
Lockdown in Pakistan : లాక్ డౌన్ ... ఈ పదం వింటేనే మనకు వణుకు పుడుతుంటుంది. కరోనా మహమ్మారి కోరలు చాస్తున్నవేళ... ప్రజలు పిట్టల్లా రాలిపోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన భారత ప్రభుత్వం యావత్ దేశాన్ని స్తంభింపజేసింది. ఈ లాక్ డౌన్ ఎందరో జీవితాలను తలకిందులు చేసింది. కాబట్టి ఈ లాక్ డౌన్ అనే పదం ప్రమాదానికి సంకేతంగా మారింది. కానీ మన దాయాది దేశం పాకిస్తాన్ లో భద్రతా కారణాలు రిత్యా లాక్ డౌన్ విధించారు. విచిత్రమైన ఈ లాక్ డౌన్ సంగతేంటో తెలుసుకుందాం.
పాకిస్థాన్ లో లాక్ డౌన్ కు కారణమిదే :
దేశీయంగా, అంతర్జాతీయంగా ముఖ్యమైన కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఆయా దేశాలు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేయడం సర్వసాధారణం. ఈ సందర్భాల్లో దేశంలో పలు ఆంక్షలు, కొన్ని మార్పులు ఉంటాయి. ఇది భారత్ వంటి శాంతిభద్రతలు అదుపులో వుండే సాధారణ దేశాల్లో పరిస్థితి. కానీ ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా వుండే దేశాల్లో అంతర్జాతీయ కార్యక్రమాల నిర్వహనే గగనం... ఒకవేళ అలాంటి దేశాలకు ఆతిథ్య అవకాశం లభిస్తే పరిస్థితి ఎలా వుంటుందో ప్రస్తుతం పాకిస్థాన్ ను చూస్తే అర్థమవుతుంది.
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) 23వ సదస్సు అక్టోబర్ 15, 16 తేదీల్లో (మంగళ, బుధవారం) జరిగింది. ఈ సదస్సు కోసం విదేశీ ప్రతినిధులు భారీగా పాకిస్థాన్ లో పర్యటించారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా, విదేశీ ప్రతినిధుల భద్రత కోసం పాక్ సైన్యం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఈ రెండ్రోజులు ఇస్లామాబాద్, రావల్పిండి నగరాల్లో చాలా కఠిన నిబంధనలు అమలు చేసినట్లు తెలుస్తోంది.
విదేశీ ప్రతినిధుల పర్యటన నేపథ్యంలో పాక్ ప్రభుత్వం రాజధాని నగరంలో పూర్తి లాక్‌డౌన్ విధించింది. ముందు జాగ్రత్తగా స్కూళ్లు, కాలేజీలను మూసివేశారు. పెళ్లిళ్లు వంటి వేడుకలపై ఆంక్షలు విధించారు. భద్రత కోసం రాజధానిలో సైన్యాన్ని మోహరించారు. నగరంలో అత్యంత హై అలర్ట్ ప్రకటించారు. ఇస్లామాబాద్, రావల్పిండిలో పదివేల మంది సైనికులను, కమాండోలను మోహరించారని వార్తలు వెలువడ్డాయి.
స్థానిక పోలీసులు, ఇతర భద్రతా దళాలు సైన్యం నుంచి కీలక ఆదేశాలు అందుకున్నాయి. అక్టోబర్ 12 నుంచి 16 వరకు రెండు నగరాల్లోనూ పెళ్లి మండపాలు, కేఫ్‌లు, రెస్టారెంట్లు, స్నూకర్ క్లబ్‌లను మూసివేశారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించని వ్యాపారులు, హోటల్ యజమానులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బయటి వ్యక్తులు తమ భవనాల్లో లేరని భవన యజమానుల నుండి ప్రభుత్వం హామీ తీసుకుంది.
ఇస్లామాబాద్, రావల్పిండిలో మూడు రోజుల పాటు ప్రభుత్వ సెలవు ప్రకటించారు. ఇమ్రాన్ ఖాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ రెండు నగరాల్లో నిరసనలు చేపట్టే అవకాశం ఉందన్న వార్తలు, ఉగ్ర కార్యకలాపాల నేపథ్యంలో ఇలా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంది ప్రభుత్వం.
nghai_Cooperation_Organisation
ఏమిటీ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ :
2001 లో చైనా, రష్యా, కజకిస్థాన్, కిర్గిస్తాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలు పరస్పర స్నేహపూర్వక, ఆర్థిక, భద్రతా సంబంధాలు, సహాయసహకారాలు, శాంతి కోసం షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ను ఏర్పాటుచేసాయి. అయితే కాలక్రమేనా ఈ ఆర్గనైజేషన్ లో భారత్, పాకిస్థాన్, ఇరాన్ లు కూడా చేరాయి. దీంతో తొమ్మిది సభ్యదేశాలతో ఈ ఆర్గనైజేషన్ కొనసాగుతోంది. వాణిజ్యం, విద్య, ఇంధనం, రవాణా, పర్యాటకం, పర్యావరణం వంటి అంశాల్లో సభ్యదేశాల మధ్య సుస్థిర అభివృద్ధి ఈ సంస్థ లక్ష్యం.
ప్రతి సంవత్సరం ఈ షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమవేశాలు జరుగుతాయి. ఈ సమావేశంలో సభ్యత్వ దేశాదినేతలు లేదంటే విదేశాంగమంత్రులు పాల్గొంటారు. మొదటిసారి 2001 జూన్ 14,15 తేదీల్లో చైనాలోని షాంఘైలో ఈ శిఖరాగ్ర సమావేశం జరిగింది. 2020లో ప్రభుత్వాధినేతల శిఖరాగ్ర సమావేశానికి భారత్ వేదికయ్యింది... కానీ కరోనా కారణంగా కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. తాజాగా 2024 అక్టోబర్ 15,16 తేదీల్లొ పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో ఈ సదస్సు జరిగంది. వచ్చేఏడాది అక్టోబర్ లో రష్యా వేదికగా ఈ సదస్సు జరగనుంది.
పాకిస్థాన్ గడ్డపై భారత్ గర్జన :
దాదాపు దశాబ్దం తర్వాత పాకిస్థాన్ లో భారత విదేశాంగమంత్రి పర్యటించారు. షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశంలో భారత్ తరపున మంత్రి జైశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పాక్ గడ్డనుండి, ఈ ఆర్గనైజేషన్ లో కీలకంగా వున్న చైనా ఎదుటే ఆసక్తికర కామెంట్స్ చేసారు.
అభివృద్ది, శాంతి, స్థిరత్వం అవసరమని జైశంకర్ పేర్కొన్నారు. అయితే సరిహద్దుల వెంట ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం వంటి మూడు చెడు విషయాలను ఎదుర్కోవాల్సిన అవసరం వుందన్నారు. నిజాయితీ,విశ్వాసంతో కూడిన సహకారం, SCO మార్గదర్శకాలకు కట్టుబడి వుండాలంటూ పాక్, చైనాల పేరును ప్రస్తావించకుండానే కౌంటర్ ఇచ్చారు జైశంకర్.