Published : Sep 18, 2026, 12:56 PM ISTUpdated : Sep 18, 2026, 12:57 PM IST
Jobs: లింక్డ్‌ఇన్ రిపోర్టుల ప్రకారం భారత్‌లో ఉద్యోగాల వృద్ధి టైర్ 1 మెట్రోల నుండి విశాఖ, విజయవాడ వంటి టైర్ 2 నగరాలకు వేగంగా మారుతోంది. ఇండియాలో ప్రస్తుతం ఎక్కువగా ఉద్యోగాలు అందిస్తున్న టాప్ 10 నగరాలు ఏవో ఇక్కడ తెలుసుకుందాం.
ఐటీ ఉద్యోగాల గుడ్‌న్యూస్: బెంగళూరు, హైదరాబాద్ వదిలేసి ఇక్కడికి రండి
ఇండియాలో టైర్ 2 నగరాలు ప్రగతిలో వేగంగా దూసుకుపోతున్నాయి. దేశంలో డిగ్రీలు పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగ రేటు రోజురోజుకూ పెరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో కొత్త ఉద్యోగాలు ఎక్కడ వస్తున్నాయి, ఏ నగరాల్లో ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి అనే దానిపై జరిగిన ఒక తాజా విశ్లేషణలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఇప్పటివరకు ఉద్యోగాలకు చిరునామాగా ఉన్న ఢిల్లీ, గుర్గావ్, ముంబై, బెంగళూరు, పుణే వంటి టైర్ 1 మెట్రో నగరాల్లో ఉద్యోగాల వృద్ధి మందగించినట్లు ఈ రిపోర్ట్ స్పష్టం చేస్తోంది.
తాజాగా వెలువడిన డేటా ప్రకారం, దేశంలో అత్యధికంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్న టాప్ 10 నగరాల జాబితాలో ఒక్క టైర్ 1 మెట్రో కూడా స్థానం సంపాదించుకోలేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రతి ఒక్కరూ హైదరాబాద్, బెంగళూరు లేదా ముంబై వైపు పరుగులు తీయడం మానేసి, అభివృద్ధి చెందుతున్న కొత్త నగరాలపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చిందని విశ్లేషణలు పేర్కొంటున్నాయి.
25
టైర్ 2 నగరాల వైపు మళ్లుతున్న ఏఐ, మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మ్యానుఫ్యాక్చరింగ్, డిజైన్ రంగాల్లో వస్తున్న కొత్త ఉద్యోగాలన్నీ కూడా వేగంగా టైర్ 2 నగరాలకు తరలిపోతున్నాయి. బహుళ జాతి కంపెనీలు, స్టార్టప్‌లు తమ కార్యకలాపాలను విస్తరించడానికి పెద్ద మెట్రో నగరాల కంటే ఈ చిన్న నగరాలనే ఎక్కువగా ఎంచుకుంటున్నాయి. తక్కువ నిర్వహణ వ్యయం, మెరుగైన మౌలిక వసతులు, నిపుణులైన ప్రతిభ లభ్యత వంటి అంశాలు కంపెనీలను ఈ వైపు ఆకర్షిస్తున్నాయి.
దీనివల్ల రాబోయే రోజుల్లో సాంకేతిక, ఉత్పాదన రంగాల్లో కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి టైర్ 2 నగరాలు ప్రధాన కేంద్రాలుగా మారబోతున్నాయి. యువతకు సైతం సొంత ప్రాంతాలకు దగ్గరగా, తక్కువ జీవన వ్యయంతో మంచి ఉద్యోగాలు లభించే వాతావరణం ఏర్పడుతోంది.
35
లింక్డ్‌ఇన్ ఆధారిత 'సిటీస్ ఆన్ ది రైజ్ ఇన్ 2026' రిపోర్ట్
ప్రముఖ ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్‌ఇన్ నమోదు చేసిన జాబ్ పోస్టింగ్స్, మౌలిక సదుపాయాల అభివృద్ధి ఆధారంగా "సిటీస్ ఆన్ ది రైజ్ ఇన్ 2026" (Cities on the Rise in 2026) పేరిట ఒక సమగ్ర రిపోర్టును రూపొందింది. ఈ రిపోర్ట్ భారత్‌లోని ఏ ఏ నగరాల్లో ఉద్యోగాల వృద్ధి ఎక్కువగా ఉందో, ఎక్కడ టాలెంట్ అవసరం అధికంగా ఉందో స్పష్టంగా వివరించింది.
ఈ డేటా ప్రకారం దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ద్వితీయ శ్రేణి నగరాలు అనూహ్య వృద్ధిని నమోదు చేస్తున్నాయి. కంపెనీలు తమ వ్యాపార విస్తరణకు ఈ నగరాలనే ప్రాథమికంగా ఎంచుకుంటున్నాయని ఈ రిపోర్టు నిరూపిస్తోంది.
'సిటీస్ ఆన్ ది రైజ్ ఇన్ 2026' రిపోర్టు ప్రకారం భారత్‌లో ఉద్యోగ అవకాశాల వృద్ధిలో మొదటి 10 స్థానాల్లో నిలిచిన నగరాల జాబితా గమనిస్తే..
1. విశాఖపట్నం
2. లుధియానా
3. సూరత్
4. వడోదర
5. ప్రయాగ్‌రాజ్
6. రాజ్‌కోట్
7. జబల్‌పూర్
8. రాంచీ
9. రాయ్‌పూర్
10. విజయవాడ
ఆంధ్రప్రదేశ్ నుండి విశాఖపట్నం మొదటి స్థానంలో నిలవగా, విజయవాడ పదో స్థానంలో నిలిచి ఉద్యోగ కల్పనలో తమ ఆధిక్యతను చాటుకున్నాయి.
55
రియల్ ఎస్టేట్ ధరల తగ్గుదల.. కొత్త నగరాల్లో నిజమైన ఎదుగుదల
ఈ కీలక మార్పుల వల్ల రాబోయే పదేళ్లలో భారత్‌లోని టైర్ 1 నగరాల్లో రియల్ ఎస్టేట్ ధరల భారం తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో ఇళ్ల అద్దెలు, రియల్ ఎస్టేట్ ధరలు విపరీతంగా పెరగడంతో సగటు ఉద్యోగికి జీవన వ్యయం భారంగా మారింది.
ఉద్యోగాలు ఇప్పుడు ఈ కొత్త నగరాలకు విస్తరిస్తుండటంతో, రాబోయే దశాబ్ద కాలంలో అసలైన ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి ఈ టైర్ 2 నగరాల్లోనే కనిపిస్తుందని స్పష్టమవుతోంది. అందుకే ఉద్యోగార్థులు ఇకపై కేవలం మెట్రో నగరాల పైనే ఆధారపడకుండా ఈ కొత్త అభివృద్ధి కేంద్రాల వైపు చూడటం మంచిదని సూచిస్తున్నారు.