పండగలు, పబ్బాలు లేక... బంధువుల ఇళ్లకు వెళ్లక.. ఐఐటీ సీట్ అటు పై... గ్రీన్ కార్డు... ఇదే ఈ జన్మకు లక్ష్యం అని పెరిగిన పిల్లలు. ఇంత టార్చర్ భరించి కస్టపడి ఉద్యోగం సంపాదించాక జాబ్... శాలరీ... ఈ రెండో లోకంగా కనిపిస్తుంది అంటే తప్పెవరిది ? "పెళ్ళొద్దు .. మీరు చస్తే ఏజెన్సీ కి డబ్బులిస్తే వారు వచ్చి ఏడ్చి పాడేకట్టి సాగనంపుతారు . అందాకా ఇదిగో నెలకు ఇంత అని ఇస్తా . ఎక్కడైనా ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉండు" అని చెప్పే కొడుకు కూతురు కాక మరి ఎలాంటి వారు తయారవుతారు ? చేసుకున్నవారికి చేసుకున్నంత.
జనాల్లో వస్తున్న మార్పులను గమనించి దాన్ని కాష్ చేసుకొనే వారెందరో ! గంజాయి షాప్స్ .. మగ సెక్స్ వర్కర్స్.. మానసిక వైద్యులు .. వృద్ధాశ్రమాలు, క్యాన్సర్ ఆసుపత్రులు, ఆటిజం, థెరపీ కేంద్రాలు, విడాకుల లాయర్లు, కాంట్రాక్ కిల్లర్స్ .. రానున్న రోజుల్లో మూడు పూవులు ఆరుకాయలుగా వెలుగొందనున్న వృత్తులు / వ్యాపారాలు. కేరళలో పదకొండో తరగతి విద్యార్థి ప్రిన్సిపాల్ ను అతని ఛాంబర్లోనే... తన సెల్ ఫోన్ ఇవ్వకపోతే బయట చంపేస్తానని బెదిరించాడు . అతని చేత బలవంతంగా సారీ చెప్పించి విషయాన్ని ముగించేశారట. పైగా వీడియో బయట పెట్టడం తప్పు అని ప్రిన్సిపాల్ కే చీవాట్లట.
సెల్ ఫోన్ దారుణాలు మితిమీరుతున్నా... తల్లితండ్రులు టీచర్స్ ప్రభుత్వాలు .. అది అసలు సమస్యే కాదని ప్రవర్తిస్తున్నాయి. ఓ కార్పొరేట్ కాలేజీ విద్యార్థి నేరుగా క్లాస్ రూమ్ నుంచి బయటకు వెళ్లి కిందకు దూకి మరణించాడు. ఆ వీడియో వైరల్ అయ్యింది . ఇలాంటి ఘటనలు సర్వసాధారణం అయిపోయాయి . కానీ వారి అడ్మిషన్స్ కు ఏమీ డోకా ఉండదు . తల్లితండ్రులకు చీమ కుట్టినట్టు అయినా ఉండదు . ఆత్మహత్యల కాలేజీలో చేర్పించారు సరే .. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడైనా.." బాబు / అమ్మా.. ఒత్తిడికి గురి కాకు .. చదివినంత వరకు చదువు... ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పు..." అని కనీసం తల్లితండ్రి చెప్పారా ?