
Donald Trump : ఇండియన్స్ డాలర్ డ్రీమ్స్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నీళ్లుచల్లారు. ఇప్పటికే వీసా నిబంధనలు కఠినతరం చేయడం, అక్రమ వలసలను అడ్డుకోవడం వంటి నిర్ణయాలతో ఇతరదేశాలనుండి అమెరికాకు వెళ్ళువారి సంఖ్యను బాగా తగ్గించారు ట్రంప్. తాజాగా మరో బాంబ్ పేల్చారు... ఈసారి కేవలం ఇండియన్స్ నే టార్గెట్ గా చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు ట్రంప్.
అమెరికన్ టెక్ దిగ్గజాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపనీలకు ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక భారతీయులను ఉద్యోగాల్లో నియమించుకోవడం ఆపాలని... అమెరికన్లకు అవకాశాలు కల్పించాలని ఆయన సూచించారు. కేవలం ప్రభుత్వమే కాదు అమెరికన్ వ్యాపారవేత్తలు, సంస్థలు కూడా 'అమెరికా ఫస్ట్' నినాదాన్ని ఫాలో కావాలని డొనాల్డ్ ట్రంప్ సూచించారు.
గత అధ్యక్ష ఎన్నికల్లో 'అమెరికా ఫస్ట్' నినాదాన్ని బలంగా వినిపించారు ట్రంప్. అదే తనను గెలిపించిందని బలంగా నమ్ముతున్నారు… అందుకే అధికారంలోకి రాగానే దాన్ని అమలు చేస్తున్నారు. దీన్ని అమెరికా సంస్థలపై కూడా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా వాషింగ్టన్ డిసిలో జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సులో ఇండియన్స్ కు ఉద్యోగాలివ్వొద్దంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ అమెరికాకు వెళ్లాలనుకుంటున్న భారతీయ విద్యార్థులు, ఉద్యోగుల్లో ఆందోళనను మరింత పెంచింది.
అమెరికన్ టెక్ సంస్థలు గ్లోబల్ మైండ్ సెట్ దేశానికి ఎంతో నష్టం చేస్తోందనేలా ట్రంప్ ప్రసంగం సాగింది. విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం, విదేశీ ఉద్యోగులనే నియమించుకోవడం వల్ల దేశం చాలా కోల్పోతోందన్నారు. చైనాలో కంపెనీలు పెట్టడం, ఇండియన్స్ కి ఉద్యోగాలివ్వడం వలన అమెరికా ప్రజల అవకాశాలు దెబ్బతింటున్నాయని... ఇది దేశానికి మంచిదికాదన్నారు. తమ పాలనలో ఇలాంటివి కట్టడిచేస్తామని ట్రంప్ హెచ్చరించినట్లు మాట్లాడారు.
కేవలం ప్రభుత్వం, ప్రజలకే కాదు పెట్టుబడిదారులు, కంపెనీలకు కూడా దేశభక్తి ఉండాలని ట్రంప్ సూచించారు. ఇకపై అమెరికన్ టెక్ కంపెనీలు భారతీయులను నియమించుకోవడం ఆపాలని... స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. దీనివల్ల దేశానికి కూడా లబ్ది జరుగుతుందని ట్రంప్ అన్నారు.
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టైమ్ నడుస్తోంది... ఇందులోనూ అమెరికాదే పైచేయి కావాలని ట్రంప్ అన్నారు. అలా జరగాలంటే సిలికాన్ వ్యాలీ దేశభక్తితో నిండిపోవాలని... టెక్ కంపెనీలన్ని దేశంకోసమే పనిచేయాలని సూచించారు.
ఇప్పటివరకు జరిగిందేదో జరిగిపోయింది... ఇకపై అయినా దేశానికి ప్రాధాన్యత ఇచ్చేలా వ్యవహరించాలని టెక్ కంపెనీలకు ట్రంప్ సూచించారు. అమెరికన్స్ తమను పట్టించేకోవడంలేదనే భావనలో ఉన్నారని... వారిలో అభద్రత భావాన్ని తొలగించాలని టెక్ కంపనీలను డొనాల్డ్ ట్రంప్ కోరారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టాక పరిస్థితులు వేగంగా మారిపోయాయి. అమెరికాలోనే కాదు అంతర్జాతీయ సమాజంలోనూ సరికొత్త అలజడి మొదలయ్యింది. టారీఫ్స్, అక్రమ వలసల విషయంలో ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో ప్రపంచదేశాల మాదిరిగానే భారత్ కూడా ఎఫెక్ట్ అవుతోంది.
అయితే కొన్నిసార్లు ట్రంప్ భారత్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసినట్లుగా నిర్ణయాలుంటున్నాయి. అమెరికాలో పెట్టుబడులు పెట్టరాదంటూ యాపిల్ సంస్థను హెచ్చరించడం ఇలాంటి నిర్ణయమే. చైనాపై అమెరికా టారీప్స్ పెంచడంతో అక్కడ తమ కార్యకలాపాలు తగ్గించి... భారత్ లో పెట్టుబడులు పెట్టాలని యాపిల్ భావించింది. కానీ అలా చేయవద్దని హెచ్చరించినట్లు ట్రంప్ స్వయంగా వెల్లడించాడు.
ఇక భారత్-పాకిస్థాన్ మధ్య యుద్దమేఘాలు కమ్ముకున్న సమయంలో ట్రంప్ తీరు అనుమానాలకు తావిచ్చింది. అతడు పాకిస్థాన్ కు మద్దతుగా కామెంట్స్ చేయడం, ఆ దేశ ఆర్మీ చీఫ్ ను వైట్ హౌస్ కు పిలుచుకుని విందు ఇవ్వడం భారతీయులను నొప్పించాయి. భారత్-పాక్ యుద్దాని ఆపింది తానే అంటూ ట్రంప్ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి… ఇది వేరేవిషయం అనుకొండి.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి భారత్ కు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నాడు. మోదీ తన మిత్రుడు, భారతీయులంటే తనకెంతో ఇష్టం అంటూనే... దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాడు. అతడి చర్యలతో భారతీయులు బెంబేలెత్తిపోతున్నారు... ఇప్పటికే చాలామంది అమెరికా ఆశలను చంపుకుని ఇతరదేశాలకు వెళుతున్నారు.
తాజాగా అమెరికాలో భారతీయుల ఉద్యోగాలు ఇవ్వొద్దని ట్రంప్ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. ‘ఏమయ్యా ట్రంప్... మేం (భారతీయులం) నీకు ఏం ద్రోహం చేసాము.. ఇలా జీవితాలతో ఆడుకుంటున్నావు..’ అంటూ డాలర్ డ్రీమ్స్ చెదిరినవారు అందోళన వ్యక్తం చేస్తున్నారు.