
ఈ రోజుల్లో పెద్దల నుంచి చిన్న పిల్లల వరకు ప్రతి ఒక్కరూ మొబైల్, ల్యాప్ టాప్, టీవీ అంటూ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల స్క్రీన్లను విపరీతంగా చూస్తున్నారు. దీనివల్ల నిద్రలేమి, కళ్లపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. అలాగే అలసట, డార్క్ సర్కిల్స్ కళ్ల చిరాకు వంటి సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి మార్కెట్ లో ఎంతో ఖరీదైన క్రీములు దొరుకుతున్నాయి. కానీ వీటివల్ల ఎప్పుడూ ప్రయోజకరంగా ఉండదు. నిపుణుల ప్రకారం.. కీరదోసకాయతో ఈ సమస్యలను సులువుగా తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
కీరదోసకాయ ముక్కలను కళ్లపై ఉంచితే ఏమౌతుంది?
కీరదోసకాయలు మన కళ్లకు ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఇవి డార్క్ సర్కిల్స్, కంటి అలసటను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ కీరా ముక్కలను కళ్లపై ఉంచితే ఎన్నో ప్రయోజనాలను పొందొచ్చు. దీనివల్ల డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి. అలసట మటుమాయం అవుతుంది. అలాగే మంట తగ్గడంతో పాటుగా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అసలు కీర దోసకాయ ముక్కలు కళ్లపై పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు, వీటిని కళ్లపై సరైన విధంగా ఎలా పెట్టాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
కళ్ల ఉబ్బు తగ్గుతుంది
చాలా మందికి పడుకోని లేవగనే కళ్లు బాగా ఉబ్బిపోయి ఉంటాయయి. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే ఈ కీరదోసకాయ ముక్కలు ఈ సమస్యను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఈ కాయలో ఉండే నేచురల్ శీతలీకరణ లక్షణాలు, శోథ నిరోధక లక్షణాలు కళ్ల ఉబ్బును తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఇందుకోసం చల్లగా ఉండే కీరదోసకాయను తీసుకుని రెండు చిన్న ముక్కలుగా కట్ చేయండి. వీటిని కళ్లపై 10 నుంచి 15 నిమిషాల పాటు పెట్టండి. ఇలా రోజూ చేస్తే కొన్ని రోజుల్లోనే తేడా కనిపిస్తుంది.
డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి
డార్క్ సర్కిల్స్ ఎన్నో కారణాల వల్ల వస్తుంటాయి. అయితే ఈ సమస్యను తగ్గించడానికి కీరదోసకాయ బాగా సహాయపడుతుంది. దీనిలో విటమిన్ సి, కెఫిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి.ఇవి కళ్ల చుట్టూ ఉన్న నల్లటి వలయాలనను తగ్గిస్తుంది. కీరా ముక్కలు మీరు రెగ్యులర్ గా ఉపయోగిస్తే కళ్ల చుట్టూ ఉన్న చర్మం కాంతివంతంగాఅవుతుంది. అలాగే మీరు రీఫ్రెష్ అనుభూతిని కూడా పొందుతారు.
కంటి అలసట నుంచి ఉపశమనం
ఫోన్ లేదా ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల స్క్రీన్ ను ఎక్కువ సేపు చూడటం వల్ల కళ్లు బాగా అలసిపోతాయి. అలాగే కళ్ల నుంచి నీరు కూడా కారుతుంటుంది. అయితే కీరా ముక్కలను కళ్లపై పెట్టడం వల్ల కళ్లకు మంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఇది కళ్ల ఒత్తిడిని కూడా తగ్గించడానికి సహాయపడుతుంది.
కంటి ముడతలను తగ్గిస్తుంది
కళ్ల చుట్టూ ఉన్న ముడతలను తగ్గించానికి కూడా కీరదోసకాయ బాగా సహాయపడుతుంది.కీరాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కళ్ల చుట్టూ ఉన్నచర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. రీఫ్రెష్ చేస్తాయి. మీరు గనుక కీరదోసకాయ ముక్కలను క్రమం తప్పకుండా కళ్లచుట్టూ ఉపయోగిస్తే ముడతలు చాలా వరకకు తగ్గుతాయి.ఇది కళ్ళ వృద్ధాప్య సంకేతాలను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది.
కీరదోసకాయను ఎలా ఉపయోగించాలి?
ఏ చిట్కా అయినా సరే సరైన పద్దతిలో ఉపయోగిస్తేనే ఫలితాలు కనిపిస్తాయి. అందుకే కీరదోసకాయను సరైన పద్దతిలో వాడాలి. ఇందుకోసం ముందుగా కీరదోసకాయను ఫ్రిజ్ లో పెట్టి చల్లగా అయ్యేదాక వెయిట్ చేయాలి. ఆ తర్వాత వీటిని సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత మీ ముఖ్యాన్ని శుభ్రంగా కడిగి కళ్లపై కోసిన కీరా ముక్కలను పెట్టాలి. 15 నిమిషాల తర్వాత తీసేస్తే సరిపోతుంది. మీరు ఇలా వారానికి మూడు సార్లు చేయాలి.