Yahya Sinwar: గాజా స్ట్రిప్‌లోని హమాస్ నాయకుడు యాహ్యా సిన్వార్ ఈ ప్రాంతంలో తీవ్రమైన ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాల క్రమంలో ప్రాణాలు కోల్పోయి ఉంటారని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇజ్రాయెల్-పాలస్తీనా మిలిటెంట్ గ్రూపుల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు-హింసాత్మక దాడుల మధ్య ఈ విషయం వెలుగులోకి వచ్చింది. "గాజాలో IDF ఆపరేషన్ల సమయంలో ముగ్గురు తీవ్రవాద నాయకులు హతమయ్యారు. తీవ్రవాదులలో ఒకరైన యాహ్యా సిన్వార్ ఈ లిస్టులో ఉన్నారనే అవకాశాలను ఐడీఎఫ్, ఐఎస్ఏ లు తనిఖీ చేస్తున్నాయి. ఇప్పుడే ఈ తీవ్రవాదుల గుర్తింపును నిర్ధారించలేము" అని ఎక్స్ లో IDF ఒక ప్రకటనలో తెలిపింది. .
"ఉగ్రవాదులను అంతమొందించిన భవనంలో వారు ఉన్నట్లు ఎటువంటి ఆనవాలు లేవు. ఆ ప్రాంతంలో పనిచేస్తున్న బలగాలు అవసరమైన జాగ్రత్తలతో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి" అని IDF తెలిపింది. ఇదే క్రమంలో హమాస్ నాయకుడు యాహ్యా సిన్వార్ మృతదేహంగా చెప్పబడుతున్న ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అధికారిక ధృవీకరణ జరగాల్సి ఉంది. గాజాలో యుద్ధానికి దారితీసిన అక్టోబర్ 7, 2023 దాడికి ప్రధాన సూత్రధారి, హమాస్ నాయకుడు యాహ్యా సిన్వార్ సైనిక ఆపరేషన్‌లో మరణించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. అయితే, అతని మరణం ఇంకా నిర్ధారణ కాలేదు.
కాగా, జూలైలో ఇరాన్‌లో జరిగిన పేలుడులో ఇజ్రాయెల్‌పై విస్తృతంగా నిందలు వేయబడిన మునుపటి నాయకుడు ఇస్మాయిల్ హనియే హతమైన తర్వాత సిన్వార్ హమాస్ అధిపతి అయ్యాడు.
ఎవరీ యాహ్యా సిన్వార్?
సిన్వార్ 1962లో గాజా పట్టణంలోని ఖాన్ యూనిస్‌లోని శరణార్థి శిబిరంలో జన్మించాడు. అతను 1987లో ఏర్పాటైన హమాస్‌లో ప్రారంభ సభ్యుడు. చివరికి అతను గ్రూప్ భద్రతా విభాగానికి నాయకత్వం వహించాడు. 1980ల చివరలో ఇజ్రాయెల్ అతన్ని అరెస్టు చేసింది. అతను 12 మంది అనుమానిత సహకారులను చంపినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అతను "ది బుట్చర్ ఆఫ్ ఖాన్ యూనిస్" అనే మారుపేరును సంపాదించిపెట్టింది. ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులను చంపడం వంటి నేరాలకు అతనికి నాలుగు జీవితకాల శిక్షలు విధించారు.
సిన్వార్ గాజాకు తిరిగి వచ్చినప్పుడు, అతను క్రూరత్వానికి పేరుగాంచిన హమాస్ నాయకత్వ శ్రేణుల ద్వారా త్వరగా ఎదిగాడు. 2016లో హమాస్‌లోని మరో అగ్ర కమాండర్ మహమూద్ ఇష్తేవిని అంతర్గత అధికార పోరాటంలో హత్య చేయడం వెనుక ఆయన హస్తం ఉన్నట్లు విస్తృతంగా విశ్వసిస్తున్నారు. ఆ తర్వాత సిన్వార్ గాజాలోని హమాస్‌కు అధిపతి అయ్యాడు. అక్కడి ప్రాంతంపై పట్టు సాధించాడు. సిన్వార్, హమాస్ సాయుధ విభాగం అధిపతి మహమ్మద్ దీఫ్‌తో కలిసి అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన ఆకస్మిక దాడిని రూపొందించినట్లు భావిస్తున్నారు.