
మన దేశంలో మధుమేహుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. అందుకే భారతదేశాన్ని మధుమేహానికి రాజధాని అని అంటుంటారు. పెరుగుతున్న డయాబెటిస్ కేసులు భారతీయ ఆహారంపై పెద్ద ప్రశ్నను లేవనెత్తాయి. ఈ డయాబెటీస్ కేసులను ఆపడానికి ఆహారంపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. అయితే చాలా మంది డయాబెటీస్ ఉన్నా బియ్యాన్ని తింటుంటారు. కానీ బియ్యం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అందుకే వీటిని పూర్తిగా తినకపోవడమే మంచిది. అయితే వైట్ రైస్ కు బదులుగా మధుమేహులు బ్రౌన్ రైస్ ను తినొచ్చు. ఎందుకంటే?
పోషకాలు ఎక్కువగా ఉండే బ్రౌన్ రైస్ పాలిష్ చేయబడవు. అందుకే దీనిలో ఫైబర్ తో పాటుగా ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అదే తెల్లబియ్యంలో అయితే పాలిషింగ్ ప్రక్రియ ఈ పోషకాలన్నింటినీ తొలగిస్తుంది.
బ్రౌన్ రైస్ ఎందుకు ప్రత్యేకం
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. బ్రౌన్ రైస్ లో ప్రోటీన్, ఫైబర్, మాంగనీస్, మెగ్నీషియం, సెలీనియం, భాస్వరం, విటమిన్ బి 1, విటమిన్ బి 6 పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ దీనికి ప్రత్యేకతలు. బ్రౌన్ రైస్ సులభంగా జీర్ణం అవుతుంది. డయాబెటిస్ పేషెంట్లు బరువు తగ్గడం కూడా సులువు అవుతుంది.
బ్రౌన్ రైస్ గ్లైసెమిక్ ఇండెక్స్
ఆహార పదార్ధాల గ్లైసెమిక్ ఇండెక్స్ ఈ ఆహార వనరు రక్తంలో చక్కెర స్థాయిలను ఎంత పెంచుతుందో కొలుస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు ఏం తినాలి? ఏం తినకూడదో కూడా ఇది చెబుతుంది. అధిక జీఐ ఉన్న ఆహారాలు మీడియం లేదా తక్కువ జీఐ ఉన్న ఆహారాల కంటే రక్తంలో చక్కెర స్థాయిలను మరింత వేగంగా పెంచుతాయి. అలాగే మితమైన, తక్కువ జీఐ ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిలు ప్రభావితం అవుతాయి. బ్రౌన్ రైస్ గ్లైసెమిక్ ఇండెక్స్ 55. వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. డయాబెటిస్ పేషెంట్లు తెల్ల బియ్యం కంటే బ్రౌన్ రైస్ ను తీసుకోవడమే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే వైట్ రైస్ లో ఎక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. వైట్ రైస్ ను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. వైట్ రైస్ డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అదే బ్రౌన్ రైస్ లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలలో తక్కువ మార్పు మాత్రమే వస్తుంది.
వైట్ రైస్, వైట్ బ్రెడ్ వంటి ఇతర కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలను ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల వంటలను తయారుచేయడానికి ఉపయోగిస్తున్నారు. చైనాలో బాగా పాలిష్ చేయబడిన తెల్ల బియ్యం సంపదకు చిహ్నంగా, బ్రౌన్ రైస్ ను పేదరికానికి చిహ్నంగా భావిస్తారు.
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఫైబర్ అధికంగా ఉండే బ్రౌన్ రైస్ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయి సాధారణంగా ఉంటుంది. లేదా మార్పు చాలా నెమ్మదిగా ఉంటుంది. డయాబెటిస్ ను నియంత్రించడానికి బ్రౌన్ రైస్ బాగా ఉపయోగపడుతుంది.
టైప్ 2 డయాబెటిస్ ఉన్న 16 మంది పెద్దలపై పబ్మెడ్ సెంట్రల్ ఈ అధ్యయనం నిర్వహించింది. తెల్ల బియ్యం తిన్న వారితో పోలిస్తే, 2 సేర్విన్గ్స్ బ్రౌన్ రైస్ ను తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని కనుగొన్నారు.