గూగుల్ ప్రతినిధులతో సమావేశం..
హైదరాబాద్‌లో తన ఏఐ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్ ప్రకటించింది. ప్రభుత్వంతో కలిసి కృత్రిమే మేధ ఆధారిత సేవలు అందించేందుకు గూగుల్ గురువారం ఒప్పందం కుదురుచ్చుకుంది. ఇందులో భాగంగానే గచ్చిబౌలిలోని టీ హబ్‌లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుల సమక్షంలో గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్ ప్రీతి లోబానాతో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఈ మేరకు ఎంవోయూపై సంతకాలు చేశారు. వ్యవసాయం, పరిపాలన, రవాణా విద్యా వంటి కీలక రంగాల్లో ఏఐ సేవలను అమలు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక గూగుల్ ఫర్ ఎడ్యుకేషన్ పేరుతో ఏఐ నైపుణ్యాలు పెంచే దిశగా గూగుల్ నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన పాఠశాలల్లో డిజిటల్ అభ్యసన పద్ధతులను ప్రారంభిస్తుంది.
ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఏఐ ఆధారిత తెలంగాణ దార్శనికతకు గూగుల్ సహకారం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మెరుగైన పాలన, ఆర్థిక పురోగతితో పాటు ప్రజా సేవలను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు చెప్పుకొచ్చారు. ఈ లక్ష్య సాధనలో గూగుల్‌తో ఒప్పందం కీలకంగా నిలుస్తుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.