ఇంట్లోనే ఎంతో రుచికరమైన బాదుషా ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?

First Published Nov 23, 2021, 2:21 PM IST

ప్రతి ఫంక్షన్లలోనూ స్వీట్ తప్పక ఉంటుంది. అలాంటి వాటిలో బాదుషా (Badusha) ఒకటి. ఉత్తర భారతదేశంలో ఈ బాదుషాని బాలుషాహి అని పిలుస్తారు. బాదుషా బయట క్రిస్పీగా ఉండి లోపల మెత్తగా ఉంటుంది. నోట్లో పెట్టుకోగానే మెత్తగా కరిగిపోతుంది. బాదుషాలు తయారుచేయడం చాలా సులభం. సరైన కొలతలతో పిండిని కలుపుకుంటే బాదుషాలు చక్కగా వస్తాయి. బాదుషాలను ఇంట్లోనే తయారుచేసి మీ కుటుంబ సభ్యులకు సర్వ్ చేయండి. ఇవి వారికి ఎంతగానో నచ్చుతాయి. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా బాదుషాలను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..
 

బాదుషాల తయారీకి కావలసిన పదార్థాలు:
250 గ్రాముల మైదాపిండి (Maida), చిటికెడు వంటసోడా (Soda), చిటికెడు బేకింగ్ సోడా (Baking soda), రెండు టేబుల్ స్పూన్ ల డాల్డా (Dalda), ఢీ ఫ్రైకి సరిపడు ఆయిల్ (Oil), సగం స్పూన్ పటిక (Patika), 500 గ్రాముల చక్కెర (Sugar), కొద్దిగా యాలకుల పొడి (Cardamom powder).
 

తయారీ విధానం: ముందుగా 250 గ్రాముల మైదాపిండిని ఒక గిన్నెలో తీసుకుని అందులో చిటికెడు సోడా, చిటికెడు బేకింగ్ సోడా, రెండు టేబుల్ స్పూన్ ల వేడి వేడి డాల్డా వేయాలి. పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిపై తడిగుడ్డ (Damp cloth) కప్పి పక్కన పెట్టుకోవాలి. పాకం తయారీకి ఒక వంతు మైదాకు రెండు వంతుల చక్కెరను తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెను (Bowl) తీసుకొని 500gms చక్కెర వేసి 250ml నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి పాకం తయారు చేసుకోవాలి. ఈ పాకం తీగ పాకానికి కాస్త తక్కువగా ఉండాలి.
 

పాకం తయారు చేసుకునేటప్పుడు అందులో సగం స్పూన్ పటిక, కొద్దిగా యాలకుల పొడి వేయాలి. పటిక వేయడం ద్వారా పాకం చిక్కపడదు. ఇప్పుడు బాదుషా ఢీ ఫ్రై కోసం స్టవ్ మీద బాండ్లీ పెట్టి అందులో ఆయిల్ (Oil) వేసి వేడి చేయాలి. నూనె బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న బాదుషా పిండిని చేత్తో బాదుషా ఆకారంలో ఒత్తుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి ఇప్పుడు బాదుషాలను నూనెలో వేయాలి. బాదుషాలు నూనెను పీల్చుకున్న తరువాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. తక్కువ మంట (Low flame) మీద బాదుషాలను ఢీ ఫ్రై చేసుకోవాలి.
 

ఇలా ఢీ ఫ్రై చేసుకున్న బాదుషాలను వేడి వేడి చక్కెర పాకంలో (Caramel) వేయాలి. చక్కెర పాకంలో బాదుషాలను కొద్ది సేపు ఉంచిన తర్వాత వెంటనే తీసి ప్లేట్ లో పెట్టుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన బాదుషాలు రెడీ (Ready). ఇలా బాదుషాలను ఇంట్లోనే ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక్క సారి వీటిని ట్రై చేసి చూడండి. ఈ బాదుషాలు మీ కుటుంబ సభ్యులకు, పిల్లలకు నచ్చుతాయి.

click me!