Donald Trump: అమెరికా, ఇరాన్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. హార్ముజ్ జలసంధి మూసివేత కొనసాగుతుందని ఇరాన్ స్పష్టం చేసిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
హోర్ముజ్ జలసంధి పూర్తిగా తమ అధీనంలో ఉందని ట్రంప్ కొంతకాలంగా చెబుతున్నారు. తాజాగా ఈ ప్రాంతాన్ని అమెరికాకు చెందిన భూభాగంగా ప్రకటించే ఆలోచన కూడా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.విలేకరులతో మాట్లాడుతూ హార్ముజ్‌ను అమెరికా ప్రాంతంగా ప్రకటించాలన్న ఆలోచన మంచిదేనని ట్రంప్ అన్నారు. ఇప్పటికే అక్కడ అమెరికా నియంత్రణ కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. గతంలో కూడా హార్ముజ్‌ను అమెరికాకు చెందిన ప్రాంతంగా ప్రకటిస్తానని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా షేర్ చేసిన మ్యాప్‌లో హార్ముజ్ జలసంధిని అమెరికా భూభాగంగా చూపించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
25
ఇరాన్ మాత్రం హార్ముజ్ తమదేనంటోంది
ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. హోర్ముజ్ జలసంధి తమ నియంత్రణలోనే ఉందని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికాతో చర్చలు కొనసాగుతున్నప్పటికీ జలసంధిని తెరవడంపై ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. అమెరికా తన హామీలను అమలు చేసే వరకు హోర్ముజ్‌ను తెరవబోమని ఇరాన్ నేతలు చెబుతున్నారు. అమెరికా నౌకాదళ చర్యలను తగ్గించాలని, చమురు వాణిజ్యంపై విధించిన ఆంక్షలను తొలగించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. విదేశాల్లో నిలిచిపోయిన తమ ఆస్తులను విడుదల చేయాలని కూడా కోరుతోంది. మరోవైపు అమెరికా మాత్రం హార్ముజ్ జలసంధి అంతర్జాతీయ నౌకా రవాణాకు స్వేచ్ఛగా ఉండాలని పట్టుబడుతోంది.
35
హార్ముజ్ ఎందుకు అంత కీలకం?
హార్ముజ్ జలసంధి ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన చమురు రవాణా మార్గాల్లో ఒకటి. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని చమురు, గ్యాస్ సరఫరాలో ఈ జలసంధికి కీలక పాత్ర ఉంది. ప్రపంచంలోని అనేక దేశాలకు ఈ ప్రాంతం నుంచి చమురు, ఇంధనం సముద్ర మార్గంలో చేరుతుంది. అందుకే హార్ముజ్‌లో నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడితే ప్రపంచ ఇంధన మార్కెట్‌పై నేరుగా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ మార్గంలో నౌకల రాకపోకలు తగ్గితే చమురు సరఫరాపై ఆందోళనలు పెరుగుతాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగే అవకాశం ఉంటుంది.
అమెరికా, ఇరాన్ మధ్య చర్చల్లో హార్ముజ్ జలసంధి కీలక అంశంగా మారింది. హార్ముజ్‌ను తెరవడం, ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు, అమెరికా నౌకాదళ చర్యలు, ఇరాన్ అణు కార్యక్రమం వంటి అంశాలపై ఇరుదేశాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఇరాన్ ముందుగా అమెరికా సైనిక ఒత్తిడిని తగ్గించాలని, ఆంక్షలను ఎత్తివేయాలని కోరుతోంది. అమెరికా మాత్రం ఇరాన్‌పై ఒత్తిడిని కొనసాగిస్తూ హార్ముజ్‌ను పూర్తిగా తెరవాలని డిమాండ్ చేస్తోంది. ఇరువైపులా కీలక అంశాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చర్చలు ముందుకు సాగడం కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో ట్రంప్ షేర్ చేసిన మ్యాప్ వివాదాన్ని మరింత పెంచింది.
55
ప్రపంచ చమురు మార్కెట్‌పై ప్రభావం ఎంత?
హార్ముజ్ జలసంధి మూసివేత లేదా నౌకా రవాణాపై ఆంక్షలు కొనసాగితే ప్రపంచ ఇంధన సరఫరాకు గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది. చమురు రవాణాలో అంతరాయం ఏర్పడితే సరఫరా తగ్గి ధరలు పెరగవచ్చు. చమురు ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు, ఇంధన ధరలు, నౌకలకు సంబంధించిన భీమా వ్యయాలు కూడా పెరిగే అవకాశం ఉంది. దీని ప్రభావం కేవలం చమురు మార్కెట్‌కే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడొచ్చు. అందుకే అమెరికా–ఇరాన్ మధ్య హోర్ముజ్ అంశంపై నెలకొన్న వివాదాన్ని ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. హోర్ముజ్ జలసంధి విషయంలో ఇరుదేశాల మధ్య రాజీ కుదిరి నౌకా రవాణా సాధారణ స్థితికి వస్తుందా? లేక ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయా? అనేది ఇప్పుడు కీలకంగా మారింది.