
నోటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటామని అందరికీ తెలుసు. అందుకే ప్రతిరోజూ దంతాలను క్లీన్ చేసుకుంటాం. అయితే కొందరు రోజుకు ఒకసారి మాత్రమే బ్రష్ చేస్తే.. మరికొంతమందేమో రెండు సార్లు బ్రష్ చేస్తారు. కానీ ప్రతి ఒక్కరూ రోజుకు రెండు సార్లు ఖచ్చితంగా బ్రష్ చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయమే కాకుండా రాత్రి వేళల్లో తిన్న తర్వాత బ్రష్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే బ్రషింగ్ కు దీర్ఘాయువుకు సంబంధం ఉందని తాజా అధ్యయనంలో తేలింది.
నోటి పరిశుభ్రత, వయస్సుపై పరిశోధన
జర్నల్ ఆఫ్ ఏజింగ్ లో ప్రచురించిన పరిశోధన ప్రకారం.. నోటి ఆరోగ్యానికి, దీర్ఘాయువుకు మధ్య సంబంధం ఉందని తేలింది. 1992 నుంచి 2009 వరకు 5,611 మంది వృద్ధుల దంత ఆరోగ్యం గురించి శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం లో పరుషులు, స్త్రీలూ ఉన్నారు. అధ్యయనంలో వివిధ ప్రమాద అంచనాలు కూడా లెక్కించబడ్డాయి. లింగం ( gender),విద్య (education), బాడీ మాస్ ఇండెక్స్ (BMI), ధూమపానం (smoking), దీర్ఘకాలిక వ్యాధి చరిత్ర వంటి విషయాలు పరిగణనలోకి తీసుకుని ఫలితాలను వెల్లడించారు.
పడుకునే ముందు బ్రష్ చేయడం వల్ల ఆయుష్షు పెరుగుతుంది
రాత్రి పూట బ్రష్ చేయడానికి దీర్ఘాయుష్షుకు సంబంధం ఉందని పరిశోధనలో తేలింది. అంటే రాత్రిపూట కూడా బ్రష్ చేయడం వల్ల మీ లైఫ్ టైం పెరుగుతుందని అర్థం. దీనితో పాటుగా దంతవైద్యుడి దగ్గరకు వెల్లడం, రెగ్యులర్ గా దంత ఫ్లోస్ ను ఉపయోగించడం వంటి నోటి పరిశుభ్రత అలవాట్లు కూడా దీర్ఘాయువుతో ముడిపడినట్టు పరిశోధకులు కనుగొన్నారు.
ముఖ్యంగా సంవత్సరంలోపు దంత వైద్యుడిని సంప్రదించకపోవడం వల్ల మరణాల రేటు 30 నుంచి 50 శాతం ఉంటుందని ఈ అధ్యయనం వెల్లడించింది. ఏడాదికి ఒకటి రెండు స్లారు దంతవైద్యుడిని కలిసి వారిలో మరణాల రేటు చాలా తక్కువగా ఉన్నదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
రాత్రిపూట బ్రష్ చేయని వారిలోనే మరణాల రేటు ఎక్కువగా ఉంటుంది..
రాత్రి పూట బ్రష్ చేసే వారితో పోల్చితే చేయని వారు చనిపోయే ప్రమాదం 20 నుంచి 30 శాతం పెరిగినట్టు కనుగొన్నారు. అంతేకాదు.. బ్రష్ చేయకపోవడం వల్ల పంటి పగుళ్ల సమస్య వచ్చి చనిపోయే వారి రేటు కూడా ఎక్కువగానే ఉందని వెల్లడైంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. 20 కంటే ఎక్కువ దంతాలను కలిగున్న వారితో పోల్చితే.. 20 కంటే తక్కువ దంతాలను కలిగున్న వారు చనిపోయే ప్రమాదం 30 శాతం ఎక్కువగా ఉన్నట్టు తేలింది.
దంతాల సంఖ్య కూడా ఆయుష్షును తెలియజేస్తుంది..
Journal of Community Dentistry and Oral Epidemiologyలో ప్రచురితమైన తాజా అధ్యయనం ప్రకారం.. ఆరోగ్యకరమైన దంతాలున్న వృద్ధులు ఎక్కువ రోజులు జీవిస్తారని తేలింది. అంటే 70 ఏండ్ల వయసున్న స్త్రీలు కానీ.. పురుషులు కానీ 20 కంటే ఎక్కువ దంతాలను కలిగి ఉంటే ఎక్కువ రోజులు జీవిస్తారు.
దంతాలను క్లీన్ గా ఉంచుకుంటే ఎన్నో రోగాలు తగ్గిపోతాయి..
దంతాలను క్లీన్ గా ఉంచుకోవడం వల్ల ఎక్కువ రోజులు బతకడమే కాదు.. మధుమేహం, గర్భధారణన సమస్యలు, గుండె జబ్బులు, చిత్త వైకల్యం, స్ట్రోక్, గుండెపోటు వంటి ఎన్నో సమస్యలు తగ్గిపోతాయట. ఇలాంటి అనారోగ్య సమస్యలు రాకూదంటే మనం ఖచ్చితంగా రోజుకు రెండు సార్లు ఫ్లోరైడ్ టూగ్ పేస్ట్ తో బ్రష్ చేయాలని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే పానీయాలను తీసుకోవడం తగ్గించాలి. అలాగే షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను కూడా తీసుకోకూడదు. భోజనం చేసే ముందు నోటిలో నీళ్లు పోసి పుక్కిలించాలి. నోటి సమస్యలు రాకుండా తరచుగా దంత వైధ్యుడిని సంప్రదిస్తూ ఉండాలి.