కాకులపై విష ప్రయోగం..
కాకులను నియంత్రించడానికి కెన్యా వైల్డ్‌లైఫ్ సర్వీస్ (కేడబ్ల్యూఎస్) పర్యావరణ నిపుణులు, కమ్యూనిటీ నేతలు, హోటల్ పరిశ్రమ ప్రతినిధులతో కలిసి చర్యలు ప్రారంభించింది. ఈ చర్యల్లో భాగంగా, స్టార్లిసైడ్ అనే విషాన్ని ఇండియా కాకుల ఆహారంలో ప్రయోగిస్తున్నారు. ఈ విషం ఇతర పక్షులు లేదా జంతువులపై ప్రభావం లేకుండా కేవలం కాకులపై మాత్రమే ప్రభావవంతంగా పనిచేస్తుంది.
విష ప్రయోగం చేయడానికి కాకులున్న ప్రాంతాల్లో కాకుండా.. ఇతర ప్రాంతాల్లో పక్షుల మాంసాన్ని ఎరగా వేస్తారు. ఎర వేసిన ప్రదేశాలకు కాకులు ఎక్కువ సంఖ్యలో వచ్చినప్పుడు వాటిపై విషప్రయోగం చేస్తారు. ఈ విష ప్రయోగం ఎలా పనిచేస్తుందని 2022లో నిర్వహించిన పరీక్షల్లో దాదాపు 2వేల కాకులు చనిపోయాయి. న్యూజిలాండ్ నుంచి దిగుమతి చేసుకున్న ఈ విషం దాదాపు 20 వేల కాకులను చంపేందుకు సరిపోతుందని అంచనా. కాగా, మరింత విషాన్ని న్యూజిల్యాండ్ నుంచి కెన్యా దిగుమతి చేసుకోనున్నట్లు తెలుస్తోంది.
అయితే, విష ప్రయోగం చేసి కాకులను చంపడంపై జంతు, పక్షుల హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాకులకు విషం ఇవ్వడం అమానవీయమని, వాటి సంఖ్యను తగ్గించేందుకు హానికరం కాని పద్ధతులను అన్వేషించాలని వాదిస్తున్నారు. పెద్ద ఎత్తున విషప్రయోగం చేయడం స్వల్పకాలిక పరిష్కారం మాత్రమే అని పర్యావరణవేత్తలు అభిప్రాయపడ్డారు. కాకుల సంఖ్యను తగ్గించేందుకు కచ్చితమైన, మానవీయ విధానాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.