Year Ender World 2023 : ప్రపంచాన్ని కుదిపేసిన భూకంపాలు, అగ్నిపర్వతాలు, యుద్ధాలు.. ఇంకా...

First Published | Dec 14, 2023, 12:47 PM IST

ప్రపంచమంతా కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి సిద్ధమవుతోంది. 2023లో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనాను భారత్ అధిగమించింది. హమాస్-ఇజ్రాయెల్ వివాదం ప్రపంచాన్ని కుదిపేసింది. అలాంటి సంఘటనల సమాహారం..

టర్కీ,  సిరియా భూకంపం 
ఫిబ్రవరిలో, టర్కీ, సిరియాల్లో శక్తివంతమైన భూకంపాలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. మొదటి భూకంపం, 7.8 తీవ్రతతో, ఉదయం 4:15 గంటలకు సంభవించింది. తరువాత 1:24 గంటలకు 7.5 తీవ్రతతో రెండవ భూకంపం సంభవించింది, దానితో పాటు అనేక బలమైన ప్రకంపనలు వెంటవెంటనే రావడంతో తీవ్రంగా నష్టం వాటిల్లింది. దీని ప్రభావం ఫలితంగా టర్కీలో 59,000 మంది, సిరియాలో 8,000 మంది మరణించారు.

కాలిఫోర్నియా మాంటెరీ పార్క్ షూటింగ్
జనవరి 21, 2023న, యునైటెడ్ స్టేట్స్‌లోని కాలిఫోర్నియాలోని మాంటెరీ పార్క్‌లో సామూహిక కాల్పులు జరిగాయి. అక్కడ 72 ఏళ్ల ముష్కరుడు పదకొండు మందిని చంపి, తొమ్మిది మందిని గాయపరిచాడు. మరుసటి రోజు టోరెన్స్‌లో పోలీసులతో ఎదురుకాల్పుల్లో స్వయంగా తుపాకీతో కాల్చుకుని మృతి చెందాడు. 


ట్విట్టర్ నుంచి ఎక్స్ గా మార్పు 
టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ గత సంవత్సరం ట్విట్టర్‌ని కొనుగోలు చేసి దాని పేరును "X"గా మార్చారు. మొదట 2022 ఏప్రిల్‌లో ఒక్కో షేరుకు నిర్దిష్ట ధరకు కొనుగోలు చేస్తున్నానని చెప్పాడు. జూలై నాటికి దీనినుంచివెనక్కి తగ్గాలనుకున్నాడు. కొన్ని ఒడిదుడుకుల తర్వాత, అక్టోబర్ 27, 2022న అధికారికంగా ట్విట్టర్ కు కొత్త యజమాని అయ్యాడు. జూలై 2023లో, మస్క్ Twitterకి "X" అని పిలవడం మొదలుపెట్టాడు. ఆ తరువాత ఫోన్‌లలో దాని లోగోలను మార్చారు.

ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి 
అక్టోబర్ 7 ఉదయం, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఇజ్రాయెల్‌పై  దాడికి దిగింది. గాజాను హమాస్ ఆధీనంలోకి తీసుకున్నప్పటి నుంచి ఇజ్రాయెల్ తో మూడుసార్లు ఘర్షణలు జరిగాయి. దక్షిణ, మధ్య ఇజ్రాయెల్ లో భారీ రాకెట్ దాడులు జరిగాయి. డజన్ల కొద్ది హమాస్ పోరాటకారులు వాయు, భూ, సముద్ర మార్గాల ద్వారా ఇజ్రాయెల్ లోకి చొరబడ్డారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడిఎఫ్) దళాలతో ఘర్షణకు దిగారు. సాధార‌ణ పౌరులను, ఇజ్రాయిల్ సైనికులతో సహా డజన్ల మందిని బందీలుగా తీసుకున్నారు. 

చైనాను దాటేసిన భారత్.. 
భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనాను దాటింది. 2023లో, భారతదేశం చైనాను అధిగమించి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. 1.43 బిలియన్ల జనాభాను అంచనా వేసింది. రాబోయే దశాబ్దాల పాటు అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారతదేశం ఈ హోదాను కొనసాగించే అవకాశం ఉందని అంచనాలు సూచిస్తున్నాయి. 

ఫ్రెడ్డీ తుపాను
ఫ్రెడ్డీ తుపాను మలావి, మొజాంబిక్, నైరుతి ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో 1,400 మందికి పైగా మరణాలకు దారితీసింది. ఇప్పటివరకు చరిత్రలో సుదీర్ఘకాలంగా నమోదైన ఉష్ణమండల తుఫాను ఇది. 

టైటాన్ సబ్‌మెర్సిబుల్ సంఘటన
జూన్ 18, 2023న, కెనడాలోని న్యూఫౌండ్‌లాండ్ తీరానికి సమీపంలో ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో అంతర్జాతీయ జలాల్లో ఐదుగురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న టైటాన్ అనే సబ్‌మెర్సిబుల్ అదృశ్యమైంది. టైటాన్ నౌక శిథిలాలను చూడడానికి వెడుతున్న క్రమంలో సముద్రంలోకి డైవ్ చేసిన 1 గంట 45 నిమిషాలలో కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. అందులో ఉన్నవారంతా మృతి చెందారు. 

G20కి భారతదేశం ఆతిథ్యం

సెప్టెంబర్ 9-10 తేదీలలో భారతదేశం తన తొలి G20 లీడర్స్ సమ్మిట్‌ను నిర్వహించింది. అమెరికా అధ్యక్షుడు బిడెన్, కెనడాకు చెందిన ట్రూడో, బ్రిటన్ ప్రధాని రిషి సునక్ సహా వివిధ ప్రభుత్వాలకు చెందిన 43 మంది అధిపతులు ఈ సదస్సులో పాల్గొన్నారు. అయితే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్,  చైనా అధ్యక్షుడు జి ఈ కార్యక్రమానికి హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు.

ఇండోనేషియాలోని అగ్నిపర్వతం విస్పోటనం
ఇండోనేషియాలో మౌంట్ మెరాపి అగ్నిపర్వతం బద్దలయ్యింది. దీంతో 18మంది మృతి చెందారు. మొదట ఈ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 11అనుకున్నారు. కానీ గల్లంతైన వారిలో చాలామంది మృతి చెందినట్లు తెలిసింది. వీరిలో పర్వతారోహకులే ఎక్కువమంది ఉన్నారు. 

పెరిగిన భూతాపం
నవంబర్ 17న తొలిసారిగా భూమి రెండు డిగ్రీల మార్కును దాటింది. దీంతో గ్లోబల్ వార్మింగ్ పై ఆందోళన తీవ్రం అయ్యింది. ఇధి ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచం పారిశ్రామిక పూర్వ స్థాయి కంటే దాదాపు 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుదలకు దారి తీస్తుందని ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన కొత్త నివేదిక తెలుపుతోంది. గ్లోబల్ వార్మింగ్‌ను 2 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయడానికి దేశాలు ఉద్గారాలను 28 శాతం తగ్గించాలని, 1.5 డిగ్రీల సెల్సియస్ లక్ష్యాన్ని చేరుకోవడానికి 42 శాతానికి తగ్గించాలని ఐక్యరాజ్యసమితి ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ ఉద్గారాల గ్యాప్ నివేదిక 2023 "బ్రోకెన్ రికార్డ్" పేరుతో విడుదల చేసింది.
 

Latest Videos

click me!