Snakes Video: దక్షిణ చైనాలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఓ పాముల పెంపక కేంద్రం (స్నేక్ ఫామ్) పూర్తిగా దెబ్బతింది. దీంతో అక్కడ పెంచుతున్న వందలాది పాములు బయటకు వచ్చి వరద నీటితో పాటు నగరంలోకి చేరాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
దక్షిణ చైనాలో ఇటీవల మీసాక్ తుపాను కారణంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో పలు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. ముఖ్యంగా గ్వాంగ్సీ స్వయంప్రతిపత్తి ప్రాంతంలోని హెంగ్‌జౌ ప్రాంతంలో ఉన్న ఒక పాముల పెంపక కేంద్రం వరదల్లో కొట్టుకుపోయింది. దీంతో ఫామ్‌లోని పాములు బోన్ల నుంచి బయటకు వచ్చి వరద ప్రవాహంలో నగరంలోని వివిధ ప్రాంతాలకు చేరుకున్నాయి.
25
దాదాపు 900 పాములు
స్థానిక అధికారుల సమాచారం ప్రకారం, ఈ ఘటనలో 800 నుంచి 900 వరకు పాములు బయటకు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. వీటిలో కింగ్ కోబ్రాలు, నాగుపాములు, వైపర్ జాతికి చెందిన అత్యంత విషపూరితమైన పాములు కూడా ఉన్నాయని తెలిపారు. ఇంత పెద్ద సంఖ్యలో విషపాములు ఒకేసారి బయటకు రావడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
35
పాములను పట్టుకునేందుకు భారీ రెస్క్యూ ఆపరేషన్
వరద ప్రభావిత ప్రాంతాల్లో పాములను గుర్తించి పట్టుకునేందుకు అధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. స్థానిక ప్రజలు కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో పొలాల్లో పెద్ద వలలతో పాములను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరో వీడియోలో వరద నీటిలో రోడ్డుపై ఒకేసారి అనేక విషపాములు పాకుతున్న దృశ్యాలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఈ ఘటనలో ఇప్పటికే ఒక వ్యక్తిని పాము కాటేయగా అతడు చికిత్స పొందుతున్నాడు. అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీటితో నిండిన ప్రాంతాల్లోకి వెళ్లొద్దని, పాములు కనిపిస్తే వాటిని పట్టుకునే ప్రయత్నం చేయకుండా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
55
మరిన్ని పాముల ఫామ్‌లు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం
భారీ వరదల కారణంగా ఆ ప్రాంతంలోని మరికొన్ని చిన్న పాముల పెంపక కేంద్రాలు కూడా దెబ్బతిన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. దీంతో మరిన్ని పాములు బయటకు వచ్చి ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతుండగా, అన్ని పాములను పట్టుకునే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.