
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారికి బ్యాంకింగ్ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మంచి అవకాశాన్ని అందిస్తోంది. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఉన్న ఎస్‌బీఐ, 2025 సంవత్సరానికి సంబంధించి అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) రిక్రూట్మెంట్ రూపంలో ప్రకటించారు. దేశవ్యాప్తంగా 541 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. కానీ వారు 2025 సెప్టెంబరు 30 నాటికి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి విషయానికి వస్తే, దరఖాస్తుదారుల వయస్సు 2025 ఏప్రిల్ 1 నాటికి 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబీసీలకు మూడు సంవత్సరాలు, దివ్యాంగులకు పది సంవత్సరాల వరకు వయో సడలింపు వర్తిస్తుంది.
పోస్టింగ్ పొందిన అభ్యర్థులకు ప్రారంభ మూలవేతనం రూ. 48,480గా నిర్ణయించారు. వేరే అలవెన్సులు కలిపితే వార్షికంగా దాదాపు రూ. 20.43 లక్షల జీతం లభిస్తుంది. ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది. మొదట ప్రిలిమినరీ పరీక్ష, తరువాత మెయిన్ ఎగ్జామ్, చివరగా ఇంటర్వ్యూ. ఈ మొత్తం ప్రక్రియ కంప్యూటర్ ఆధారిత పరీక్షల ద్వారానే నిర్వహిస్తారు. ఎలాంటి మాన్యువల్ రాత పరీక్ష ఉండదు.
ప్రాథమిక పరీక్షలో మొత్తం 100 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ఇంగ్లీష్, రీజనింగ్ , న్యూమరికల్ అభిలిటీలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతి విభాగానికి 20 నిమిషాల సమయం ఉంటుంది మొత్తంగా ఒక గంట వ్యవధిలో పరీక్ష పూర్తి చేయాలి. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. అంటే, ఇందులో ఉత్తీర్ణులైన వారికే ప్రధాన పరీక్షకు అర్హత ఉంటుంది. ఈ ప్రిలిమినరీ పరీక్షలు జూలై లేదా ఆగస్టు 2025లో జరగనున్నాయి.
ప్రధాన పరీక్ష రెండు విడతలుగా జరుగుతుంది. మొదటి భాగం ఆబ్జెక్టివ్ ప్రశ్నలుగా ఉంటుంది. ఇందులో మొత్తం 170 ప్రశ్నలు ఉంటాయి, వాటికి 200 మార్కులు కేటాయిస్తారు. ప్రశ్నలు ఇంగ్లీష్, రీజనింగ్, మాథ్స్, జనరల్/ఫైనాన్షియల్/బ్యాంకింగ్ అవేర్‌నెస్ అంశాల నుంచి వస్తాయి. ఈ పరీక్షకు మూడుగంటల సమయం ఇస్తారు.
తర్వాత వచ్చే రెండవ భాగం వివరణాత్మక పరీక్ష. ఇందులో అభ్యర్థులు వ్యాసం లేదా లేఖ వ్రాయాల్సి ఉంటుంది. ఈ భాగానికి 50 మార్కులు కేటాయించారు. సమయపరంగా ఇది 30 నిమిషాల పరీక్ష. ఈ మెయిన్ ఎగ్జామ్స్ సెప్టెంబర్ 2025లో జరగనున్నట్లు ఎస్‌బీఐ పేర్కొంది.
ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రక్రియ ప్రధాన పరీక్ష ఫలితాల ఆధారంగా ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఈ ఇంటర్వ్యూలు అక్టోబర్ లేదా నవంబర్ 2025లో జరగవచ్చని అంచనా. మెయిన్ పరీక్ష, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది మెరిట్ జాబితాను తయారుచేసి ఉద్యోగ నియామకాన్ని చేపడతారు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ https://sbi.co.in/web/careers/current-openings లేదా https://ibpsonline.ibps.in/sbipomay25/ లింకులోకి వెళ్లి మీ పేరు, ఇమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ వంటి వివరాలు నమోదు చేయాలి. నమోదు చేసిన తరువాత, అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ లభిస్తాయి. వాటిని ఉపయోగించి లాగిన్ అయి ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి. తరువాత విద్యార్హతలు, వ్యక్తిగత వివరాలు నమోదు చేసి ఫీజు చెల్లించి దరఖాస్తు సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు విషయంలో, జనరల్, ఓబీసీ, EWS వర్గాల అభ్యర్థులకు రూ. 750 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కోసం ఎలాంటి ఫీజు లేదు. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జూలై 14, 2025. ఇది చాలా కీలకమైన తేదీ కావడంతో అభ్యర్థులు చివరి నిమిషానికి వేచి లేకుండా త్వరగా దరఖాస్తు చేసుకోవాలి.