Iran Israel conflict: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చేందుకు ఇజ్రాయెల్, అమెరికాలు టెహ్రాన్ ట్రాఫిక్ కెమెరాలను హ్యాక్ చేసి, ఏఐ సాంకేతికతతో నిఘా పెట్టి అత్యంత ఖచ్చితత్వంతో కూడిన దాడిని నిర్వహించాయి. దాడికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఇరాన్ అత్యున్నత నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ మృతికి సంబంధించిన సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్, అమెరికా గూఢచారి సంస్థ సిఐఏ సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద నిఘా వ్యూహంగా అభివర్ణిస్తున్నారు. టెహ్రాన్ నగరంలోని ట్రాఫిక్ కెమెరాలను హ్యాక్ చేయడం నుండి మొబైల్ నెట్‌వర్క్‌లను పనిచేయకుండా చేయడం వరకు అన్నింటినీ అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో అమలు చేశారు.
26
ట్రాఫిక్ కెమెరాల హ్యాకింగ్.. నిరంతర నిఘా
బ్రిటిష్ మీడియా సంస్థ ‘ఫైనాన్షియల్ టైమ్స్’ వెల్లడించిన కథనం ప్రకారం.. ఇజ్రాయెల్ ఏళ్ల తరబడి టెహ్రాన్‌లోని ట్రాఫిక్ కెమెరాలను తన నియంత్రణలోకి తీసుకుంది. ముఖ్యంగా ఖమేనీ నివాసం ఉండే పాశ్చర్ స్ట్రీట్ పరిసరాల్లోని ప్రతి కదలికను ఇజ్రాయెల్ సర్వర్లకు రియల్ టైమ్ లో చేరేలా ఏర్పాట్లు చేశారు. పాటర్న్ ఆఫ్ లైఫ్ అనే ప్రత్యేక నిఘా పద్ధతి ద్వారా ఖమేనీ ఎప్పుడు బయటకు వస్తారు, భద్రతా సిబ్బంది షిఫ్టులు ఎప్పుడు మారుతాయి, ఆయన ఏ మార్గాల్లో ప్రయాణిస్తారు అనే అంశాలను ఇజ్రాయెల్ క్షుణ్ణంగా విశ్లేషించింది.
36
ఏఐ టెక్నాలజీ, సిఐఏ పక్కా సమాచారం
శనివారం ఉదయం ఖమేనీ నివాసంలో ఒక కీలకమైన సమావేశం జరుగుతుందన్న రహస్య సమాచారాన్ని అమెరికాకు చెందిన సిఐఏ సేకరించింది. ఈ సమాచారాన్ని ఇజ్రాయెల్ అధికారులు రెండు వేర్వేరు మార్గాల్లో ధృవీకరించుకున్నారు. సాధారణంగా బంకర్లలో ఉండటానికి ఇష్టపడని ఖమేనీ, ఇటీవల దాడుల భయంతో రెండు వేర్వేరు బంకర్లకు మారుతూ వస్తున్నారు. అయితే పాశ్చర్ స్ట్రీట్‌లోని ఆయన కార్యాలయంలో సమావేశం జరుగుతున్న సమయాన్ని పక్కాగా గుర్తించిన ఇజ్రాయెల్, ఏఐ సాంకేతికతతో దాడికి ముహూర్తం ఖరారు చేసింది.
దాడికి కొన్ని నిమిషాల ముందు ఇజ్రాయెల్ అత్యంత తెలివిగా వ్యవహరించింది. పాశ్చర్ స్ట్రీట్ చుట్టూ ఉన్న సుమారు 12 మొబైల్ టవర్లను ఇజ్రాయెల్ హ్యాకర్లు పనిచేయకుండా చేశారు. దీనివల్ల ఖమేనీ భద్రతా సిబ్బంది ఒకరికొకరు సమాచారం అందించుకోలేకపోయారు. భద్రతా సిబ్బంది ఫోన్లు చేయడానికి ప్రయత్నించినప్పుడు లైన్ బిజీ అని లేదా నెట్‌వర్క్ లేదని సందేశాలు వచ్చాయి. దీనివల్ల దాడి జరుగుతున్నప్పుడు ఎటువంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేసే అవకాశం లేకుండా పోయింది.
56
బ్లూ స్పారో మిసైల్స్ దాడి
అనుమతి లభించిన వెంటనే ఇజ్రాయెల్ బ్లూ స్పారో మిసైల్స్‌ను ప్రయోగించింది. దాదాపు 1000 కిలోమీటర్ల దూరం నుండి కూడా కేవలం ఒక డైనింగ్ టేబుల్ అంత చిన్న లక్ష్యాన్ని కూడా ఈ మిసైల్స్ ఖచ్చితత్వంతో తాకగలవు. ఇరాన్ వాయు రక్షణ వ్యవస్థలు గుర్తించేలోపే ఇవి ఖమేనీ కార్యాలయంపై పడ్డాయి. ఈ దాడిలో ఖమేనీతో పాటు ఆయన భార్య మన్సూరా ఖొజస్తే, కుమార్తె, మనవడు, ఇతర బంధువులు కూడా మరణించినట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ఈ విజయాన్ని ధృవీకరించిన గంటల తర్వాత ఇరాన్ మీడియా కూడా ఖమేనీ మృతిని ప్రకటించింది.
66
మొస్సాద్ సవాల్.. ఇరాన్ సంక్షోభం
టెహ్రాన్ నగరం తమకు జెరూసలేం అంత పరిచయమని ఇజ్రాయెల్ గూఢచారులు పేర్కొనడం గమనార్హం. జూన్ నెలలో జరిగిన యుద్ధ సమయంలోనే ఖమేనీని లక్ష్యం చేసుకోవాలని భావించినప్పటికీ, రాజకీయ అనుమతులు లేకపోవడంతో అప్పుడు వెనక్కి తగ్గారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఖమేనీని అంతం చేయడం ద్వారా ఇరాన్ వెన్నెముక విరిచినట్లయిందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఘటనతో గల్ఫ్ దేశాల్లో ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగాయి. ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ ప్రతిదాడులకు దిగే అవకాశం ఉండటంతో ప్రపంచం ఆందోళన చెందుతోంది.