నగర ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను పరిశీలించి, గూగుల్ టెక్నాలజీలను ఉపయోగించి దీని సామర్థ్యాన్ని మెరుగుపర్చే మార్గాలను అన్వేషించారు. ఇటీవల గూగుల్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య వివిధ రంగాల్లో సాంకేతికత ఆధారిత పరిష్కారాలను అమలు చేయడానికి ఒక అవగాహన ఒప్పందం (MoU) కుదిరిన విషయం తెలిసిందే. ఐసీసీసీ సందర్శించిన సమయంలో గూగుల్ ప్రతినిధులుగా చందు థోటా, రావు సురపనేని , శాలిని పుచ్చలపల్లి , శేషు అజ్జరపు, రాజేశ్ రంజన్‌తో పాటు పలువురు ఉన్నారు.
ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) పనితీరును గూగుల్ ప్రతినిధులకు వివరించారు. రియల్-టైమ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, అధునాతన సర్వైలెన్స్, డేటా అనలిటిక్స్, గూగుల్ మ్యాప్స్ డేటా ద్వారా ట్రాఫిక్ జామ్ హాట్‌స్పాట్లను గుర్తించడంపై ప్రస్తుత వ్యవస్థ ఎలా పనిచేస్తుందో వివరిస్తూ ప్రెజెంటేషన్ ఇచ్చారు. గూగుల్ నిపుణులు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అధికారుల మధ్య జరిగిన చర్చల్లో పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.