ప్రముఖ ఫార్మా సంస్థ నోవో నార్డిస్క్ వారానికి ఒకసారి తీసుకునే బేసల్ ఇన్సులిన్ 'అవిక్లీ' (ఇన్సులిన్ ఐకోడెక్)ని ఇండియాలో విడుదల చేసింది. ఈ నూతన ఆవిష్కరణ మధుమేహ రోగులకు రోజువారీ ఇంజెక్షన్ల బాధను తప్పించి, చికిత్సను సరళతరం చేస్తుంది.
మధుమేహ చికిత్సలో గణనీయమైన ముందడుగు పడింది. ప్రముఖ ఫార్మా సంస్థ నోవో నార్డిస్క్ కేవలం వారానికి ఒకసారి తీసుకునే బేసల్ ఇన్సులిన్ 'అవిక్లీ' (ఇన్సులిన్ ఐకోడెక్)ని భారత్‌లో విడుదల చేసింది.
ప్రస్తుతం మధుమేహ బాధితులు తమ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడానికి రోజుకు ఒకటి లేదా రెండుసార్లు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది రోగులకు శారీరకంగా, మానసికంగా ఇబ్బందికరంగా మారుతోంది. ఈ క్రమంలోనే సంవత్సరానికి 365 సార్లు సూదులు గుచ్చుకునే బాధ నుండి ఈ అవిక్లీ ఇన్సులిన్ విముక్తి కల్పిస్తుంది.
24
ఈ వీక్లీ ఇన్సులిన్ ఎలా పనిచేస్తుందో తెలుసా?
ఏడు రోజుల పాటు పనిచేసే ఈ సరికొత్త వీక్లీ ఇన్సులిన్ ఇంజెక్షన్ శరీరంలో ప్రత్యేకంగా పనిచేస్తుంది. ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత అది రక్తంలో ఉండే ఆల్బుమిన్ అనే ప్రొటీన్‌తో బంధాన్ని ఏర్పరచుకుంటుంది. ఈ బంధం కారణంగా ఇన్సులిన్ శరీరంలో చాలా నెమ్మదిగా, క్రమ పద్ధతిలో ఏడు రోజుల పాటు నిరంతరాయంగా విడుదల అవుతుంది. ఫలితంగా వారం పొడుగునా బ్లడ్ షుగర్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా స్థిరంగా నియంత్రించబడతాయి.
34
వీక్లీ ఇన్సులిన్ ప్రయోజనాలు..
అంతర్జాతీయ క్లినికల్ ట్రయల్స్ ప్రకారం... ఈ వీక్లీ ఇన్సులిన్ ముఖ్యంగా టైప్-1, టైప్-2 డయాబెటిస్ ఉన్న పెద్దవారికి అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది రోజువారీ ఇన్సులిన్‌తో పోలిస్తే HbA1c స్థాయిలను మెరుగ్గా తగ్గిస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువసేపు లక్ష్య పరిధిలో ఉండేలా చేస్తుంది
క్లినికల్ పరీక్షల్లో రక్తంలో చక్కెర నియంత్రణలో ఇది రోజువారీ ఇన్సులిన్‌తో పోలిస్తే మెరుగైన ఫలితాలను ఇచ్చినట్లు తెలుస్తోంది. భద్రతలోనూ ఇదే స్థాయి ఫలితాలు నమోదయ్యాయి. ఇది హైపోగ్లైసీమియా ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
వీక్లీ ఇన్సులిన్ ఇంజెక్షన్ షుగర్ పేషెంట్స్ కి వరమే..
ఆఫీసు పనుల వల్ల లేదా ప్రయాణాల వల్ల రోజువారీ ఇన్సులిన్ తీసుకోవడం మర్చిపోయే వారికి, వృద్ధులకు ఈ వీక్లీ ఇన్సులిన్ ఒక వరంగా మారబోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల చికిత్సను మధ్యలో ఆపేసే సమస్యలు తగ్గుతాయి, తద్వారా మధుమేహ నియంత్రణ మరింత సులభతరం అవుతుంది.
ఈ వీక్లీ ఇన్సులిన్ సాంకేతికంగా ఎంతో అధునాతనమైనది అయినప్పటికీ, దీనిని రోగులు సొంతంగా మెడికల్ షాపుల నుండి కొనుగోలు చేసి వాడకూడదు. రోగి ప్రస్తుత ఆరోగ్య స్థితిని బట్టి డోసేజీని వైద్యులే నిర్ణయించాల్సి ఉంటుంది. ఈ కొత్త ఇన్సులిన్ లభ్యత భారతదేశంలో మధుమేహ నియంత్రణలో ఒక కీలకమైన మైలురాయిగా నిలవనుంది.