ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను కూడా ఆ డెవలపర్ వివరించాడు. సరైన లీవ్ పాలసీ లేకపోవడం, ప్రస్తుత జీతంతో పోలిస్తే తక్కువ హైక్ ఉండటం, వేరే ప్రాంతానికి మారడానికి ఎలాంటి సపోర్ట్ ఇవ్వకపోవడం వంటి అనేక అంశాలను అతను ప్రస్తావించాడు. ''ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకు అనుకూలంగా లేదు, అందుకే ఈ అవకాశాన్ని వదులుకోవాల్సి వస్తోంది" అని అతను స్పష్టంగా చెప్పాడు. రూ.72 లక్షల ప్యాకేజీ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, తన వృత్తిపరమైన, వ్యక్తిగత ప్రాధాన్యాలకు ఇది సరిపోదని ఆ డెవలపర్ నొక్కి చెప్పాడు.
"జీవన వ్యయం, రిలోకేషన్ బోనస్ లేకపోవడం, లీవ్ పాలసీ లేకపోవడం, కేవలం 25% హైక్ వంటివన్నీ పరిగణనలోకి తీసుకుంటే, ఈ ఆఫర్ నాకు సరైనది కాదు" అని అతను పేర్కొన్నాడు. కెరీర్ ప్రారంభంలో ఉంటే బహుశా తాను ఈ ఆఫర్‌ను అంగీకరించేవాడినని అతను అన్నాడు. "అయితే ఇప్పుడు మాత్రం ఈ కాంట్రాక్ట్ ఇరుపక్షాలకు సమంగా కాకుండా, కేవలం కంపెనీకే అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తోంది" అని అతను జోడించాడు.