ముందుగా చేయాల్సినవి: ఉసిరికాయలను శుభ్రంగా కడిగి, తడి లేకుండా తుడుచుకోవాలి. ఆ తర్వాత గింజలు తీసేసి సన్నగా తురుముకోవాలి. అన్నాన్ని ముందే వండుకుని, ఒక వెడల్పాటి ప్లేట్‌లో వేసి పొడిపొడిగా చల్లార్చుకోవాలి. వేడి అన్నం వాడితే ముద్దగా అయిపోతుంది.
తాలింపు వేసే విధానం: స్టవ్ మీద కడాయి పెట్టి నువ్వుల నూనె వేడి చేయాలి. నూనె కాగాక ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత మినప్పప్పు, శనగపప్పు వేసి దోరగా వేయించుకోవాలి.
మసాలాలు కలపడం: పప్పులు వేగాక, ఎండుమిర్చి, వేపిన పల్లీలు వేసి ఒకసారి కలపాలి. అందులోనే ఇంగువ, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాలి. ఆ తర్వాత పసుపు, తగినంత ఉప్పు, కరివేపాకు వేసి కలపాలి.
ఉసిరి తురుము వేయించడం: ఈ తాలింపులో ముందుగా తురుమి పెట్టుకున్న ఉసిరికాయను వేయాలి. మంటను మీడియంలో పెట్టి 2 నుంచి 3 నిమిషాలు మాత్రమే వేయించాలి. ఎక్కువసేపు వేయిస్తే అందులోని పోషకాలు, రుచి తగ్గిపోతాయి.
అన్నం కలపడం: ఉసిరి తురుము కాస్త వేగాక, చల్లార్చుకున్న అన్నాన్ని కడాయిలో వేయాలి. గరిటెతో అన్నం మెతుకులు విరగకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. మసాలా, ఉసిరి తురుము అన్నానికి బాగా పట్టాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
అంతే ఉసిరికాయ అన్నం రెడీ అయినట్టే.