
నిద్ర నుంచి శరీరాన్ని తాజాగా ఉంచడం వరకు.. స్నానం మనకు ఎన్నో విధాలా సహాయపడుతుంది. శారీరక, మానసిక స్థితిని మెరుగ్గా ఉంచడానికి ఎంతో సహాయపడుతుంది. ప్రతిరోజూ స్నానం చేయడం మంచి అలవాటు. ఇది వ్యక్తిగత పరిశుభ్రతకు మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. మీకు తెలుసా? సరైన సమయంలో, సరైన మార్గంలో స్నానం చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. కానీ తప్పుడు సమయంలో స్నానం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. మరి ఏ సమయంలో స్నానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
రోజూ స్నానం చేయడం ఆరోగ్యకరమైన అలవాటు
ఆయుర్వేదం స్నానం చేయడానికి ఉత్తమ సమయాన్ని వివరించింది. అలాగే ఎప్పుడు స్నానం చేయకూడదనే దాని గురించి కూడా పూర్తి సమాచారాన్ని ఇస్తుంది. అయితే చాలా మంది వానాకాలం, చలికాలంలో రోజూ స్నానం చేయరు. కానీ ఆయుర్వేదం ప్రకారం.. రెగ్యులర్ గా స్నానం చేయాలి. నిజానికి స్నానం ఒక పరిశుభ్రత అభ్యాసం. దీనిలో వ్యక్తి తన శరీరాన్ని నీరు, సబ్బుతో కడిగి శుభ్రం చేసుకుంటాడు. ఇది మన శరీరంపై ఉన్న దుమ్ము, ధూళీ, మృత కణాలు, నూనె, చెమట, బ్యాక్టీరియాను తొలగిస్తుంది. నిజానికి వీటిని మనం మన కళ్లతో చూడలేము.
నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ ఇన్ఫర్మేషన్ నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం.. స్నానం ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఒక మంచి మార్గం. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ స్నానం చేసే వారికి ఒంటి నొప్పి, టెన్షన్, ఒత్తిడి లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయని నివేదికలో వెళ్లడించారు.
స్నానం చేయడానికి 'సరైన సమయం' ఏది?
చాలా మంది ఎప్పుడు పడితే అప్పుడు స్నానం చేస్తుంటారు. కానీ ఇది మంచి పద్దతి కాదు. ఎందుకంటే ఇది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఆయుర్వేదం స్నానం చేయడానికి సరైన సమయాన్ని సూచిస్తుంది. డాక్టర్లు కూడా ఈ సమయంలోనే స్నానం చేయాలని సూచిస్తున్నారు. కొంతమంది ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. సాయంత్రం కాకుండా ఉదయమే స్నానం చేయాలి. ఎందుకంటే ఉదయం స్నానం చేయడం వల్ల వారు ఎనర్జిటిక్ గా, తాజాగా ఉంటారు. అయితే సాయంత్రం పూట స్నానం చేయడం వల్ల మీ చర్మ రంధ్రాలు మూసుకుపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల మొటిమలు అయ్యే అవకాశం ఉంది.
నిపుణుల ప్రకారం.. ఉదయం వ్యాయామం చేసిన తర్వాత అలసటగా అనిపిస్తుంది. ఈ సమయంలో స్నానం చేయడం వల్ల అలసట నుంచి ఉపశమనం పొందుతారు. స్నానం చేయడంలో కొన్ని తప్పులు చేయకూడదు. అవేంటంటే..?
తిన్న తర్వాత స్నానం చేయొద్దు
నిపుణుల ప్రకారం.. తిన్న తర్వాత స్నానం అసలే చేయకూడదు. ఎందుకంటే మీరు తిన్న వెంటనే స్నానం చేసినప్పుడు మీరు తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడే జీర్ణ రసాలకు అంతరాయం కలుగుతుంది. దీనివల్ల ఆహారం సరిగా జీర్ణం కాక అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
స్నానానికి ముందు నీటిని తాగాలి
స్నానానికి ముందు ఒక గ్లాసు నార్మల్ లేదా వేడినీళ్లు తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల అధిక రక్తపోటు ఉంటే గుండె సమస్యలు రావు. వేడి నీటిని తాగడం వల్ల మీ శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అలాగే మీ శరీరాన్ని లోపలి నుండి వేడెక్కిస్తుంది. దాని వల్ల మీ చర్మం కాంతివంతంగా మారుతుంది.
శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు స్నానం వద్దు
జ్వరం ఉన్నప్పుడు స్నానం చేయకపోవడమే మంచిది. అయితే చాలా మంది జ్వరం వచ్చినప్పుడు శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకోవడానికి స్నానం చేయాలనుకుంటారు. కానీ ఆయుర్వేదం ప్రకారం.. శరీరం వేడిగా ఉంటే స్నానం చేయొద్దు. ఇది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. జ్వరం ఉన్నప్పుడు స్నానం చేయడం వల్ల కండరాలు ఎర్రబడతాయి, దీనిని 'మయోఫాసిటిస్' అంటారు. అలాగే ఇది మెడ బిగుతు, నొప్పి, తక్కువ వెన్నునొప్పి, మోకాలి నొప్పి వంటి సమస్యలను కలిగిస్తుంది.