ఆ ఇంటి నిండా పాములే.. గోడల్లో, తలుపుల వెనకాల తిరుగాడుతూ పుట్టలు పుట్టలుగా సర్పాలు...

First Published May 6, 2023, 12:27 PM IST

ఓ మహిళ తన సొంతింటి కలను నెరవేర్చుకుంది. కానీ ఆ ఇల్లు ఓ పాముల పుట్ట అని.. గోడల్లో నుంచి, తలుపులవెనక పాములు తిరగడం చూసి చావు భయంతో బతుకుతోంది. ఈ ఘటన అమెరికాలో వెలుగు చూసింది. 

కొలరాడో : మొదటిసారి సొంతిళ్లు కొనుక్కుందో మహిళ. ఆమె పేరు అంబర్ హాల్ (42). ఆమె కొలరాడోలో నాలుగు బెడ్రూంలు, రెండు బాత్‌రూమ్‌లున్న తన ఇంటిని గృహప్రవేశానికి ముందు చూసుకోవడానికి వెళ్లింది. కానీ అక్కడ ఆమెకు కనిపించిన దృశ్యం ఆమెను షాక్ కు గురయ్యేలా చేసింది. ఇంట్లోని ఊహించని అతిథులతో సొంత ఇంటికల ఇప్పుడు పెద్ద పీడకలగా మారిపోయింది. 

విషయం ఏంటంటే.. ఆ ఇంటి గోడల్లో పాములు కాపురం పెట్టాయి. ఆ ఇల్లే ఓ పాముల పుట్టలా ఉంది. వివరాల్లోకి వెడితే.. అంబర్ హాల్, కొత్త ఇంటిని బుక్ చేసినప్పుడు, ఆ ఇంట్లో పాముల పుట్ట ఉందని తనకు తెలియదని చెప్పుకొచ్చింది. ‘ఇల్లు చూడడానికి వెళ్లినప్పుడు ఇంట్లోని గ్యారేజ్ వెనుక ఉన్న తలుపుల దగ్గర  మా కుక్క క్రిందికి వంగి, చాలా నెమ్మదిగా నడవడం ప్రారంభించింది. 

దానికి ఏదైనా సాలీడో, పురుగో కనిపించిందనుకున్నా... సరే అదేంటో చూడటానికి నేనొచ్చాను. అక్కడ రెండు చిన్న రంధ్రాలు ఉన్నాయి. ఆ రంధ్రాల నుంచి పాములు గోడలపైకి పాకడం చూశాను. దెబ్బకు నేను భయపడిపోయాను" అని తెలిపింది.

గోడలోని పగుళ్లలో తలుపు పక్కన పాములు చుట్టచుట్టుకుని ఉన్నట్లు తాను చూశానని చెప్పారు. 10 రోజుల క్రితం మొదటి పాము కనిపించిందని, అప్పటి నుండి మొత్తం 10 పాములు కనిపించాయని చెప్పారు. "ఇది చాలా దిగ్భ్రాంతికరమైన విషయం.. ఆ పాము చాలా పెద్దగా ఉంది. అన్ని పరిశోధనల తర్వాత, అందరూ అది ఒక రకమైన గార్టెర్ పాము అని అంటున్నారు. కానీ వారెవరూ ఇప్పటివరకు ఇంత పెద్ద గార్టర్ పామును చూడలేదనే చెబుతున్నారు" అని ఆమె అన్నారు. 

అందుకే.. "నేను నా వస్తువులను వేటినీ అన్ ప్యాక్ చేయలేదు. ఎందుకంటే పెట్టెలలోపల లేదా పెట్టెల క్రింద పాములు ఉండొచ్చని నాకు భయంగా ఉంది. మంచం మీద ఏదో పాకుతున్నట్లు అనిపిస్తే వెంటనే చూడాల్సిందే.. మీరు నడుస్తుంటే.. కాలికింద జరజరా పారినట్టుగా ఉంటుంది. వెంటనే మంచం కిందికి దూకేయాల్సిందే.. మ్యాట్లు చింపి చూడాల్సిందే. అక్కడ ఏమీ లేదని నిర్ధారించుకుంటే కానీ బతకలేరు..’అంటూ చెప్పుకొచ్చింది.

పాములను వదిలించుకోవడానికి ఆమె స్నేక్ ర్యాంగ్లర్‌ను నియమించుకుంది. ఇప్పటివరకు పాములను పట్టుకోవడానికి  సుమారు వెయ్యి డాలర్లు ఖర్చు చేసింది. ఆమె ఇంకా మాట్లాడుతూ.. ఇవి ఈ ఇంట్లో ఉన్న సంగతి బహుశా నాకు అమ్మిన వాళ్లకు కూడా తెలిసే ఉంటుంది. కానీ నాకు చెప్పలేదు. నేను నా జీవితంలో పోగేసిన డబ్బంతా ఖర్చు చేసి ఈ ఇంటిని కొనుగోలు చేశాను. కానీ దీన్ని నేను సంతోషపడలేకపోతున్నాను’ అని చెప్పుకొచ్చింది.

అంతేకాదు.. టాయిలెట్లోనుంచి ఏ పాము వస్తుందో అన్న భయంతో ఆ కుటుంబం బాత్‌రూమ్‌ను ఉపయోగించేందుకు కూడా భయపడుతోంది. "చావు భయం నన్ను వెంటాడుతోంది" అని ఆ మహిళ చెప్పింది. పెస్ట్ కంట్రోల్ స్పెషలిస్ట్ లు ఈ పాములు దాదాపు రెండేళ్ల నుంచి ఇక్కడ ఉండి ఉంటాయని.. వాటి పరిమాణాన్నిబట్టి చెప్పారని ఆమె తెలిపారు.  

అందుకే తనకు ఈ పాములను చూసిన మొదటి వ్యక్తిని తాను కాదన్న అనుమానం కలుగుతుందని.. తనకు అమ్మినవారికి, అంతకుముందు వచ్చిన వారికి ఈ విషయం తెలుసనుకుంటున్నానని తెలిపింది. 

click me!