కోవిడ్-19 ఇక మీదట ప్రపంచ విపత్తు కాదు.. : డబ్ల్యూహెచ్వో

First Published May 6, 2023, 9:35 AM IST

కోవిడ్ 19 ఇక మీదట ప్రపంచవిపత్తు కాదని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. అయితే ప్రమాదం పూర్తిగా పోలేదని పొంచే ఉందని, జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. 
 

జెనీవా :  ప్రపంచాన్ని గడగడలాడించిన మహమ్మారి కోవిడ్-19 ఇకపై ప్రపంచ విపత్తు కాదని డబ్ల్యూహెచ్ఓ శుక్రవారం నాడు ప్రకటించింది. కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ విపత్తుగా పరిగణించేంతటి  స్థాయిలో లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.  

ప్రపంచ ఆరోగ్య నిపుణులతో గురువారం నాడు దీనిమీద చర్చించిన డబ్ల్యుహెచ్ఓ ఆ తర్వాత ఈ ప్రకటన చేసింది. అలాగని కోవిడ్ -19 మహమ్మారి పూర్తిగా అంతం కాలేదని చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా అది మానవుల ఆరోగ్యానికి ముప్పుగానే ఉందని తెలిపింది.  

ఇప్పటికీ కరోనా వైరస్ బారిన పడి వందలాది మంది ప్రతీ వారం  ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పింది. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. 

దీనిమీద డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనం మాట్లాడుతూ..  కోవిడ్ మళ్ళీ మన ప్రపంచాన్ని ప్రమాదంలో పడేసే పరిస్థితి ఉందా? అనే విషయాన్ని మరోసారి కూడా నిపుణులతో సమీక్ష జరిపించడానికి తాను సిద్ధమేనని.. దీనికి వెనకాడబోనని అన్నారు. 

కోవిడ్ -19 మహమ్మారి మూడేళ్లలో దాదాపు 800 మిలియన్ల మందిని అనారోగ్యంపాలు చేసింది. లక్షలాదిమంది ప్రాణాలు తీసింది. అయితే, ఈ మహమ్మారి ఇకపై ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా పరిగణించబడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

డబ్ల్యూహెచ్ఓ మొదటిసారిగా 30 జనవరి 2020న కోవిడ్‌కి అత్యధిక స్థాయిలో ప్రమాదకర హెచ్చరికను చేసింది. దాని ప్యానెల్ ప్రతి మూడు నెలలకు ఒకసారి జరిగే సమావేశాలలో దీన్ని కొనసాగించింది. 

డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్, టెడ్రోస్ అధనామ్ యూఎన్ ఆరోగ్య సంస్థ కోవిడ్ హెచ్చరిక స్థితిని డౌన్‌గ్రేడ్ చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించగా, అతను దాని నిరంతర ముప్పు గురించి హెచ్చరిక కూడా చేశారు. ఈ వ్యాధి ఇప్పటికీ ప్రతి మూడు నిమిషాలకు ఒకరిని చంపుతుందని ఆయన చెప్పారు.

"నిన్న, ఎమర్జెన్సీ కమిటీ 15వ సారి సమావేశమైంది. అంతర్జాతీయ ఆందోళనకు సంబంధించిన పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీకి ముగింపు ప్రకటించాలని నాకు సిఫార్సు చేసింది" అని "నేను ఆ సలహాను అంగీకరించాను" అని  టెడ్రోస్ చెప్పారు. 

click me!