
ప్రపంచానికే పెద్దన్న అమెరికా... ఈ అగ్రరాజ్యానికి అధిపతిగా మరోసారి డొనాల్డ్ ట్రంప్ వ్యవహరించనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ ఇవాళ(జనవరి 20, 2025) పాలనా పగ్గాలు చేపట్టనున్నారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు ట్రంప్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే అమెరికా అధ్యక్షభవనం శ్వేతసౌదంలో ఈ ప్రమాణస్వీకారం కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి.
అయితే ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారతదేశం నుండి కేవలం ఓ ఇద్దరు మాత్రమే హాజరుకానున్నారు. వాళ్లు ఎవరో కాదు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ. ఇప్పటికే ఈ జంట ట్రంప్ ప్రమాణస్వీకారం కోసం అమెరికాకు చేరుకోవడమే కాదు నూతన అధ్యక్షుడి అతిథ్యాన్ని కూడా స్వీకరించింది.
రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేముందు ప్రపంచ దేశాల్లోని ప్రముఖులు, తన సన్నిహితులకు విందు ఏర్పాటుచేసారు డొనాల్డ్ ట్రంప్. ఇందులో భారత్ నుండి కేవలం ముఖేష్, నీతా దంపతులు మాత్రమే పాల్గొన్నారు. ఇందుకోసమే ప్రమాణస్వీకారానికి రెండ్రోజుల ముందే అంటే జనవరి 18నే అంబానీ దంపతులు అమెరికాకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే విందుకు హాజరైన ముఖేష్, నీతా దంపతులు నూతన అధ్యక్షుడు ట్రంప్ తో దిగి న ఫోటో బయటకు వచ్చింది.
ట్రంప్ తో అంబానీలకు సత్సంబంధాలు :
అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ తో ముఖేష్ అంబానీకి సత్సంబంధాలు వున్నాయి. గతంలో అమెరికా అధ్యక్షహోదాలు ట్రంప్ భారత్ లో పర్యటించినప్పుడు ముఖేష్ అంబానీతో సహా వ్యాపార ప్రముఖులతో భేటీ అయ్యారు. ఈ సమయంలో రిలయన్స్ సంస్థ అమెరికాలో సాగిస్తున్న వ్యాపారాలు, ఆ దేశంలో పెట్టిన పెట్టుబడుల గుర్తించి అంబానీ ట్రంప్ కు వివరించారు.
అమెరికా ఇందన రంగంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా పెట్టుబడులు పెట్టినట్లు ముఖేష్ వివరించారు. అమెరికా అభివృద్దిలో రిలయన్స్ పాత్రపై ట్రంప్ ఆనందం వ్యక్తం చేసారు. ఈ క్రమంలోనే అమెరికాలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని... కావాలంటే ఇండియన్ కంపనీల కోసం నిబంధనలు సరళతరం చేస్తామని ట్రంప్ ప్రకటించారు.
ఇలా గతంలో చేపట్టిన ఇండియా పర్యటన సమయంలోనే ట్రంప్, ముఖేష్ మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ తర్వాత కూడా ఇది కొనసాగింది. ఇప్పుడు మరోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్న సమయంలో ట్రంప్, ముఖేష్ మద్య సత్సంబంధాలు బైటపడ్డాయి. ఇండియా నుండి కేవలం ముఖేష్, నీతా దంపతులు మాత్రమే ట్రంప్ ఇచ్చిన విందుకు హాజరయ్యారంటేనే వీరికి ఆయన ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థమవుతుంది.
ఇక అమెరికాలోనూ అంబానీదే హవా?
అమెరికా రాజధాని వాషింగ్టన్ లో ప్రమాణస్వీకారిని ముందు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యేక విందు ఇచ్చారు. ఇందుకు ప్రపంచదేశాల్లోని ప్రముఖులు, తన సన్నిహితులు కేవలం 100 నే ఆహ్వానించారు ట్రంప్. ఇందులో ఎలాన్ మస్క్ తో పాటు జెఫ్ బెజోస్, టిమ్ కుక్, మార్క్ జుకన్ బర్గ్ వంటి వ్యాపార దిగ్గజాలు పాల్గొన్నారు. ఇలా ఇండియా నుండి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్, నీతా అంబానీ మాత్రమే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ట్రంప్ తో ముఖేష్ దంపతులు భేటీ అయ్యారు. భారత్-అమెరికా మధ్య సంబంధాల గురించి మరీముఖ్యంగా వ్యాపార సంబంధాల గురించి వీరిమధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ఇరుదేశాల మధ్య మంచి సత్సంబంధాలు కొనసాగాలని ... వ్యాపార భాగస్వామ్యం మరింత మెరుగుపడాలని ఇద్దరూ కోరుకున్నట్లు తెలుస్తోంది. కాబోయే అధ్యక్షుడికి శుభాకాంక్షలు చెబుతూనే తమ వ్యాపార సామ్రాజ్యాన్ని అమెరికాలో విస్తరించేందుకు ఈ భేటీని అంబానీ దంపతులు బాగా వాడుకున్నారని చెప్పాలి.
అమెరికాలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కాబోయే అధ్యక్షుడు ట్రంప్ ఈ అంబానీ దంపతులను కోరినట్లు తెలుస్తోంది. ఇందుకు ముఖేష్ అంబానీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మొత్తంగా ట్రంప్ దృష్టిలో పడ్డ అంబానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఇక అగ్రరాజ్యంలో విస్తరించేందుకు సిద్దమయ్యారు... అధ్యక్షుడితో సత్సబంధాల కారణంగా ఇది మరింత ఈజీ అయ్యింది.
అమెరికా పాలనాపగ్గాలు చేపట్టనున్న ట్రంప్ తో అంబానీ దంపతుల భేటీతో ఓ విషయం మాత్రం క్లారిటీ వచ్చింది. ఇంతకాలం ఇండియాతో పాటు మరికొన్నిదేశాల్లో వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటుచేసిన రిలయన్స్ దృష్టి ఇప్పుడు అమెరికాపై పడిందని అర్థమవుతోంది. ఇప్పటికే అమెరికాలో అడుగుపెట్టిన రిలయన్స్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక మరింత దూకుడుగా ముందుకు వెళ్లేలా కనిపిస్తోంది.