గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి?

First Published | Jun 8, 2024, 3:46 PM IST

ఈ రోజుల్లో గుండె జబ్బుల కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా చిన్న వయసులోనే చాలా మంది పురుషులు గుండెపోటుతో మరణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో మీ గుండె ఆరోగ్యంగా ఉండటానికి ఏం చేయాలో తెలుసుకుందాం పదండి. 

heart health

మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో గుండె ఒకటి. ఇది మన శరీరంలో ఎన్నో ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. అందుకే ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యకరమైన గుండె చాలా ముఖ్యం. ముఖ్యంగా పురుషులు తమ గుండెను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఇల్లు, కుటుంబ బాధ్యత వల్ల పురుషులు తమ ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోరు. దీని వల్లే వీరు ప్రమాదకరమైన సమస్యల బారిన పడుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా పురుషులలో మరణానికి గుండె జబ్బులే ఒక ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. అలాగే భారతదేశంలో గుండెపోటు ఎన్నో కారణాల వల్ల చిన్న వయస్సులోనే పురుషులను ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా చిన్న వయసు పురుషులకు కూడా హార్ట్ ఎటాక్ వస్తోంది. అందుకే ఇలాంటి పరిస్థితిలో పురుషులు తమ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

heart health

ధూమపానం మానేయండి

ధూమపానం ఆరోగ్యానికి చాలా హానికరం. ఎందుకంటే ఇది ధమనులు, రక్త నాళాలను దెబ్బతీస్తుంది. అంతేకాదు గుండె ఆరోగ్యాన్ని కూడా రిస్క్ లో పడేస్తుంది. అలాగే మెదడు, శరీరంలోని ఇతర అవయవాలలో రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ధూమపానం కూడా ఎన్నో రకాల క్యాన్సర్లకు కారణమవుతుంది. మీరు ఆరోగ్యంగా ఎక్కువ కాలం బతకాలంటే మాత్రం స్మోకింగ్ కు దూరంగా ఉండాలి. 
 



శారీరక వ్యాయామం

ఈ రోజుల్లో జనాల జీవనశైలి పూర్తిగా మారిపోయింది. దీని వల్ల శారీరక శ్రమ చాలా తగ్గిస్తుంది. కానీ నిశ్చల జీవనశైలి గుండె జబ్బులకు కారణమవుతుంది. ఇలాంటి పరిస్థితిలో మీ గుండె ఆరోగ్యంగా ఉండటానికి మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వాకింగ్,  రన్నింగ్, సైక్లింగ్ లేదా స్విమ్మింగ్ వంటి కార్యకలాపాలను రెగ్యులర్ గా చేయాలి. ఇది మీ గుండెను బలంగా చేస్తుంది. శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే అధిక రక్తపోటును తగ్గిస్తుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. 
 

ఆరోగ్యకరమైన బరువు

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం కూడా చాలా అవసరం. ఎందుకంటే అధిక బరువు గుండెపై ఒత్తిడిని తెస్తుంది. అలాగే అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, డయాబెటిస్ వంటి సమస్యల ప్రమాదం పెరుగుతుంది. మీరు పోషకాహారం తింటూ రెగ్యులర్ గా వ్యాయామం చేస్తే బరువు సులువుగా తగ్గుతారు. మీ గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. 
 

సమతుల్య, పోషకాహారం 

ఆరోగ్యంగా ఉండటానికి సమతుల్య, పోషకాహారం తీసుకోవాలి. ఇందుకోసం మీరు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, సన్నని ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా తీసుకోవాలి. ఇవి మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అయినప్పటికీ శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు ముఖ్యంగా స్వీట్లు, చక్కెర పానీయాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, వేయించిన ఆహారాలు, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. 
 

ఒత్తిడి నిర్వహణ, తగినంత నిద్ర

ఎక్కువ సేపు ఒత్తిడికి గురైతే మీ గుండెపై చెడు ప్రభావం పడుతుంది. ఇలాంటి పరిస్థితిలో మీ గుండెను జాగ్రత్తగా చూసుకోవడానికి మీరు ఒత్తిడిని తగ్గించుకోవాలి. దీని కోసం మీరు ధ్యానం, లోతైన శ్వాస వంటి వ్యాయామాలను చేయొచ్చు. ఇది కాకుండా ఆరోగ్యకరమైన గుండె కోసం తగినంత నిద్ర కూడా చాలా అవసరం. కాబట్టి ప్రతి రాత్రి 7-9 గంటల పాటు కంటినిండా నిద్రపోండి. ఎందుకంటే నిద్ర లేకపోవడం వల్ల గుండె జబ్బులు, అధిక రక్తపోటు, ఊబకాయం వంటి సమస్యల ప్రమాదం పెరుగుతుంది.

Latest Videos

click me!