ఛాతి నొప్పి అనేది చాలా సాధారణ లక్షణం. చిన్న కండరం నొప్పి నుంచి గుండెపోటు వరకు ఏదైనా దీనికి కారణం కావచ్చు. అయితే గుండెపోటుకి సంబంధించిన ఛాతి నొప్పికి, ఎసిడిటీ వల్ల వచ్చే ఛాతి నొప్పికి తేడా తెలియక చాలామంది కన్ఫ్యూస్ అవుతారు. ఆ తేడాని 100% కచ్చితంగా చెప్పలేనప్పటికీ కొన్ని సూచనల ద్వారా ఏది ఛాతిమంట, ఏది గుండెనొప్పి అనేది చెప్పవచ్చు.
ఆ తేడాలు ఇప్పుడు చూద్దాం. గుండె నొప్పికి సంబంధించిన ఛాతి నొప్పి అనేది రొమ్ము భాగం నుంచి గొంతు భాగం వరకు ఎక్కడైనా రావచ్చు. ఎక్కువగా ఛాతి మధ్యభాగంలో వస్తుంది. ఒక్కొక్కసారి ఎడమ పక్క అప్పుడప్పుడు కుడిపక్క రావచ్చు. అయితే ఎసిడిటీ నొప్పి కూడా అలాగే వస్తుంది.
అయితే ఎసిడిటీ నొప్పి వచ్చినప్పుడు ఎడమ చేయి లేదా ఎడమ భుజం లో నొప్పి రాదు. అలాగే గుండెపోటు కి సంబంధించిన నొప్పి వచ్చినప్పుడు చెమటలు పట్టడం, వాంతులు, విపరీతమైన నీరసం వస్తుంది. అలాగే నడుస్తున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది.
గ్యాస్టిక్ నొప్పి వచ్చినప్పుడు కూడా వాంతులు అవుతాయి కానీ శ్వాస సంబంధిత సమస్యలు ఉండవు. అలాగే గుండె నొప్పి వచ్చినప్పుడు గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ఒళ్లంతా చెమటలు పడతాయి. తల తిరగటం ఊపిరాడక ఇబ్బంది పడటం జరుగుతుంది.
ఛాతి భాగం పట్టేసినట్లు అయిపోయి.. గుండె పిండేస్తున్నట్టు, దేనితోనో పొడుస్తున్నట్లు అనిపిస్తుంది. నొప్పి మెల్లగా మొదలై వచ్చి పోతూ ఉంటుంది. అదే ఎసిడిటీ వల్ల వచ్చిన మంట అయితే నొప్పి గొంతుకకి పాకుతుంది. జీర్ణాశయం నుంచి పుల్లటి తేనుపులు రావడంతో పాటు గొంతు చేదుగా అనిపిస్తుంది.
ఆహారం పొట్టలోంచి గొంతులోకి వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఛాతిలో సూదితో గుచ్చినట్లు చిన్నగా మంట మొదలవుతుంది. పక్కటెముకల్లో, పొడవాటి ఎముకల్లో కూడా నొప్పి వస్తుంది. కాబట్టి తేడా తెలుసుకుని జాగ్రత్త పడండి.