
Sunita Williams: భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి అయిన సునీతా విలియమ్స్ ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ఐఎస్ఎస్) లో ఉన్నారు. దాదాపు తొమ్మిది నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. ఆమెతో పాటు మరో ఆస్ట్రోనాట్ బుచ్ విల్మోర్ కూడా ఉన్నారు. అసలు సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి ఎందుకు వెళ్లారు? అక్కడే ఎలా చిక్కుకుపోయారు? అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
సునీతా విలియమ్స్ ఎప్పుడు అంతరిక్షంలోకి వెళ్లారు?
భారతీయ నేపథ్యం కలిగిన అమెరికన్ అస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ 2006 డిసెంబరు 9న తన మొదటి అంతరిక్ష ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆమె తన మొదటి మిషన్‌లో 195 రోజులు అంతరిక్షంలో గడిపింది. ఆ తర్వాత అనేక అంతరిక్ష ప్రయోగాల ద్వారా అనేక రికార్డులు సాధించారు.
తన మొదటి అంతరిక్ష మిషన్ తోనే సునీతా విలియమ్స్ ఒక మహిళకు అత్యధిక సమయం అంతరిక్షంలో గడిపిన రికార్డును నెలకొల్పారు. అలాగే, ఆమె తన ప్రయాణంలో 7 spacewalks (స్పేస్ వాక్) నిర్వహించారు. ఇది ఒక మహిళ చేసిన అత్యధికం. ఐఎస్ఎస్ నిర్మాణానికి, వివిధ విషన్లలో భాగస్వామి అయ్యారు. ఈ క్రమంలోనే జూన్ 2024లో బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా మరోసారి ఐఎస్ఎస్‌కు చేరుకున్నారు.
సునీతా విలియమ్స్ అంతరిక్షంలో ఎలా చిక్కుకుపోయారు?
జూన్ 2024లో బోయింగ్ స్టార్‌లైనర్ మిషన్‌లో సునీతా విలియమ్స్ కీలక పాత్ర పోషించారు. బోయింగ్ CST-100 Starliner Crew-9 మిషన్‌లో భాగంగా అంతరిక్షానికి బయలుదేరారు. ఆమెతో పాటు మరో ఆస్ట్రోనాట్ బుచ్ విల్మోర్ కూడా ఉన్నారు. ఈ మిషన్ కోసం ఆమె ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS) కు చేరుకున్నారు. అక్కడ శాస్త్రీయ ప్రయోగాలు చేయడంతో పాటు ఐఎస్ఎస్ లో కొన్ని పనులు చేశారు.
అయితే, ఈ మిషన్ ను ప్రారంభంలో కేవలం 8 రోజుగా నిర్ణయించుకున్నారు. Starliner వ్యవస్థ, NASA, బోయింగ్ మధ్య చేసిన భాగస్వామ్యంతో మిషన్ విజయవంతంగా జరిగింది. అక్కడికి చేరుకునే వరకు బాగానే ఉంది. అయితే, తిరిగి వచ్చే సమయంలోనే సమస్య వచ్చింది. స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారు భూమికి తిరిగివచ్చే ప్రయాణం ఆలస్యమైంది. దీంతో ఏకంగా 9 నెలల పాటు అక్కడే చిక్కుకుపోయారు.
దాదాపు 9 నెలల తర్వాత భూమి మీదకు సునీతా విలియమ్స్ !
సాంకేతిక సమస్యల కారణంగా సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లు దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోయారు. అనేక ప్రయత్నాలు విఫలమైన తర్వాత మరోసారి అమెరికా అంతరిక్ష ప్రయోగ సంస్థ నాసా, ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్‌ఎక్స్ సంయుక్తంగా వారిని భూమి మీదకు తీసుకురావడానికి క్రూ-10 మిషన్‌ను ప్రారంభించింది. ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా నలుగురు వ్యోమగాములను ఐఎస్ఎస్‌కు పంపారు. ఈ మిషన్ ద్వారా సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమికి తిరిగి తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 4.33 గంటలకు అమెరికాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ డ్రాగన్ క్యాప్సుల్‌ను విజయవంతంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. అయితే, సునీతా విలియమ్స్ ను భూమికి తీసుకొచ్చేందుకు మార్చి 12నే రాకెట్ లాంచ్ అవ్వాల్సి ఉంది. కానీ వివిధ కారణాల వల్ల ఆలస్యం అయింది. తాజా సమాచారం ప్రకారం మార్చి 19 లేదా ఆ తర్వాత వారు భూమికి తిరిగొచ్చే అవకాశం ఉంది.