థ కాస్త మందకొడిగా పనిచేస్తుంది కాబట్టి ఎక్కువ నూనె, డీప్ ఫ్రై చేసినవి, అధిక కారం, ఘాటైన మసాలాలతో నిండిన చికెన్ పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా హోటళ్లలో దొరికే బటర్ చికెన్, చికెన్ కర్రీలు, క్రీమీ గ్రేవీలు, చికెన్ లాలీపాప్, చిల్లీ చికెన్, షవర్మా వంటి హెవీ ఫుడ్స్ అస్సలు ముట్టుకోకూడదు. ఇలాంటి భారీ ఆహారాలను జీర్ణం చేసుకోవడానికి శరీరం ఎక్కువ శక్తిని ఖర్చుపెట్టాల్సి వస్తుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు రావడమే కాకుండా జ్వరం నుంచి కోలుకోవడం మరింత ఆలస్యమవుతుంది. కాబట్టి ఇంట్లోనే స్వచ్ఛంగా, తక్కువ మసాలాలతో వండిన తేలికపాటి చికెన్ మాత్రమే తీసుకోవడం ఉత్తమం.