ఇటీవల గుజరాత్‌లోని పోర్‌బందర్ పోర్ట్ నుండి మస్కట్ కు కార్గో షిప్ 'ఎంవి గౌతమ్' బయలుదేరింది. అయితే ఈ షిప్ అరేబియా సముద్రంలో ప్రయాణిస్తుండగా టెక్నికల్ ప్రాబ్లమ్ ఏర్పడింది... దీంతో కంట్రోల్ కోల్పోయి నీటిపై కొట్టుకుపోవడం మొదలైంది. ఇలా సముద్రం మధ్యలో ప్రమాదంలో చిక్కుకోవడంతో షిప్ లోని సిబ్బంది కంగారుపడిపోయారు... సాయం కోరగా పాకిస్థాన్ పాజిటివ్ గా స్పందించింది. మానవత్వాన్ని చాటుకుంటూ ప్రమాదంలో ఉన్న షిప్ సిబ్బందిని కాపాడింది పాక్ నేవి.
ప్రమాద సమయంలో ఎంవి గౌతమ్ షిప్ లో ఆరుగురు భారతీయులు, ఓ ఇండోనేషియా పౌరుడు ఉన్నారు. షిప్ ఆగిపోవడంతో మొదట ముంబైలోని మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్‌కు సమాచారం అందించారు సిబ్బంది. వాళ్లే పాకిస్థాన్‌కు సహాయం కోసం సమాచారం పంపారు. ఆ సమయంలో పాకిస్థాన్ నేవీకి చెందిన ఓ నిఘా నౌక అటువైపే పెట్రోలింగ్ చేస్తోంది. సమాచారం అందగానే పాక్ నేవీ అధికారులు వెంటనే 'ఎంవి గౌతమ్' దగ్గరకు చేరుకున్నారు. షిప్‌లోని సిబ్బందికి అవసరమైన మంచి నీళ్లు, ఆహారం, మందులు అందించారు.
ఇలా అంతర్జాతీయ జలాల్లో ప్రమాదాలు జరిగితే దగ్గర్లోని దేశం సహాయం అందించాలి. ఇలా అంతర్జాతీయ నిబంధనల ప్రకారమే పాకిస్థాన్ ఈ సహాయం చేసింది. గత నెలలో కూడా అరేబియా సముద్రంలో ఇలాంటి ఎమర్జెన్సీ కాల్ రావడంతో పాక్ నేవీ స్పందించి 18 మంది విదేశీ నావికులను కాపాడింది.