ట్రంప్ గెలుపు సందేశం :
తన గెలుపు ఖాయం అయ్యాక డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. తన జీవితంలో ఇదో మరిచిపోలేని రోజు ... తన పాలనలో ఇక అమెరికా ప్రజలకు కష్టాలు వుండవన్నారు. తనపై నమ్మకంతో గెలిపించిన అమెరికా ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నా... మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా దేశానికి పూర్వ వైభవం తీసుకువస్తానని ట్రంప్ అన్నారు.
ఇంతటి ఘన విజయాన్ని తాను ఊహించలేదు... ముఖ్యంగా స్వింగ్ రాష్ట్రాల్లో ఊహించిన దానికంటే మంచి ఓట్లు వచ్చాయని ట్రంప్ అన్నారు. రిపబ్లికన్ పార్టీపై ప్రజలకు ఎంత నమ్మకం వుందో ఈ ఎన్నికల ఫలితాలే చెబుతున్నాయని అన్నారు. మొత్తంగా 315కు పై ఎలక్టోరల్ ఓట్లను సాధిస్తానని ట్రంప్ ధీమా వ్యక్తం చేసారు.
తన గెలుపుకోసం సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని ట్రంప్ అన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే తన గెలుపులో భార్య మెలానియా పాత్రకూడా చాలా వుందన్నారు.
మొత్తంగా అమెరికా 47వ అధ్యక్షుడిగా గెలుపొందిన ట్రంప్ మరోసారి పాలనాపగ్గాలు చేపట్టనున్నారు. అమెరికాకు మొదటి మహిళా అధ్యక్షురాలిగా కమలా హారిస్ మారతారన్న డొమొక్రట్ల ఆశలపై ఈ ఎన్నికల ఫలితాలు నీళ్లు చల్లాయి. భారత సంతతి మహిళ కావడంతో హారిస్ విజయం సాధించాలని చాలామంది భారతీయులు కోరుకున్నారు. కానీ చివరకు ట్రంప్ నే విజయం వరించింది.