Published : Jul 16, 2025, 05:50 PM ISTUpdated : Jul 16, 2025, 06:05 PM IST
ఏపీలో క్రీడల అభివృద్ధికి కేంద్నిర మంత్రిని నిధులు కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఖేలో ఇండియా, బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రం, జల క్రీడల హబ్ అంశాల్లో సాయం చేయాలని కేంద్రాన్ని కోరారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన రెండో రోజు బుధవారం కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన కేంద్ర యువజన, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని క్రీడా రంగ అభివృద్ధిపై వివిధ అంశాల్లో కేంద్ర సహకారం కావాలని చంద్రబాబు కోరారు.
26
క్రీడా హబ్‌గా
ఈ క్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో ముఖ్యమైన క్రీడా హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం నిర్మాణానికి కేంద్రం సహకరించాలని కోరారు. దీనివల్ల స్థానిక క్రీడాకారులకు ఉన్నత స్థాయి శిక్షణ లభించడంతోపాటు, రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచే క్రీడాకారులు ఎంతో మంది ఎదుగుతారని చెప్పారు.
36
జాతీయ జల క్రీడల శిక్షణా హబ్
అలాగే, జాతీయ జల క్రీడల శిక్షణా హబ్‌ను అమరావతిలో ఏర్పాటు చేసే అవకాశాలపై కూడా చంద్రబాబు ప్రస్తావించారు. కృష్ణా నదీ తీరంలో వాటర్ స్పోర్ట్స్ శిక్షణ కేంద్రాలకు అనువైన వాతావరణం ఉందని, దీనిని కేంద్రం సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్రీడా మౌలిక సదుపాయాలపై ఫోకస్ చేస్తూ, జగన్ హయాంలో నిర్లక్ష్యం పాలైన ప్రాజెక్టులకు మళ్లీ ఊపొచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు వివరించారు. ఇందిరాగాంధీ స్టేడియం (విజయవాడ) అభివృద్ధికి రూ.27 కోట్లు, గుంటూరులో బీఆర్ స్టేడియంలో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు రూ.170 కోట్లు, రాష్ట్రవ్యాప్తంగా క్రీడల మౌలిక సదుపాయాల కోసం రూ.341 కోట్ల నిధుల్ని మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు.
రాజమహేంద్రవరం, కాకినాడ, నరసరావుపేట, తిరుపతుల్లో ఖేలో ఇండియా కింద మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాకినాడ, నాగార్జునా యూనివర్సిటీల్లో నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ల ఏర్పాటు ద్వారా రాష్ట్రానికి ప్రతిభావంతులైన క్రీడాకారులు సిద్ధం చేయవచ్చని చంద్రబాబు తెలిపారు.
జిల్లాల్లో క్రీడాకారులను గుర్తించేందుకు ఖేలో ఇండియా కేంద్రాల సంఖ్యను పెంచాలని కోరారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని తిరుపతిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు మాట్లాడుతూ, 2024 నుంచి 2029 వరకు రాష్ట్ర స్పోర్ట్స్ పాలసీ కింద సమగ్ర స్పోర్ట్స్ ఎకో సిస్టమ్‌ను నిర్మించే దిశగా చర్యలు చేపట్టామని తెలిపారు. క్రీడాకారులకు పునాదిగా మారే మౌలిక సదుపాయాలే కాకుండా, శిక్షణ, పోటీలు, పోటీ ప్రోత్సాహకాలు వంటి అంశాల్లో రాష్ట్రం ముందుండాలని తెలిపారు.
56
రూ.25 కోట్ల నిధుల మంజూరు
తాజాగా ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ 2025ను ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించే అవకాశాన్ని కేంద్రం ఇచ్చినందుకు మంత్రి మాండవీయకు ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రీడలను విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో అత్యుత్తమ వేదికలపై నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ గేమ్స్ నిర్వహణ కోసం రూ.25 కోట్ల నిధుల మంజూరును కోరారు.
66
యువతకు ప్రోత్సాహం
ఈ మేరకు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ముఖ్యమంత్రి వినతులను మంత్రిత్వ శాఖ పరిశీలించి చర్యలు తీసుకుంటుందని అంచనా.సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా క్రీడా రంగ అభివృద్ధికి కేంద్ర సహకారం తీసుకురావడంపై దృష్టి సారించారు. రాష్ట్రంలో క్రీడలతో పాటు యువతకు ప్రోత్సాహం అందించే దిశగా తీసుకున్న ఈ చర్యలు అభివృద్ధికి బాటలు వేస్తాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.